సిగ్నే‘చోర్‌’..! 

TDP Leader Irregularities In Srikakulam District - Sakshi

నందిగాం తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా అక్రమాలు 

డిజిటల్‌ సిగ్నేచర్‌ దుర్వినియోగం చేసిన అక్రమార్కులు

తప్పుడు పాసు పుస్తకాల సృష్టిలో రెవెన్యూ పాపం

నందిగాం టీడీపీ నేతకు సహకరించిన రెవెన్యూ సిబ్బంది

ఇంకా కొనసాగుతున్న తెలుగు తమ్ముళ్ల అక్రమాలు   

వీళ్లు మామూలు దొంగలు కాదు. సిగ్నే‘చోర్‌’లు. అంటే డిజిటల్‌ సంతకాలను కూడా దొంగిలించేవారు. నందిగాంలో వెలుగు చూసిన భూ బాగోతంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. చోరులు తమ అక్రమాలకు ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయాన్నే కేంద్రంగా చేసుకున్నారు. తహసీల్దార్‌కు ఉండే డిజిటల్‌ సిగ్నేచర్‌ కీనే వాడుకున్నారు. ఇదంతా ఎలా జరిగింది? ఎవరు చేశారు? అక్రమార్కుడికి సహకరించినదెవరు? తహసీల్దార్‌కు తెలీకుండా జరిగిందా? ఇంకేదైనా గూడు పుఠాణీ నడిచిందా? ఇప్పుడు తేలాల్సి ఉంది. అధికారంలో ఉన్నన్నాళ్లూ అంతులేని అక్రమాలకు పాల్పడిన టీడీపీ నాయకులు ఓడిపోయిన తర్వాత కూడా కొన్ని చోట్ల చక్రం తిప్పుతున్నారు. దానికి నందిగాం ఘటనే సాక్ష్యం. మొత్తానికి ఇక్కడి రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా ఏదో నడిచిందనే చెప్పాలి. ఇలాంటి తప్పుడు పాసు పుస్తకాలు, వన్‌బీల్లో దిద్దుబాట్లు ఇంకెన్ని సృష్టించారో, ఇంకెన్ని బాగోతాలు చేశారో నిగ్గు తేల్చాలి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పేదోడికి సెంటు స్థలం ఇవ్వలేదు గానీ ప్రభుత్వ భూములను మాత్రం టీడీపీ నేతలు ఇష్టారీతిన ఆక్రమించారు. తమ పేర్లను రికార్డుల్లోకి ఎక్కించుకున్నారు. అంతటితో వారి భూదాహం తీరలేదు. తమకు తెలిసిన వ్యక్తుల పేరు మీద ఉన్న భూముల వివరాలనే మార్చేసి మాల్‌ ప్రాక్టీసుకు పాల్పడ్డారు. ఇందులో కొందరు రెవెన్యూ సిబ్బంది సహకరించారు. తిలా పా పం తలా పిడికెడు అన్నట్టుగా భూముల రికార్డుల మార్పిడిలో కుమ్మక్కై కథ నడిపారు. చెప్పాలంటే అక్రమార్కులతో చేతులు కలిపారు. అక్రమార్కుడు అధికారుల స్టాంపు, డిజిటల్‌ సిగ్నేచర్‌ పక్కా గా వినియోగించుకున్నాడంటే రెవెన్యూ కార్యాలయం కేంద్రంగా భూమాయ ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు.  

అనువంశికంగా దఖలు పడిన భూమిని తన పేరున మార్చి, పట్టాదారు పాసుపుస్తకం, 1బీ, అడంగల్‌లు ఇప్పించాలని కాళ్లు అరిగేలా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగి నా 1బీ రాదు, పాసుపుస్తకం రాదన్న పరిస్థితులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ పలుకుబడి, రెవెన్యూ సిబ్బందితో మచ్చిక చేసుకుంటే తనది కాని భూమిని కూడా తన పేరున, తన వారి పేరున ఎకరాల కొద్దీ మార్చేస్తారని నందిగాంలో తాజాగా జరిగిన ఘటన ద్వారా తెలుస్తోంది.

గత ప్రభుత్వ కాలంలో మండలంలో చక్రం తిప్పిన కొంత మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తమకు కని పించిన ప్రభుత్వ భూములను, పోరంబోకు భూములను, మెట్టలను తమ పేరున మార్చుకొని లక్షలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు పొందడం, ఇన్‌పుట్‌ సబ్సిడీలు పొందటం, బీమా పరిహారం పొందటం వంటివి చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడంతో ఆరితేరిన సిబ్బంది వీరికి లోపాయికారీగా సహకరించడం, తహసీల్దారు పని ఒత్తిడిలో తన డిజిటల్‌ కీను కంప్యూటర్‌ ఆపరేటర్లకు ఇవ్వడంతో తహసీల్దార్‌కు సంబంధం లేకుండానే భూములు మార్చకోవడం జరుగుతోంది. తాజా వ్యవహారంలో ఏం జరిగిందో విచారణలో తేలాలి.  

