చింతలపూడి ఎత్తిపోతల్లో చిలక్కొట్టుడు

TDP Govt Planning To Do Scam In Chintalapudi Lift Irrigation - Sakshi

జల్లేరు రిజర్వాయర్‌  నీటి నిల్వ సామర్థ్యం పెంపు

పనులను నామినేషన్‌పై అప్పగించాలని చంద్రబాబు ఒత్తిడి

ఎస్‌ఎల్‌ఎస్‌సీ తిరస్కరించడంతో ‘బోర్డ్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇంజినీర్స్‌’కు పంపాలని ఆదేశం

అస్మదీయునికి పనులు కట్టబెట్టడం ద్వారా రూ.100 కోట్ల కమీషన్‌ వసూలుకు ఎత్తుగడ 

సాక్షి, అమరావతి: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న నానుడిని ఒంటబట్టించుకున్న సీఎం చంద్రబాబు అధికారాంతాన కూడా దొరికినంత దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలు పూర్తయ్యాయి. 23న ఫలితాలు రానున్నాయి. ఈ లోపు అందివచ్చిన ఏ అవకాశాన్నీ ఆయన వదలడం లేదు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు సంబంధించి రూ.1182 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయునికి కట్టబెట్టడం ద్వారా రూ.వంద కోట్లను కమీషన్‌గా వసూలు చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. 

ఇప్పటికే రూ.563.40 కోట్ల పనులను నామినేషన్‌ పద్ధతిలో..
గోదావరికి వరద వచ్చే 90 రోజుల్లో రోజుకు 56 క్యూసెక్కుల చొప్పున 20 టీఎంసీలు తరలించి.. పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు రూ.1701 కోట్లతో చింతలపూడి ఎత్తిపోతలను 2009లో చేపట్టారు. ఈ పనులను అప్పట్లోనే కాంట్రాక్టర్లకు అప్పగించారు. టీడీపీ సర్కార్‌ వచ్చాక చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచింది. రోజుకు 194.53 క్యూసెక్కుల చొప్పున 53.5 టీఎంసీలు తరలించి.. అదనంగా నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 2.80 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచాలని ప్రతిపాదించారు. సామర్థ్యం పెంచడం వల్ల కొత్తగా చేపట్టాల్సిన పనులను 2 ప్యాకేజీల కింద కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. పాత కాంట్రాక్టర్లకు రెండు ప్యాకేజీల కింద రూ.563.40 కోట్ల విలువైన పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించి.. రూ.50 కోట్లకుపైగా ఇప్పటికే కమీషన్‌లు వసూలు చేసుకున్నారు.

రిజర్వాయర్‌ పనుల నిర్మాణ వ్యయం రూ.1182 కోట్లు
జల్లేరు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యాన్ని 8 నుంచి 20 టీఎంసీలకు పెంచే పనులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారీ బాధ్యతలను ఏడాది క్రితం కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రిజర్వాయర్‌ను 20 టీఎంసీలతో నిర్మిస్తే తెలంగాణ ప్రాంతంలోని సుమారు 4,500 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని కాంట్రాక్టర్‌ తేల్చారు. తెలంగాణ నుంచి అభ్యంతరాలు వస్తాయనే నెపంతో జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని 14 టీఎంసీలకు తగ్గించారు. అంటే.. జల్లేరు రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎనిమిది నుంచి 14 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల 10,248 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని.. ఇందులో 6,672 ఎకరాలను అటవీ భూమిగా తేల్చారు. మిగతా 3,576 ఎకరాల భూమి ప్రైవేటు భూమిగా గుర్తించారు. ఇందులో ఇప్పటికే 2,657 ఎకరాలు సేరించారు. మరో 7,591 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణపోను ఈ రిజర్వాయర్‌ పనుల నిర్మాణ వ్యయం రూ.1182 కోట్లుగా నిర్ణయించారు.

తుది అంకంలోనూ కమీషన్‌లే..
ఎన్నికలు పూర్తయ్యాయి. మే 23న ఫలితాలు రానున్నాయి. అయినా సరే తుది అంకంలోనూ సీఎం చంద్రబాబు తన నడతను మార్చుకోవడం లేదు.. సరికదా మరింత దూకుడు పెంచారు. జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచే పనులను తాను సూచించిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలని ఎస్‌ఎల్‌ఎస్‌సీకి ప్రతిపాదనలు పంపేలా జలవనరులశాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కానీ నామినేషన్‌పై పనులు అప్పగించడాన్ని ఎస్‌ఎల్‌ఎస్‌సీ వ్యతిరేకించింది. టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తే ఖజానాకు భారీ ఎత్తున ఆదా అయ్యే అవకాశం ఉంటుందని తేల్చి చెప్పింది. దాంతో ఎస్‌ఎల్‌ఎస్‌సీపై చిందులు తొక్కిన సీఎం చంద్రబాబు.. ఆ ప్రతిపాదనలను బీవోసీఈకి పంపాలని ఆదేశించారు.

తక్షణమే బీవోసీఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. తాను సూచించిన కాంట్రాక్టర్‌కే జల్లేరు రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపు పనులను అప్పగించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. నామినేషన్‌పై పనులు అప్పగించడానికి బీవోసీఈ ఆమోదముద్ర వేయడమే తరువాయి.. ఆ వెంటనే ఆ కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకోవాలని జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఆ కాంట్రాక్టర్‌ నుంచి కనీసం రూ.వంద కోట్లకు పైగా కమీషన్‌ల రూపంలో వసూలు చేసుకోవడానికి చంద్రబాబు పావులు కదుపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top