చుక్..చుక్.. రైలు వస్తోంది... | Sathupally road railway line to complete a survey | Sakshi
Sakshi News home page

చుక్..చుక్.. రైలు వస్తోంది...

Jan 18 2014 4:59 AM | Updated on Sep 2 2017 2:43 AM

డోర్నకల్‌రోడ్(కొత్తగూడెం) నుంచి సత్తుపల్లిరోడ్ వరకు 56 కిలోమీటర్ల రైలుమార్గం వేసేందుకు సర్వే పూర్తయింది.

సత్తుపల్లి, న్యూస్‌లైన్: డోర్నకల్‌రోడ్(కొత్తగూడెం) నుంచి సత్తుపల్లిరోడ్ వరకు 56 కిలోమీటర్ల రైలుమార్గం వేసేందుకు సర్వే పూర్తయింది. పెనుబల్లి జంక్షన్‌గా ఐదు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భవన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లిరోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే భూసార పరీక్ష లు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లిరోడ్ రైల్వేస్టేషన్ కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్‌కాస్టుకు వెళ్లే విధంగా రైల్వేలైన్ వేస్తున్నారు. కొత్తలంకపల్లి రాష్ట్రీయ రహదారిపై  ఓవర్‌బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదన చేశారు.
 
 బొగ్గు రవాణా చేసేందుకు.. : సత్తుపల్లి ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సింగరేణి సంస్థ రైల్వేలైన్ కోసం రూ.335 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. రైల్వేలైన్ కోసం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటంతో సర్వేప్రక్రియ పూర్తి చేశారు. రైల్వేలైన్ ఆలస్యం కావటం వలన సింగరేణి విస్తరణపై ప్రభావం చూపుతోంది. సత్తుపల్లి ఓపెన్‌కాస్టు-2 ప్రారంభించాలంటే.. రైల్వేలైన్ తక్షణం అవసరం అవుతుంది. టిప్పర్ల ద్వారా కొత్తగూడెంకు బొగ్గు రవాణా చేయటానికి పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లేకపోవటంతో రైల్వేలైన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. 1200 ఎకరాల భూ సేకరణ చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద ైరైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 34 ఎకరాలు ఇటీవలే జనరల్ అవార్డు జారీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.  బొగ్గు రవాణాతో పాటు ప్రయాణికుల కోసం భద్రాచలం  రైలు కూడా నడిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ఆరునెలల్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయి.
 
 పెనుబల్లి జంక్షన్ నుంచి..  
 పెనుబల్లి జంక్షన్ నుంచి కృష్ణాజిల్లా కొండపల్లి వీటీపీఎస్‌కు రైలు మార్గం కోసం ట్రాన్స్‌కో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లిరోడ్ రైల్వేలైన్ పనులు పూర్తి అయితే పెనుబల్లి జంక్షన్‌గా కొండపల్లికి రైలు లైన్ కోసం సర్వే పనులు చేపడతామని సర్వే బృందం ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ప్రస్తుతం భద్రాచలం రోడ్డు, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వీటీపీఎస్‌కు బొగ్గు రవాణా అవుతోంది. పెనుబల్లి జంక్షన్ మీదుగా కొండపల్లి వీటీపీఎస్‌కు రైల్వేలైన్ వేయటం వలన బొగ్గు రవాణా మరింత సులభం అయ్యేఅవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement