ఇంకా ఆరని సెగలు

still burning in tires company - Sakshi

రెండో రోజూ అదే ఆందోళన

పరారీలో యజమాని

తుమ్మపాల (అనకాపల్లి): అనకాపల్లి మండలంలో చింతనిప్పుల అగ్రహారం రెవిన్యూ పరిధిలో రేబాక గ్రామాన్ని ఆనుకొని ఉన్న టైర్ల కంపెనీలో మంటల సెగ చెల్లారలేదు. గ్రామంలో సైతం ఆందోళన తగ్గలేదు. మరోవైపు అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వారి కుటుంబీకులు ఆవేదనలో ఉండగా.. యాజమాని అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టైర్‌ వ్యర్థాలు, కార్టన్‌ పొడి, లిక్విడ్‌ వంటి సామగ్రి అగ్ని ప్రమాదానికి గురికావడంతో ఆ వేడి తగ్గకపోగా, ఆ మంటలను ఆపే విషయంలో అధికారుల మధ్య సమన్వయం లోపించింది.

కంపెనీ యాజమాన్యం, స్థానిక పంచాయితీ ప్రతినిధులు సహకరిస్తేనే మంటలను అదుపు చేయగలమని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. కంపెనీ చుట్టూ ఉన్న తోటల కారణంగా పెనుగాలులు వీస్తే ఏ క్షణంలో ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్కడ కుప్పలు కుప్పలుగా పడి ఉన్న టైర్లలో అగ్నిని ఆర్పాలంటే జేసీబీ సహాయం అవసరమని ఫైర్‌ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై కంపెనీ నిర్వాహకులు కాని, గ్రామపాలకులు గాని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్ధితిని ఎప్పటికప్పుడు తెలియపరిచేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను కంపెనీ వద్ద ఉంచారు. దీనికి తోడు ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ అధికారులు సంఘటన స్ధలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

అనుమతులపై రాని స్పష్టత: టైర్ల కంపెనీ చింతనిప్పుల అగ్రహారం రెవెన్యూ పరిధిలో ఉన్నందున అనుమతులు తామే ఇచ్చామని, ధ్రువీకరణ పత్రాలు పంచాయతీ కార్యాలయంలో ఉన్నాయని ఆ గ్రామ సర్పంచ్‌ ముమ్మన పైడిరాజు మంగళవారం చెప్పారు. ఈ ఘటన జరిగి ఒక్క రోజు కూడా పూర్తవ్వకముందే అనుమతులు తాలూకు ధ్రువీకరణ పత్రాలు మాత్రం లేవని బుధవారం తెలిపారు. ఈ పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి.

రాజమండ్రిలో కంపెనీ యజమాని?
ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ కంపెనీ యజమాని ఆచూకీ తెలియలేదు. అతని కోసం పోలీసులు గాలింపు తీవ్రతరం చేశారు. సూపర్‌వైజర్‌ గణేష్‌తో యాజమాని కిషోర్‌ సంభాషణను ట్యాప్‌ చేసిన పోలీసులు మంగళవారం రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే గణేష్‌తో బయలుదేరి రెక్కీ నిర్వహించారు. విషయం తెలుసుకున్న యాజమాని అక్కడ నుంచి కూడా పరారైనట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్ధితుల్లోను యాజమానిని పట్టుకుని క్షతగాత్రులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావించి ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top