టీడీపీ సిట్టింగ్‌లకు చెమటలు

Sweat For Tdp Sitting Mlas - Sakshi

ఎన్నికల వేళ టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. ఇదిగో...అదిగో అంటూ అభ్యర్థుల ప్రకటనపై తాత్సారం చేస్తుండటంతో సిట్టింగ్‌లకూ చెమటలు పడుతున్నాయి. అనంతపురం పార్లమెంట్‌ పరిధిలోని ఒక్క స్థానాన్ని కూడా నేటికీ ఖరారు చేయకపోవడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎంపీ స్థానానికి తొలుత ఓకే అన్న జేసీ పవన్‌ కూడా ఇపుడు అసెంబ్లీపైనే గురిపెట్టడంతో అంతా గందరగోళంగా మారింది.  

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటనపై టీడీపీ తాత్సారం చేస్తోంది. గురువారం రాత్రి 126 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు...జిల్లాలో ఐదు స్థానాలపై మాత్రమే ప్రకటన చేశారు. ఇక అనంతపురం పార్లమెంట్‌లోని అసెంబ్లీ స్థానాలను పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో సిట్టింగ్‌లతో పాటు ఆశావహుల్లో గుబులు రేపుతోంది. వాస్తవానికి మూడు స్థానాలు మినహా తక్కిన అసెంబ్లీల అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. కొందరు ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే తాజాగా  ‘అనంత’ పార్లమెంట్‌ స్థానంతో పాటు పలు అసెంబ్లీ అభ్యర్థులను మార్చాలనే ప్రతిపాదనతో అభ్యర్థిత్వాలపై చంద్రబాబు మరోసారి సమీక్ష చేస్తున్నట్లు తెలుస్తోంది.   

శింగనమల సీటెవరికో..? 
శింగనమల టిక్కెట్‌ యామినీబాలకు లేదని తేల్చారు. ఆమె స్థానంలో శ్రావణికి ఇవ్వాలని జేసీ పట్టుబడుతున్నారు. ఈమె అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఒకవేళ పవన్‌ ఎంపీగా బరిలోకి దిగకపోతే జేసీ సిఫార్సు చేసిన శ్రావణిని కూడా పక్కనపెడతారా...? అనే చర్చ కూడా నడుస్తోంది. అనంతపురం, శింగనమల, గుంతకల్లు అసెంబ్లీ అభ్యర్థులను మార్పు చేయకపోతే తాను, తన కుటుంబ సభ్యులు ఎంపీగా పోటీ చేసే విషయమై పునరాలోచిస్తామని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అమరావతిలో విలేకరుల ఎదుట ప్రకటించారు. ఇదిలా ఉండగా జేసీ పవన్‌ తప్పుకుంటే కచ్చితంగా కాలవ శ్రీనివాసులు పార్లమెంట్‌ బరిలో దిగాల్సి వస్తుంది. అప్పడు రాయదుర్గానికి అసెంబ్లీ అభ్యర్థి ఉండరు. కాలవ శ్రీనివాసులు ఎమ్మెల్యేగా బరిలో ఉంటే తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిస్తానని ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ప్రకటించారు. దీపక్‌రెడ్డికి సర్దిచెప్పేకుందుకు దివాకర్‌రెడ్డి ప్రయత్నిస్తే దీపక్‌ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించినట్లు తెలుస్తోంది. ఇలా మొత్తంగా పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక అభ్యర్థుల ప్రకటన వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

జేసీ రాజకీయం తాడిపత్రికే పరిమితమా..? 
జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబరాజకీయం కేవలం తాడిపత్రికే పరిమితమైంది. 2014లో కాంగ్రెస్‌ నుంచి తమ్ముడు ప్రభాకర్‌రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన దివాకర్‌రెడ్డి  ‘అనంత’ ఎంపీగా తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా ఎన్నికల్లో ‘అనంత’ పార్లమెంట్‌తో తాడిపత్రి అసెంబ్లీ స్థానాల్లో జేసీ బ్రదర్స్‌ తమ వారసులను బరిలో దింపాలని భావించారు. తొలిజాబితాలో పేర్లు కూడా ఖరారు చేసుకున్నారు. జేసీ పవన్‌ చేయించుకున్న సర్వేల్లో తనకు ప్రతికూల ఫలితాలు వచ్చినా వెనక్కు తగ్గలేదు. అయితే టీడీపీ అంతర్గత సర్వేల్లో కూడా ఇదే అంశం వెల్లడికావడంతో చంద్రబాబే పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. పవన్‌కు బదులు దివాకర్‌రెడ్డిని బరిలో దింపితే కనీసం గట్టి పోటీ అయినా ఇచ్చినట్టు ఉంటుందని భావించి ఈ మేరకు దివాకర్‌రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు జేసీ పవన్‌ కూడా తాజాగా చేయించుకున్న సర్వేలో 78 వేల నుంచి 90 వేల ఓట్లతో ఓడిపోతున్నట్లు వెల్లడైంది. పైగా శింగనమల, కళ్యాణదుర్గం, గుంతకల్లు, అనంతపురంలో పార్టీ అభ్యర్థులెవరైనా ఓటమి పాలవుతారన్న రిపోర్టు రావడం...తక్కిన మూడు నియోజకవర్గాల్లోనూ వాతావరణం ఆశాజనకంగా లేకపోవడంతో జేసీ పవన్‌ ఎంపీ స్థానంపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

