పల్లెకు పోదాం చలో.. చలో

Special Bus Services Sankranthi Festival - Sakshi

ప్రయాణికులతో కిక్కిరిసిన పీఎన్‌బీఎస్‌

50 శాతం అధిక ధరలతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బస్‌స్టేషన్‌(విజయవాడ సెంట్రల్‌): సకుటుంబ సపరివారంగా తెలుగింట నిర్వహించుకునే సంప్రదాయ పండుగ సంక్రాంతి సందడి అంతటా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతా పల్లెబాట పట్టారు. పట్టణాలు, టౌన్లలో వివిధ ఉద్యోగాలు, పనుల రీత్యా స్థిరపడిన వారు అంతా పల్లె బాట పట్టారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ఇతరత్రా ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారు, విద్య, ఉద్యోగాల నిమిత్తం నగరానికి వచ్చిన వారు తమ గమ్యస్థానాలకు వెళ్లేవారితో బస్టాండ్‌లో పండుగ వాతావరణం అలముకుంది. గత వారం రోజులుగా ప్రధానంగా రాయలసీమ, విశాఖపట్నం సెక్టార్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లు షెడ్యూల్‌ ప్రకారం ఉన్న బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి.

ఆర్టీసీ107 ప్రత్యేక సర్వీసులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్‌లో షెడ్యూల్‌ ప్రకారం కాకుండా అదనపు సర్వీసులను 50 శాతం అదనపు చార్జీలతో 107 ప్రత్యేక బస్సులుగా ఏర్పాటు చేశారు. ఈ మేరకు విశాఖపట్నం–27, రాజమండ్రి–31, రాయలసీమ–27, కాకినాడ–4 అమలాపురం–11, నెల్లూరు–2, ఒంగోలు–4, రావులపాలెం–1బస్సుల్ని అదనంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా విజయవాడ నగరంతోపాటు రూరల్‌ ప్రాంతాలకు తరలివచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఇక్కడి నుంచి బస్సుల్ని పంపించారు. వారిని తరలించేందుకు కృష్ణా రీజియన్‌ నుంచి 87 బస్సుల్ని హైదరాబాద్‌ పంపారు. ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక బస్సులకు సంబంధించి రిజర్వేషన్లు ఆన్‌లైన్‌ అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. అవి కూడా ఎప్పటికప్పుడు పూర్తయిపోతున్నట్లు వివరించారు.

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:  ట్రాఫిక్‌ మేనేజర్‌ మూర్తి
సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు తాకిడి ఎక్కువైందని, వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ మూర్తి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు బస్టాండ్‌లో శుక్రవారం కిందిస్థాయి అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ప్రయాణికుల రాకపోకల విషయంలో నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో ఉండాలన్నారు. ట్రాఫిక్‌ సిబ్బంది బస్సుల నిలుపుదల విషయంలో డ్రైవర్లు అలసత్వం వహిస్తారని ట్రాఫిక్‌ సమస్య రాకుండా వారిని అప్రమత్తం చేయాలన్నారు. బుకింగ్‌ సూపర్‌వైజర్స్‌ వచ్చిన బస్సుల్ని వచ్చినట్లుగా ప్రయాణికుల్ని ఎక్కించి పంపించాలన్నారు. స్టాల్స్‌ నిర్వాహకులు ఎటువంటి అధికధరలకు విక్రయించకుండా చూసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ మనోహర్, ట్రాఫిక్‌ సీఐలు, అసిస్టెంట్‌లు, బుకింగ్‌ సూపర్‌వైజర్స్‌లు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top