అంతులేని అక్రమాలు..
తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్‌ విషయంలో బాధితుడు ఆన్‌లైన్‌లో  రెవెన్యూ రికార్డులు చూసి మోసపోయిన విషయం గుర్తించారు. మండల పరిధిలోని హరిదాసుపురా నికి చెందిన ఇద్దరు మహిళలు, మరో వ్యక్తికి మాదిగా పురం, సొంఠినూరు పరిధిలో సుమారు 60 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చూపుతుండగా, క్షేత్రస్థాయిలో వారికి 12 సెంట్లు, 24 సెంట్లు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులు లేకుండా మండలంలోని మాదిగా పురం పరిధిలో గురుబెల్లి చిన్నిమ్ములు, తలగాపు సత్యవతిల పేరున సుమారు 14 ఎకరాలను, సొంఠినూరు పరధిలో గురుబెల్లి చిన్నమ్మలు పేరున 15 ఎకరాలు, తలగాన సత్యవతి పేరున 15 ఎకరాలు, కల్లేపల్లి త్రినాథరావు పేరున 15 ఎకరాలకు రెవెన్యూ రికార్డులను తయారు చేయించి వారి పేరున 1బీలు, అడంగల కాఫీలు తయారు చేశారు.

అలాగే శివరాంపురం పంచాయతీ బడబందలో 149–1లో ఉన్న మెట్టలో 15 ఎకరాల వరకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పేరున 1బీలు తయారు చేసుకున్నారని, కాపుతెంబూరు పరిధిలో సర్వే నంబర్‌ 28, 28–2, లట్టిగాం పరిధిలో సర్వే నంబర్‌ 3–10లో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వారి పేరున తయారు చేసుకున్నారని, గొల్లూరు పంచాయతీ సొంఠినూరు సర్వే నంబర్‌ 1లో ఉన్న కొండపై అనేక మంది పట్టాలు సృష్టించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇవే కాదు బయటకు రాని భూములు ఇంకా చాలా ఉన్నాయన్న వాదనలు ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే మదన్‌గౌడ్‌ లాంటి వారు మరింత మంది బయటకు వస్తారని తెలుస్తోంది. 

ఫిర్యాదులపై దృష్టి సారిస్తే.. 
మండల పరిధిలో వందల ఎకరాల భూముల రెవెన్యూ రికార్డులను కొంతమంది తమ పేరున మార్చుకొన్న వ్యవహారంపై అధికారులకు పలు ఫిర్యాదులు వచ్చినా వాటిని పరిశీలించకపోవడం, దర్యాప్తు చేయకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలను కట్టడి చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే ప్రస్తుత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావు ఇవ్వనప్పటికీ నేటికీ తారుమారైన రికార్డులు, భూములపై దృష్టి సారించకపోవడం వల్ల గత అక్రమాల కు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. మండల పరిధిలోని భూముల వ్యవహారంపై విజిలెన్స్‌ దర్యాప్తు చేపట్టాలని ఇప్పటికే పలువురు కోరుతున్నారు.  

డిజిటల్‌ సిగ్నేచర్‌ దుర్వినియోగంపై ఫిర్యాదు  
నాకున్న డిజిటల్‌ సిగ్నేచర్‌ ఎలా దుర్వి నియోగమైందో విచారించి, దోషులను పట్టుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. డిజిటల్‌ సిగ్నేచర్‌ను ఆయుధంగా చేసుకుని రికార్డుల మార్పిడి చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్నాను. పోలీ సుల విచారణ నివేదిక మేరకు చర్యలు తీసుకుంటాను. అలాగే ఇలాంటివి ఎక్కడెక్కడ జరిగాయో గుర్తించండని వీఆర్‌ఓలతో సమావేశం పెట్టి చెప్పాను.         
  – ఎన్‌.రాజారావు, తహసీల్దార్, నందిగాం  

తెలుగు యువత అధ్యక్షుడికి 14 రోజుల రిమాండ్‌ 
నందిగాం: రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి లేని భూమిని ఉన్నట్లుగా న మ్మించి అమ్మేయబోయిన నందిగాం మండల తెలుగు యువత అధ్యక్షుడు మదన్‌గౌడ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మదన్‌గౌడ్‌పై నందిగాం పోలీసు లు కేసు నమోదు చేసి బుధవారం టెక్కలి కోర్టుకు తరలించారు. స్థానిక ఇన్‌చార్జి మెజిస్ట్రేట్‌ ప్రకాశరావు మదన్‌ను 14 రోజుల రిమాండ్‌కు పంపించారు. అనంతరం పోలీసులు శ్రీకాకుళం జిల్లా జైలుకు తరలించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top