నాయకుడు ఆదేశిస్తాడు.. రాయుడు పాటిస్తాడు! | TDP Leaders Corruption In Revenue Office Kurnool | Sakshi
Sakshi News home page

నాయకుడు ఆదేశిస్తాడు.. రాయుడు పాటిస్తాడు!

Feb 15 2019 7:24 AM | Updated on Feb 15 2019 7:24 AM

TDP Leaders Corruption In Revenue Office Kurnool - Sakshi

ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు, పాసుపుస్తకాలు చూపుతున్న జయరాం

చట్టంతో ఆయనకు సంబంధం లేదు. టీడీపీ నేత చెప్పిందే శాసనం. తన పరిమితులు దాటి ఎవరినైనా బెదిరించడం ఆయన నైజం. ఇదేంటని గట్టిగా ప్రశ్నిస్తే అధికార బలాన్ని ఉపయోగిస్తాడు. భూములు ఆక్రమించుకున్నారని నోటీసులు జారీ చేస్తాడు. కొలతలు వేయించి పట్టాలు రద్దు చేస్తానంటూ బెదిరిస్తాడు. మహానంది మండలంలో ఓ రెవెన్యూ ఉన్నతాధికారి నియంత ధోరణి ఇది. ఈ అధికారి వేధింపులు తాళలేక  బుక్కాపురం గ్రామానికి చెందిన రైతు రఘురామ్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చావు బతుకుల నుంచి తప్పించుకున్నాడు.  

మహానంది: మహానంది తహసీల్దార్‌ కార్యాలయంలో ఉన్నతాధికారి చెప్పిందే వేదం. అధికారపార్టీ నేతలు అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. ఏ అధికారి అయినా అధికారపార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నేతలను సైతం గౌరవిస్తారు. కానీ ఈయన శైలి మాత్రం వేరు. కేవలం అధికారపార్టీ పక్షానే ఉంటూ వారి పనులకే పెద్దపీట వేస్తున్నాడు. ప్రతి గ్రామంలో ఉన్న అధికారపార్టీ నాయకులను ఓ కోటరీగా తయారు చేసుకుని వారి పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలే టార్గెట్‌.. 
శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆయన టార్గెట్‌. టీడీపీ నేతల ఆదేశాలతో వైఎస్సారీసీపీ కార్యకర్తలైన రైతులకు నోటీసులు జారీ చేయడం..సాగు చేసుకుంటున్న భూములు ప్రభుత్వానివని బెదిరించడం పరిపాటిగా మారింది. ఇప్పటికే ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న 60 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని పట్టా భూములు ఉన్నాయి. కలెక్టర్లు జారీ చేసిన డీ పట్టాలను రద్దు చేయడం, పాసు పుస్తకాల్లో భూములను తొలగించే అధికారం తహసీల్దార్లకు లేదు. దీంతో పలువురు బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. లాయర్ల ద్వారా నోటీసులు జారీ చేశారు.

‘చుక్క’లు చూపిస్తూ... 
చుక్కల భూములను ఆన్‌లైన్‌లో చేర్చేందుకు వివిధ పత్రాలు కలిగి ఉండాలన్న నెపంతో రైతులకు సదరు అధికారులు చుక్కలు చూపిస్తున్నాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఓ రైతు భూమిని చేర్చేందుకు ఎకరాకు రూ. 10వేలు డిమాండ్‌ చేశాడు. ఆయనకు ఉన్న 4.56సెంట్ల భూమిని చేర్చాలంటే సుమారు రూ. 50వేలు డిమాండ్‌ చేయగా.. రూ. 25వేలకు బేరం కుదుర్చుకున్నా నేటికీ పని కాలేదని తెలుస్తోంది. సంబంధిత రైతు గత జన్మభూమిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. కార్యాలయంలో ఏ విషయం బయటకు చెప్ప వద్దని సిబ్బందిని భయాందోళనలకు గురిచేస్తున్నాడు. ఓటరు జాబితా వివరాలు కావాలన్నా..సదరు అధికారిని అడగాల్సిందే! 

