శిల్పారామం..ఇక కొత్త రూపం!

Shilparamam Temple Development Funds Released - Sakshi

రూ.20 కోట్లతో మాస్టర్‌ప్లాన్‌

జూన్‌ నాటికి కొత్తకళ

రాష్ట్ర శిల్పారామాల స్పెషల్‌ ఆఫీసర్‌ జయరాజ్‌   

జిల్లాలో కడపతోపాటు పులివెందులలో శిల్పారామాలు ఉన్నాయి. రోజువారి జీవితంలో అలసిన వారికి ఈ ఆరామాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి పదేళ్లు కావస్తోంది. చిన్నచిన్న మార్పులు మినహా మారుతున్న కాలానికి అనుగుణంగా పెద్దగా మార్పులేవీ జరగలేదు. ఇటీవల సందర్శకులు నూతనత్వం కొరవడిందని పెదవి విరుస్తున్నారు. ఒక దశలో శిల్పారామాల నిర్వహణ ప్రభుత్వానికి బరువుగా మారింది.

ప్రతి ఆదివారం నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా స్థానికంగా స్పాన్సర్లను వెతుక్కోవలసి వచ్చింది. దీంతో ఆదాయం తగ్గింది. ప్రభుత్వం దీన్ని గమనించి కొత్త అందాలతో శిల్పారామాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. రాష్ట్ర శిల్పారామాల స్పెషలాఫీసర్‌ బి.జయరాజ్‌ కడప శిల్పారామంలో చేపట్టాల్సిన మార్పులను పరిశీలించేందుకు కడప నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.

కడప కల్చరల్‌ : కడప, పులివెందుల శిల్పారామాలలో జనం సందడి తగ్గినట్లు కనిపిస్తోంది. కారణం?
ఆదాయం తగ్గలేదుగానీ పెరగని మాట నిజమే. ఆశించిన మేరకు ఆర్థికంగా అభివృద్ధి కనిపించడం లేదు.
మీ దృష్టికి వచ్చిన లోపాలు ఏమిటి? నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి?
కడప శిల్పారామం నగరం నుంచి దూరమని పలువురు ప్రజలు భావిస్తున్నారు. ఎస్టేట్‌ తర్వాత మూడు, నాలుగు కిలోమీటర్ల వరకు నిర్మానుష్యంగా ఉంటుంది. కానీ ఇటీవల నగరం వైపు నుంచి రైల్వేట్రాక్‌ వరకు, శిల్పారామం నుంచి పెట్రోలు బంకు వరకు అక్కడక్కడా భవనాలు వెలిశాయి. జనం సందడి పెరుగుతోంది.
శిల్పారామాల పూర్తిస్థాయి అభివృద్ధికి చేపట్టనున్న 
చర్యలేమిటి?

వీటిని పూర్తిగా ఆధునికీకరిస్తాం. 
స్థానికతను కోల్పోకుండా ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ సందర్శకులకు మెరుగైన వసతులు కల్పిస్తాం. వారు ఉల్లాసంగా గడిపేందుకు శిల్పారామానికి కొత్త లుక్‌ వచ్చేలా మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
ఏమేం మార్పులు చేపడతారు?
ముఖ్యంగా వినోదానికి, ఉల్లాసంగా గడపడానికి అనుగుణంగా మార్పులు చేస్తాం. కొన్ని సాంకేతిక కారణాలతో గ్రీనరీ (పచ్చిక) లేకుండా పోయింది. కడప శిల్పారామంలో ఓ భాగాన్ని పూర్తిగా పచ్చికతో నింపుతాం. ప్రస్తుతం షాపింగ్‌ స్టాల్స్‌ దూరంగా విసిరేసినట్లు ఉన్నాయి. వాటిని ఎదురెదురుగా దగ్గరలో ఉండేటట్లు మారుస్తాం. తరుచూ హస్తకళా రూపాల ప్రదర్శన, విక్రయాలు ఏర్పాటు చేస్తాం. నైపుణ్యం గల కళాకారులకు స్టాల్స్‌ను ఉచితంగా ఇస్తాం. సందర్శకుల కోసం పాత్‌వేలను అభివృద్ధి చేస్తాం. సౌకర్యవంతంగా సేద తీరేందుకు పలుచోట్ల బెంచీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం.
ప్రత్యేకించి వినోదం కోసం ఏం చేస్తున్నారు?
కడప శిల్పారామానికి పడమర వైపునగల చెరువును నీటితో నింపి బోటింగ్, వాటర్‌గేమ్స్‌ నిర్వహించాలని ఆలోచిస్తున్నాం. 56 ఎకరాల చెరువులో 40 ఎకరాల్లో వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించేందుకు అనుకూలంగా మార్చేందుకు కృషి చేస్తున్నాం!
ఆధునీకరణ అన్నారు...వివరాలు చెప్పగలరా..?
ఆధునీకరణ కోసం అంతర్జాతీయ అనుభవం గల ఇద్దరు యువ అర్కిటెక్చర్లకు ఈ పని అప్పగించాం. వారు ప్రత్యేకించి కడప శిల్పారామాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించనున్నారు. ఇప్పటికే ఇక్కడ పర్యటించి సందర్శకుల అభిప్రాయాలు సేకరించారు. ఆ ప్రణాళిక అమలైతే కడప శిల్పారామానికి కొత్త లుక్‌ వస్తుందని చెప్పగలను. సందర్శకులను ఆకట్టుకునేందుకు సీమ రుచులు లాగా స్థానిక వంటకాలు, ఆహార పదార్థాలు, అల్పాహారం అందించేందుకు ఫుడ్‌ కోర్టును ఏర్పాటు చేసే ఆలోచన ఉంది.
ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయని భావిస్తున్నారు?
ఈనెలాఖరుకు మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తాం. కార్యాలయ పరమైన అనుమతులు అనంతరం సీఎం ఆమోదంతో వెంటనే పనులు చేపడతాం. జూలై నాటికి దశలవారీగా అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయగలమన్న విశ్వాసం ఉంది. ఈ పనులను ప్రైవేటు, ప్రభుత్వ  భాగస్వామ్యాల సమ్మేళనంతో 40–60 శాతం పద్ధతిలో చేపడుతాం.
రాష్ట్రంలో శిల్పారామాల పరిస్థితి ఎలా ఉంది?
పులివెందుల శిల్పారామాన్ని ఆధునీకరించి ఆర్థికంగా మెరుగైన స్థితికి చేర్చేందుకు అంచనాలు రూపొందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది శిల్పారామాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రస్తుతం కడపతోపాటు తిరుపతి, విశాఖ, అనంతపురం, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు, కాకినాడ, విజయనగరంలలో పనులు సాగుతున్నాయి. 21న కర్నూలులో శిల్పారామానికి శంకుస్థాపన నిర్వహించనున్నాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top