'స్నేక్‌'హితుడు

Snake Hunter Venkatesh Special Story - Sakshi

విషనాగుతో సైతం విన్యాసాలు చేయించే ధీశాలి

వృత్తి ఆటోడ్రైవర్‌.. పాముల రక్షణ ప్రవృత్తి..

మెలకువలు నేర్చకుంటున్న విదేశీయులు

పాము కనబడితేనే ఆమడ దూరం పారిపోతాం.ఈ వ్యక్తి మాత్రం పాము ఎప్పుడుకనబడుతుందా అని ఎదురుచూస్తాడు.పాము బొమ్మను పట్టుకుంటేగజగజలాడిపోతాం.  ఈయన మాత్రం పామునుఓ ఆటబొమ్మల్లే ఆడుకుంటాడు.పేరు పెచ్చేటి వెంకటేష్‌. మండలంలోనిజంపెన గ్రామానికి చెందిన వ్యక్తి. పాములు పట్ట్టడంలో నేర్పరి. విదేశీయులకు సైతంమెలకువలు నేర్పేటంత పనితనం ఈయన సొంతం. అందుకే పరిసర గ్రామాల్లో పాముకనబడితే చాలు వెంకటేష్‌ ఫోన్‌ రింగ్‌మంటుంది.– మాడుగుల

‘పాములు ప్రకృతిలో భాగం. ప్రకృతిని పరిరక్షిస్తేనే మనిషికి మనుగడ. అందుకే పాము కనబడితే కొట్టి చంపొద్దు. దయచేసి నాకు సమాచారం ఇవ్వండి..’ అంటూ అభ్యర్థిస్తాడు వెంకటేష్‌. చిన్నతనం నుంచి పాములంటే తనకు చాలా ఇష్టమని చెప్పే ఈ ‘స్నేక్‌’హితుడు చదువుకుంది కేవలం పదోతరగతి మాత్రమే. జీవనాధారం కోసం ఆటో నడుపుతున్నాడు. ప్రస్తుతం మాడుగులలో నివాసం ఉంటున్న వెంకటేష్‌కు చిన్ననాటి నుంచి పాములపట్టడంపై ఆసక్తిని పెంచుకున్నాడు. ఎటువంటి పరికరాలు, రక్షణ చర్యలు లేకుండానే విషనాగును సైతం ఇట్టే పట్టేస్తాడు. పుట్టలో ఉన్న పామును సైతం తోక పట్టుకుని బయటకిలాగే నేర్పరితనం ఆయన సొంతం.

ఇంటిపేరు మారింది...
పెచ్చేటి వెంకటేష్‌ అంటే చాలామందికి తెలియదు. ‘పాముల’ వెంకటేష్‌గానే సుపరిచితుడు. పట్టుకున్న ప్రతి పామును ఫొటోతీసి అది ఏ ప్రాంతంలో దొరికింది.. ఏ జాతికి చెందినది.. ప్రమాదకరమైనదా.. కాదా అనే విషయాల్ని రికార్డు రూపంలో భద్రపరచడం అలవాటుగా చేసుకున్నాడు వెంకటేష్‌. ఇప్పటి వరకూ వందల సంఖ్యలో పాముల్ని పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్న వెంకటేష్‌ సేవల్ని అటవీశాఖ గుర్తించింది. ప్రశంసా పత్రాల్ని అందించింది. గ్రామాల్లో వెంకటేష్‌ పేరుతో నేమ్‌బోర్డులను కూడా ఏర్పాటు చేసింది.