పట్టా ఉన్నా సరే వేధిస్తున్నాడు.. 
బుక్కాపురం గ్రామానికి చెందిన మారెడ్డి జయరాం, మారెడ్డి రఘురామ్‌లకు సర్వే నంబరు 89లో చెరో 50 సెంట్ల చొప్పున ఎకరా పొలం ఉంది. వీరిద్దరికి పాసుపుస్తకాల్లో పట్టా నంబర్లు 1002, 1003లలో చెరి 50సెంట్లు ఉంది.  అప్పటి తహసీల్దార్‌ 2004లో డీ పట్టాలు జారీ చేశారు. సుమారు 45 ఏళ్ల నుంచి ఈ పొలాన్ని జయరాం వంశస్తులు సాగు చేసుకుంటున్నారు.  ఈ పొలం ప్రభుత్వానికి చెందినదని తహసీల్దార్‌ ఇటీవల నోటీసులు జారీ చేశాడు.

 దీనికి కారణం జయరాం వైఎస్సార్‌సీపీకి చెందినవాడు కావడమే. వీరికే చెందిన మరో పొలం సర్వే నంబరు 93లో 1.25 సెంట్లు పొలం పూర్తిగా ప్రభుత్వానిదే అంటూ నోటీసులు ఇవ్వడం, అధికారపార్టీ నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకుని రావడంతో మారెడ్డి రఘురామ్‌ ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. కానీ డీపట్టాలను రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని చట్టాలు తెలిసిన న్యాయవాదులు చెబుతున్నా.. ఈ అధికారి మాత్రం వినకపోవడం వెనుక అధికారపార్టీ నేతల ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్థం అవుతూనే ఉందని చెప్పకనే చెప్పవచ్చు.
 
సైనికురాలి సతీమణి పోరాటం..  
బండిఆత్మకూరుకు చెందిన ఆదిలక్ష్మి భర్త నాగశేషఫణి భారత సైన్యంలో పనిచేశాడు. ఆయనకు 1992లో మహానంది మండలంలోని పూలకుంట చెరువులో 816 సర్వే నంబరులో 5.08 ఎకరాల భూమిని ఇచ్చారు. అయితే ఇదే పొలానికి రెవెన్యూ అధికారులు మహానంది మండలానికి చెందిన ఓ ముఖ్య అధికారపార్టీ నేతకు పట్టా ఇచ్చారు. దీంతో ఆదిలక్ష్మి కార్యాలయం చుట్టూ తిరుతున్నా, రెవెన్యూ సదస్సులు, జన్మభూమి సభలకు హాజరై  తన పరిస్థితి చెప్పుకుని కన్నీటి పర్యంతమవుతున్నా అధికారికి కనికరం లేకుండా పోయింది. తహసీల్దార్‌ను అడిగితే భూములు గుర్తించాక ఇస్తామంటున్నారని బాధితురాలు వాపోతున్నారు.   

అధికారి అవినీతిపై కరపత్రాలు.. 
మహానంది మండలంలో అవినీతికి పాల్పడుతున్న రెవెన్యూ ఉన్నతాధికారిపై సీపీఐ(ఎంఎల్‌) రెడ్‌స్టార్‌పార్టీ, సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదలయ్యాయి.  పుట్టుపల్లెలో ఒకే రేషన్‌ కార్డుపై భార్యకు, భర్తకు వేర్వేరుగా ఇళ్లపట్టాలు ఇచ్చారని కరపత్రాల్లో పేర్కొన్నారు. రెవెన్యూ భూములు కాకపోయినా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌..తదితర భూముల్లో ఉన్నవారికి సైతం నోటీసులు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది మృతి చెందిన వారిపేరు మీద ఆన్‌లైన్‌లో భూములు చేర్చినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement