breaking news
railway line survey
-
గుడ్‌న్యూస్..! కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్‌కు కేంద్రం సుముఖం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త మోసుకొచ్చింది. చాలాకాలంగా జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న కరీంనగర్–హసన్‌పర్తి రైల్వేలైన్ సర్వేకు కేంద్ర రైల్వే బోర్డు ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1.54 కోట్లు కూడా విడుదల చేసింది. దీంతో ఆగిపోయిందనుకున్న ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే కనెక్టివిటీ పరంగా మిగిలిన జిల్లాలతో పోలిస్తే వెనకబడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఈ ప్రాజెక్టు అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏప్రిల్ 21న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని కోరిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర రైల్వేబోర్డు సర్వేకు ఆమోదం తెలుపుతూ మే 8వ తేదీన ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ప్రధాని పీవీ హయాంలో కదలిక వాస్తవానికి కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ ఇప్పటిది కాదు. 1976లోనే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. కానీ, సర్వే, అంచనా వ్యయం తదితర విషయాల్లో ఎలాంటి పురోగతి నమోదు కాలేదు. ప్రధానిగా పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించాక 1994లో ఈ ప్రాజెక్టు తిరిగి తెరమీదకు వచ్చింది. గతంలో ఈ ప్రాజెక్టును కరీంనగర్–ఖాజీపేటగా పిలిచేవారు. వాస్తవానికి కరీంనగర్‌కు భౌగోళికంగా దారితీసే హసన్‌పర్తి రోడ్ స్టేషన్ నుంచి హుజూరాబాద్ మీదుగా మానకొండూరు తరువాత కరీంనగర్– పెద్దపల్లి రైల్వేలైన్ మీదుగా కరీంనగర్ రైల్వేస్టేషన్‌కు చేరాలి. కరీంనగర్–హసనపర్తిల మధ్య రైల్వేలైన్ దూరం 45 కి.మీ మాత్రమే అని గతంలో అధికారులు తెలిపారు. తాజాగా ఈ కేంద్రం జారీ చేసిన ఫైనల్ లోకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)లో మాత్రం దీని దూరాన్ని 61.8 కిమీగా పేర్కొనడం విశేషం. కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణానికి సంబంధించి 2013లోనే సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వ అలసత్వంతో రైల్వేలైన్ నిర్మాణంలో పురోగతి లేకుండా పోయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నంబర్–11 ప్రకారం కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ నిర్మాణం చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం. – ఎంపీ బండి సంజయ్ కనెక్టివిటీ ఇలా.. ► కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ అందుబాటులోకి వస్తే.. పాత వరంగల్– కరీంనగర్ జిల్లాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ముఖ్యంగా దక్షిణ– పశ్చిమ భారతదేశానికి ఈ రైల్వేలైన్ ఒక సంధానసేతువుగా నిలుస్తుంది. ప్రస్తుతం మహారాష్ట్ర వెళ్తున్న కరీంనగర్, వరంగల్ ప్రజలకు దాదాపు 200 కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సిన ప్రయాణభారం తప్పుతుంది. ► ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, గుజరాత్‌లోని అహ్మదాబాద్ వంటి ఇతర నగరాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. మహారాష్ట్రలోని షిరిడీ, ఔరంగాబాద్, గుజరాత్‌లోని పలు పుణ్యక్షేత్రాలను కలిపేలైన్ కావడంతో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతుంది. ► ఇప్పటికీ వరంగల్ నుంచి నిజామాబాద్ రైలు ప్రయాణం సాకారం కాలేదు. కానీ, నిజామాబాద్–కరీంనగర్–పెద్దపల్లి రైల్వేలైన్ పూర్తి కావడంతో కరీంనగర్ వరకు రైల్వేలైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కేవలం హసన్‌పర్తి నుంచి కరీంనగర్ వరకు లైన్ వేస్తే నిజామాబాద్–వరంగల్ మధ్య ప్రయాణం సాకారమవుతుంది. ► ఇక వరంగల్–కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు ముంబై వెళ్లాలంటే ప్రస్తుతం మహరాష్ట్రలోని చంద్రాపూర్ మీదుగా దాదాపు 200 కి.మీ దూరం తిరిగి వెళ్లాలి. ఈ లైన్ పూర్తయితే.. ఆ ప్రయాణభారం తగ్గుతుంది. ► ప్రస్తుతం కరీంనగర్ ప్రజలు హైదరాబాద్ వెళ్లాలంటే కరీంనగర్– హసన్‌పర్తి రైల్వేలైన్ పూర్తయితే నేరుగా ఖాజీపేటకు లైన్ అందుబాటులోకి వస్తుంది. దీంతో కరీంనగర్ వాసులకు సికింద్రాబాద్‌కు వేగంగా రైల్లో ప్రయాణం చేసే వీలు దక్కుతుంది. గతంలో ప్రతిపాదన రద్దు వాస్తవానికి 2013 వరకు ఈ ప్రాజెక్టు అడపాదడపా తెరమీదకు రావడం ఆ తరువాత కనుమరుగవడం పరిపాటుగా మారింది. ఈ క్రమంలోనే కరీంనగర్– ఖాజీపేట రైల్వేలైన్ సర్వే జరిగింది. అప్పట్లో దాదాపు రూ.1.20 కోట్లు వెచ్చించి సర్వే చేసిన అధికారులు దాదాపు రూ.800 కోట్ల ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును చేపట్టడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ ప్రాజెక్టు రద్దు అప్పట్లో కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల మంటలు పెట్టింది కూడా. తాజాగా రైల్వే బోర్డు మరోసారి సర్వే చేసేందుకు ముందుకు రావడంపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
చుక్..చుక్.. రైలు వస్తోంది...
సత్తుపల్లి, న్యూస్‌లైన్: డోర్నకల్‌రోడ్(కొత్తగూడెం) నుంచి సత్తుపల్లిరోడ్ వరకు 56 కిలోమీటర్ల రైలుమార్గం వేసేందుకు సర్వే పూర్తయింది. పెనుబల్లి జంక్షన్‌గా ఐదు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భవన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లిరోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే భూసార పరీక్ష లు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లిరోడ్ రైల్వేస్టేషన్ కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్‌కాస్టుకు వెళ్లే విధంగా రైల్వేలైన్ వేస్తున్నారు. కొత్తలంకపల్లి రాష్ట్రీయ రహదారిపై ఓవర్‌బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదన చేశారు. బొగ్గు రవాణా చేసేందుకు.. : సత్తుపల్లి ఓపెన్‌కాస్టు నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సింగరేణి సంస్థ రైల్వేలైన్ కోసం రూ.335 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. రైల్వేలైన్ కోసం సింగరేణి యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటంతో సర్వేప్రక్రియ పూర్తి చేశారు. రైల్వేలైన్ ఆలస్యం కావటం వలన సింగరేణి విస్తరణపై ప్రభావం చూపుతోంది. సత్తుపల్లి ఓపెన్‌కాస్టు-2 ప్రారంభించాలంటే.. రైల్వేలైన్ తక్షణం అవసరం అవుతుంది. టిప్పర్ల ద్వారా కొత్తగూడెంకు బొగ్గు రవాణా చేయటానికి పర్యావరణ అనుమతులు వచ్చే అవకాశం లేకపోవటంతో రైల్వేలైన్ ప్రక్రియ వేగం పుంజుకుంది. 1200 ఎకరాల భూ సేకరణ చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు. పెనుబల్లి మండలం లంకపల్లి వద్ద ైరైల్వే స్టేషన్ నిర్మాణం కోసం 34 ఎకరాలు ఇటీవలే జనరల్ అవార్డు జారీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బొగ్గు రవాణాతో పాటు ప్రయాణికుల కోసం భద్రాచలం రైలు కూడా నడిపే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ఆరునెలల్లో రైల్వే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశాలు న్నాయి. పెనుబల్లి జంక్షన్ నుంచి.. పెనుబల్లి జంక్షన్ నుంచి కృష్ణాజిల్లా కొండపల్లి వీటీపీఎస్‌కు రైలు మార్గం కోసం ట్రాన్స్‌కో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. సత్తుపల్లిరోడ్ రైల్వేలైన్ పనులు పూర్తి అయితే పెనుబల్లి జంక్షన్‌గా కొండపల్లికి రైలు లైన్ కోసం సర్వే పనులు చేపడతామని సర్వే బృందం ‘న్యూస్‌లైన్’కు తెలిపింది. ప్రస్తుతం భద్రాచలం రోడ్డు, డోర్నకల్, ఖమ్మం, మధిర మీదుగా వీటీపీఎస్‌కు బొగ్గు రవాణా అవుతోంది. పెనుబల్లి జంక్షన్ మీదుగా కొండపల్లి వీటీపీఎస్‌కు రైల్వేలైన్ వేయటం వలన బొగ్గు రవాణా మరింత సులభం అయ్యేఅవకాశం ఉంది.