‘ఖాకీ’ వసూల్‌! 

Six Police Officers Have Suspended In Kurnool APSP battalion - Sakshi

సాక్షి, కర్నూలు : జనరల్‌ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయాలంటే రూ.40వేలు, ఎంటీ సెక్షన్‌కు బదిలీ చేసి అటాచ్‌మెంట్‌ కింద విధులు కేటాయించాలంటే రూ.60వేలు, బయట కంపెనీల నుంచి హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేయడానికి రూ.30వేలు..కర్నూలు ఏపీఎస్పీ రెండో పటాలంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఓ అధికారి నిర్ణయించిన ధరల పట్టిక ఇదీ. ఇక్కడ ఉద్యోగుల బదిలీలకు భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగుచూసింది. దీంతో ‘ఆరుగురు’ వసూల్‌ రాజాలపై వేటు పడింది.

ఈ అంశం ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏఆర్‌ ఎస్‌ఐ , ఎంటీ సెక్షన్‌ హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు నలుగురు కానిస్టేబుళ్లను క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేస్తూ బెటాలియన్‌ ఐజీ బి. శ్రీనివాసులు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వసూళ్ల రాజాలను తక్షణమే కేటాయించిన స్థానాలకు వెళ్లిపోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏఆర్‌ ఎస్‌ఐను ఐదో బెటాలియన్‌కు, ఎంటీ సెక్షన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ను 16వ బెటాలియన్‌కు, కానిస్టేబుళ్లను ఒకరిని మూడో బెటాలియన్‌కు, మరొకరిని 16వ, ఐదో, 9వ బెటాలియన్లకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ అంశం పటాలంలో తీవ్ర చర్చానీయాంశంగా మారింది.  

రూ.10 కోట్లకు పైగా వసూళ్లు  
ఉద్యోగుల బదిలీల్లో రూ.10 కోట్లకు పైనే వసూలు చేసినట్లు  ఆశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. జనరల్‌ డ్యూటీ నుంచి ఆర్మర్‌ గ్రూపునకు బదిలీ చేయడానికి ఒక్కో కానిస్టేబుల్‌  నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెలుగు చూసింది. అలాగే జనరల్‌ డ్యూటీ నుంచి బ్యాండు గ్రూపునకు బదిలీ చేయడానికి ఒకొక్కరి నుంచి రూ. 40వేలు చొప్పున నలుగురు నుంచి మామూళ్లు వసూలు చేసినట్లు సమాచారం. జనరల్‌ డ్యూటీ నుంచి ఎంటీ గ్రూపునకు బదిలీ చేసి అటాచ్‌మెంట్‌కు ఒకొక్కరి నుంచి రూ.60వేలు చొప్పున 20 మంది దగ్గర వసూలు చేసినట్లు సమాచారం.

బయట కంపెనీల్లో పనిచేసే వారిని హెడ్‌క్వార్టర్‌కు రప్పించడానికి ఒకొక్కరి వద్ద నుంచి రూ.30వేల చొప్పున వంద మంది ఉద్యోగులనుంచి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. అలాగే బెటాలియన్‌ లూప్‌లైన్‌ పోస్టులకు కూడా భారీగా ధరలు నిర్ణయించి వసూలు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా చిల్డ్రన్స్‌పార్కు, మ్యాంగోగార్డెన్, లెమన్‌గార్డెన్, డ్రైనేజీ నిర్వహణ, ప్లంబర్‌ విధులు వంటి పోస్టుల నియామకానికి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు చర్చ జరుగుతోంది.

బయట కంపెనీల నుంచి జనరల్‌ డ్యూటీలకు బదిలీ చేయడానికి రూ.30వేలు, అక్కడి నుంచి లూప్‌లైన్‌లో విధులు నిర్వహించడానికి ఒకొక్కరి నుంచి రూ.25వేల ప్రకారం వసూలు చేసినట్లు సిబ్బంది నుంచి ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో మూడవ రేంజ్‌ డీఐజీ వెంకటేష్‌ వసూళ్ల భాగోతంపై ఇటీవల విచారణ జరిపించి ఆధారాలను సేకరించారు. బదిలీల కోసం ఒక అధికారి డబ్బులు వసూలు చేసినట్లు 14 మంది రాతపూర్వకంగా డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు ఏపీఎస్పీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయం ఏపీఎస్పీ ఐజీ శ్రీనివాసులు దృష్టికి వెళ్లడంతో వసూలు రాజాలపై బదిలీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top