
పెంచేనా? వంచనేనా?
జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు తీసుకునే వారికి టెన్షన్ పట్టుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని పెంచుతున్నారన్న ఆనందం కన్నా, పెంపుదల అమలుకు ఎన్ని
సాక్షి, రాజమండ్రి : జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు తీసుకునే వారికి టెన్షన్ పట్టుకుంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని పెంచుతున్నారన్న ఆనందం కన్నా, పెంపుదల అమలుకు ఎన్ని మతలబులు పెడతారోనన్న అనుమానమే ఇందుకు కారణం. పెంచిన పెన్షన్‌లను గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు నుంచి అమలు చేస్తానని చెబుతూ ఫైలుపై సంతకం చేసిన చంద్రబాబు ‘గత చరిత్రనే తిరగరాయరు కదా..’ అన్న సందేహంతో సతమతమవుతున్నారు.
జిల్లాలో వివిధ రకాల పింఛన్ల లబ్ధిదారులు 4.75 లక్షల మంది ఉండగా వారిలో 2.60 లక్షల మంది వృద్ధులు, 1.15 లక్షల మంది వితంతువులు, 57,000 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన వారు, ఇతరులు సుమారు 43,000 ఉన్నారు. వీరిలో సుమారు 95 వేల మందికి వివిధ కారణాలుగా ఈ నెల పింఛన్లు ఇంకా అందాల్సి ఉంది. వీటిని బయో మెట్రిక్ పద్ధతి ద్వారా పంపిణీ చేస్తున్నారు. ఈ విధానంలో లబ్ధిదారుల వేలి ముద్రలు సరిపోలక 15 వేల మంది మూడు నెలలుగా పింఛన్ అందుకోలేక పోతున్నారు.
చంద్రబాబు హామీ ఇదీ..
ప్రస్తుతం వృద్ధులకు, వితంతువులకు నెలకు రూ.200, వికలాంగులకు రూ.500 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువులకు రూ.700, వికలాంగులకు రూ.1,000 అందచేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు వృద్ధులు, వితంతువులకు రూ.1,000, వికలాంగులకు రూ. 1,500 ఇస్తామని వాగ్దానం చేశారు. టీడీపీ అధికారాన్ని దక్కించుకోవడంతో బాబు ఇచ్చిన వాగ్దానం వెంటనే అమలవుతుందని లబ్ధిదారులు ఆశపడ్డారు. అయితే అక్టోబర్ నుంచి అమలు చేస్తామని చెప్పడం వారికి తీవ్ర నిరాశకు గురి చేసింది.
లబ్ధిదారుల అనుమానమిదీ..
గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వృద్ధులు, వితంతువులకు పింఛన్‌గా కేవలం రూ.75.. అదీ కొద్దిమందికి మాత్రమే ఇచ్చేవారు. కొత్తగా ఎవరికైనా పింఛన్ రావాలంటే లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోయి ఖాళీ వస్తేనే. మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ అనుచిత విధానానికి స్వస్తి పలికి, అర్హులందరికీ రూ.200 పింఛన్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో వృద్ధులు పాత అనుభవాలను గుర్తు తెచ్చుకుని గుబులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్నదని, శ్వేత పత్రాలు విడుదల చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇస్తానన్న రూ.వెయ్యి పింఛను అమలుకు ఎన్ని ఆంక్షలు విధిస్తారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.