పెద్ద దిక్కు.. మూడేళ్ల చిక్కు!

Sarvajana Hospital Superintendent Post - Sakshi

సూపరింటెండెంట్‌ పోస్టుకు రాజకీయ రంగు

మూడేళ్లుగా డాక్టర్‌ జగన్నాథ్‌ పెత్తనం

సీనియర్లను కాదని అధికారం

సర్వజనాసుపత్రిలో కొరవడిన పర్యవేక్షణ

అందని ద్రాక్షగా మెరుగైన వైద్యం

ప్రాణమ్మీదికి వచ్చి పరుగుపరుగున సర్వజనాస్పత్రికి వెళ్తే.. వైద్యులు చూసేలోపే ప్రాణం పోయేలా ఉంది. వైద్యం సంగతి దేవునికెరుక.. కనీసం తాగేందుకు నీళ్లు కూడా కరువే. మండు వేసవిలోనూ విద్యుత్‌ సమస్యలతో రోగులు ఉక్కపోతతో నరకం చూస్తున్నారు. పర్యవేక్షణ లేక.. పట్టించుకోవాల్సిన అధికారి స్వార్థం చూసుకోగా.. కొందరు వైద్యులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. అంతిమంగా రోగుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. గతంలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తితేనే ధర్నాలు చేసే ప్రజాప్రతినిధులు కానీ.. జిల్లా పాలనా వ్యవహారాలు చూడాల్సిన కలెక్టర్‌ కానీ ఇటువైపు కన్నెత్తిచూడకపోవడం రోగుల పాలిట శాపంగా మారింది.

అనంతపురం న్యూసిటీ: సర్వజనాస్పత్రి.. జిల్లాకే పెద్దదిక్కు. అందుకే పేదోళ్లకు ఏ ఆరోగ్య సమస్య తలెత్తినా ఇక్కడికే పరుగున వస్తారు. కానీ ఇక్కడి ఉన్నతాధికారి నిర్లక్ష్యం.. రోగుల ప్రాణాలమీదకు తెస్తోంది. టీడీపీ నేతల సిఫారసుతో నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రిలోని కీలకమైన సూపరింటెండెంట్‌ సీట్లో కూర్చున్న డాక్టర్‌ జగన్నాథ్‌.. తన స్వార్థంమాత్రమే చూసుకుంటున్నారు. ఫలితంగా పాలన గాడి తప్పింది. ఆస్పత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అవినీతి, అక్రమాలు పెరిగిపోగా.. రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇదే అదనుగా కొందరు వైద్యులు అండిదే ఆట, పాడిందే పాటగా వ్యవహారం సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ జగన్నాథ్‌కు సూపరింటెండెంట్‌గా కీలక బాధ్యతలు అప్పగించడంతోనే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. బోధనాస్పత్రిలో ప్రొఫెసర్‌గా పనిచేయడంతో పాటు 5 ఏళ్ల పాటు టీచింగ్‌ అనుభవం ఉన్న వారు మాత్రమే సూపరింటెండెంట్‌ పోస్టుకి అర్హులు. కానీ జగన్నాథ్‌ విషయంలో ఇవేమీ పట్టించుకోలేదు. జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత సిఫారసుతో ఆయనన్ను సూపరింటెండెంట్‌గా నియమించినట్లు సమాచారం.

స్తంభించిన పాలన  
ఆస్పత్రి సూపరింటెండెంట్‌(ఎఫ్‌ఏసీ)గా డాక్టర్‌ జగన్నాథ్‌ 2017 మే 2న బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లుగా ఆయన కీలక పోస్టులో కొనసాగుతున్నారు. కానీ ఆస్పత్రి వ్యవహారాలు మాత్రం గాలికి వదిలేశారు. ఛాంబర్‌ దాటి బయటకు రాకపోవడంతో వార్డుల్లో వైద్యసేవలు అంతంతమాత్రంగా అందుతున్నాయి. ఇక ఆస్పత్రికి వచ్చే రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందనే విమర్శలు సరేసరి. తాగునీరు లేక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్‌రూంలు సరిగా లేని పరిస్థితి. ఇక రేడియాలజీ, కంటి విభాగంలో విద్యార్థులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఈసీజీ, ఎక్స్‌రే, మందులిచ్చే ప్రాంతాల్లో అనర్హులతో పనులు చేయిస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు ఈసీజీ, ఎక్స్‌రే టెక్నీషియన్లుగా, అటెండర్లు మందులిచ్చే దారుణమైన పరిస్థితి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వీరందరికీ పోస్టులు పురమాయించిన ఘనత కూడా డాక్టర్‌ జగన్నాథ్‌కే దక్కింది.