తెరపైకి కాలవ పేరు 
అనంతపురం పార్లమెంట్‌ నుంచి తాను వద్దని, వైఎస్సార్‌సీపీ బీసీ అభ్యర్థిని బరిలో ఉండటంతో కాలవ శ్రీనివాసులను పార్లమెంట్‌ బరిలో నిలుపుదామనే ప్రతిపాదన జేసీ పవన్‌ చంద్రబాబు ముందు ఉంచిన ట్లు తెలుస్తోంది. తనకు అనంతపురం అసెంబ్లీ లేదా గుంతకల్లు నుంచి అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే జేసీ సిఫార్సును చంద్రబాబు పరిగణలోకి తీసు కుంటారా...? లేదా? అనేది తేలాల్సి ఉంది. జేసీ చేసిన ప్రతిపాదనలతోనే అనంతపురం పార్లమెంట్‌ గందరగోళమైందన్న ఆలోచనతోనే చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.

 
ప్రభాకర్‌ చౌదరి అభ్యర్థిత్వంపై పునఃసమీక్ష 
‘అనంత’ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పునఃసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. జేసీతో పాటు టీడీపీకి చెందిన బలిజ, కమ్మ, మైనార్టీ వర్గాలంతా చౌదరికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. చౌదరికి టిక్కెట్‌ ఇస్తే ఎంపీ ఓట్లు తమకు పడకుండా క్రాస్‌ ఓటింగ్‌ చేయిస్తారని, కాబట్టి కచ్చితంగా అతన్ని మార్చాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో చౌదరికి ఇవ్వాలా? లేదంటే మైనార్టీ, బలిజ సామాజికవర్గ అభ్యర్థిని ప్రకటిస్తే ప్రయోజనం ఉంటుందా? అనే కోణంలోనూ చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం అసెంబ్లీ ఖరారైందని యోచనతో ఉన్న అమిలినేని సురేంద్రబాబును కూడా ‘అనంత’ అసెంబ్లీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రభాకర్‌ చౌదరి, దివాకర్‌రెడ్డిని రాజీ చేసి విభేదాలు లేకుండా చేస్తే బాగుంటుందని మంత్రి గంటాతో పాటు దేవినేని ఉమా సీఎంకు సూచించినట్లు తెలుస్తోంది.  

గుప్తాకు మొండిచెయ్యేనా..? 
గుంతకల్లు అభ్యర్థిగా మధుసూదన్‌గుప్తాను బరిలోకి దించాలని జేసీ భావించి టీడీపీలోకి రప్పించారు. ఇప్పుడు గుంతకల్లు నుంచి పవన్‌ బరిలోకి దిగాలనుకోవడంతో గుప్తా కూడా ఆలోచనలో పడ్డారు. మరోవైపు గుప్తా కంటే అక్కడ బీసీ నేత అయితేనే మేలనే కోణంలో తిరిగి జితేంద్రగౌడ్‌నే కొనసాగిస్తే బాగుంటుందని కూడా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. వెంకటశివుడు యాదవ్‌ పేరు పరిశీలనలోకి వచ్చినా.. చివరకు పక్కనపెట్టేశారని తెలుస్తోంది. ఏదిఏమైనా ‘గుప్తా’కు చంద్రబాబు మొండిచేయి చూపే అవకాశాలే ఉన్నట్లు తెలుస్తోంది. తనకు టిక్కెట్‌ ఇస్తే గౌడ్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతారనే ఆలోచనతో టీడీపీ మళ్లీ గౌడ్‌ పేరును పరిశీలిస్తోందని, ఇదే సమయంలో తనకు టిక్కెట్‌  ఇవ్వకపోతే పార్టీ వీడుతానని గుప్తా అధిష్టానానికి హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది.  
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top