ఫోన్‌ చేస్తే చాలు...
ఫలానా ప్రాంతంలో పాము ఉందని ఫోన్‌ చేస్తే చాలు ప్రత్యక్షమవుతాడు. అటవీశాఖ సిబ్బందికంటే వేగంగా స్పందిస్తున్నాడు. ఇళ్లలోకి వచ్చిన పాముల్ని సైతం పట్టుకుని అడవిలో విడిచిపెడతాడు. ప్రభుత్వం పరంగా వెంకటేష్‌కు సాయమందిస్తే బాగుంటుంది.  –జవ్వాది వరహాలు, మాడుగుల

వెంకటేష్‌ ఇంటికి కెనడా నుంచి వచ్చిన నిపుణులు
నిరుపేద కుటుంబంలో పుట్టినా..  
వెంకటేష్‌ది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు అతికష్టంమీద పదోతరగతి వరకు చదివించారు. విధిలేక పొట్టకూటి కోసం ఆటోడ్రైవర్‌గా మారాడు. కొంత కాలం జీపు డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. వృత్తి ఆటో నడపడం అయితే ప్రవృత్తిగా పాముల్ని పడుతూ ప్రకృతి మిత్రగా పేరు సంపాదిస్తున్నాడు. ఎటువంటి పరిహారం ఆశించకుండానే పాములు పట్టడంతో మండలవాసులు వెంకటేష్‌ను ప్రత్యేకంగా గౌరవిస్తారు.

‘ఆ నాలుగు’ ప్రమాదం..
మాడుగుల మండలం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. పాముల సంఖ్య అధికమే. వందలాది సర్పాలున్నప్పటికీ నాలుగురకాలు మాత్రమే విషపూరితమైనవి అని చెబుతాడు వెంకటేష్‌. రక్తపింజెర, కట్లపాము, కింగ్‌కోబ్రా, నాగపాములు ప్రమాదకరమైనవని వివరిస్తాడు. మండలంలో పాము కనబడితే 95503 10149 నెంబర్‌కు సమాచారమివ్వాలని కోరుతున్నాడు ఈ పాముల సంరక్షకుడు. 

వెంకటేష్‌ వద్దకు విదేశీయలు...
సోషల్‌ మీడియాలో వెంకటేష్‌ వీడియోల్ని, పాములు పట్టే ఫొటోల్ని చూసిన విదేశీయులు గత ఏడాది మాడుగులకు వచ్చి ఆయన్ని కలిశారు. పనితీరును పరిశీలించారు. ఎటువంటి శిక్షణ లేకుండా ఒడుపుగా పామును పట్టడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పాములు పట్టడంలో సుశిక్షితులైన వారు కూడా వెంకటేష్‌ వద్ద చాలా మెలకువల్ని నేర్చుకున్నారు. పాములు పట్టేందుకు కొన్ని సురక్షితమైన వస్తువుల్ని వెంకటేష్‌కు బహుమతిగా అందించారు. పామును పట్టేందుకు ప్రత్యేకమైన కర్ర, పామును భద్రపరిచేందుకు వినియోగించే సంచి, పట్టుకునే క్రమంలో ధరించాల్సిన బూట్లను ఇచ్చి అభినందించారు. విశ్వవిద్యాలయాల్లో పాముల పట్టడంలో శిక్షణ తీసుకున్నవారు సైతం వెంకటేష్‌లా పాములుపట్టలేరని కితాబిచ్చారు.

ప్రమాదకరమని తెలిసినా...
చిన్ననాటి నుంచి పాములంటే ప్రత్యేకమైన ప్రేమ. వాటిని పట్టకోవడం.. వాటితో ఆడుకోవడం.. ఇష్టంగా అనిపించేవి. అమ్మా, నాన్నా చాలాసార్లు మందలించారు. కానీ నాలో మార్పు రాలేదు. విషరహిత పామలు ఎన్నో సార్లు కాటేశాయి. కానీ వాటిపై కోపం రాలేదు. అమెరికా, నెదర్లాండ్స్, కెనడా దేశాల నుంచి చాలామంది ప్రతినిధులు వచ్చి నా దగ్గర మెలకువలు నేర్చుకోవడం నాకు గర్వంగా అనిపించింది. ప్రభుత్వం స్పందించి ఇదే వృత్తిలో బతుకుతెరువు చూపించాలి. పాముల్ని దయచేసి ఎవరూ చంపొద్దు.  – పెచ్చేటి వెంకటేష్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top