అక్రమాలకు నిలయం
సర్వజనాస్పత్రి అవినీతి అక్రమాలకు నిలయంగా మారింది. అడిగేవారు లేరన్న ధీమాతో ఇక్కడ కొందరు ఉన్నతాధికారులు, వైద్యులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్య లేకున్నా... ఆస్పత్రిలోని ప్రిజన్స్‌ వార్డులో ఓ ఖైదీని ఏకంగా రెండు నెలల పాటు అడ్మిషన్‌లో ఉంచారు. ఇందుకుగానూ సదరు ఖైదీ నుంచి రూ.లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. దీనిపై ఏప్రిల్‌ 18న ‘సాక్షి’లో నిబంధనలకు ‘ఖైదు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అయినా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆస్పత్రిలో ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను ఓ కీలక అధికారి ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించారు. దీనిపై ఏప్రిల్‌ 24న ‘కాంట్రాక్ట్‌ జగన్నాథునికెరుక’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురితమైంది. దీనిపైనా యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక ఆఫీసు కార్యాలయంలో పైసలివ్వందే ఫైలు కదలని పరిస్థితి. కొందరు ఎంఎన్‌ఓల పదోన్నతుల విషయంలో రూ.లక్షలు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇక సిటీ స్కాన్‌ నిర్వాహకులు ప్రత్యేక మీటర్‌ వేసుకోకుండా ఆస్పత్రి కరెంటునే వాడుకుంటున్నారు. వారిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రూ. కోట్లతో నిర్మించిన ఎస్‌ఆర్‌ క్వార్టర్స్‌లో ప్రైవేట్‌ వ్యక్తులు తిష్టవేసినా..ఇంత వరకు ఖాళీ చేయించలేదు.

రోగులకు ప్రత్యక్ష నరకం
పట్టించుకునే వారులేక.. కనీస సౌకర్యాలు లేక.. సకాలంలో వైద్యసేవలందక సర్వజనాస్పత్రిలో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. రేడియాలజీ, కంటి తదితర విభాగాల్లోని వైద్యులు రోగుల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. రేడియాలజీ విభాగంలో విద్యార్థులతో పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 24న ‘రేడియాలేజీ’ అన్న శీర్షికతో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఇదే నెలలో కంటి విభాగంలో ఓ విద్యార్థితో సిరంజ్‌ పనులు చేయిస్తున్నారు. ఇక వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే మహిళల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వాడుకునేందుకు నీళ్లు లేక.. మరుగుదొడ్లకు తాళం వేయడంతో వారి బాధలు వర్ణించడానికి వీలు కాని విధంగా ఉన్నాయి. సర్వజనాస్పత్రిలో నెలకొన్న ఈ దుస్థితిపై  ఈ నెల 10న ‘జగన్నాథ..మేలుకో’ అన్న శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. మహిళలే యూరినల్స్‌ పరీక్షలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్న వైనాన్ని ఎండగట్టింది. ఇక వార్డుల్లో నీళ్లు సరఫరా కాక మరుగుదొడ్లకు తాళం వేయగా.. కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం మహిళలు ఇతర వార్డులకు పరుగులు తీస్తున్నారు. ఇలా రోజూ ఓ సమస్యతో రోగులు ప్రత్యక్ష నరకం చూస్తున్నా.. పట్టించుకోవాల్సిన సూపరింటెండెంట్‌ చోద్యం చూస్తూ గడిపేస్తుండటం గమనార్హం.

వీళ్లనెందుకు పరిగనలోకి తీసుకోరూ..
బోధనాస్పత్రిలో జగన్నాథ్‌ కంటే సీనియర్లు 8 నుంచి 10 మంది ఉన్నారు. గతంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావుతో పాటు, నవీన్‌కుమార్, మైరెడ్డి నీరజ, రామస్వామినాయక్‌తో పాటు మరికొందరున్నప్పటికీ సూపరింటెండెంట్‌గా వీరిని పరిగన లోకి తీసుకోవడం లేదు. సూపరింటెండెంట్‌గా దర్జా వెలగబెట్టే జగన్నాథ్‌..మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) పర్యటనకు రాగానే జారుకుంటారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి హోదాలో నవీన్‌కుమారే బృందం సభ్యుల వెంట ఉంటూ ఆస్పత్రి సేవల గురించి వివరిస్తారు.  

22వైద్య కళాశాల,బోధనాస్పత్రి విభాగాలు

19ప్రొఫెసర్లు

10ఐదేళ్ల అనుభవంకలిగిన ప్రొఫెసర్లు

3నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ జగన్నాథ్‌ సూపరింటెండెంట్‌ సీటులో కొనసాగుతున్న సంవత్సరాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top