పెద్ద దిక్కు.. తీరని మొక్కు!

Sarvajana Hospital Staff Negligence On Pregnant patients - Sakshi

వైద్యం.. వేదనాభరితం

ముందుకు సాగని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం  

కలగానే పీజీ సీట్లు, జీఓ 124 అమలు, ఎంసీహెచ్‌ బ్లాక్‌ మంజూరు

సకాలంలో వైద్యం అందక నరకం చూస్తున్న రోగులు  

అనంతపురం మెడికల్‌ కళాశాల 18 ఏళ్ల క్రితం ఏర్పడగా.. దానికి అనుబంధంగా సర్వజనాస్పత్రి కూడా రూపుదిద్దుకుంది. కానీ అప్పట్లో ఎలా ఉందో.. ఇప్పుడూ అలాగే ఉంది. రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. సిబ్బంది, వైద్యులు, మౌలిక సౌకర్యాలు మాత్రం ఆ మేరకు పెరగని పరిస్థితి. దీంతో సకాలంలో వైద్యం అందక జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎంసీహెచ్‌(మెటర్నటీ చైల్డ్‌ హెల్త్‌ బ్లాక్‌) ఏర్పాటు కాక ఆస్పత్రి పురిటినొప్పులు పడుతోంది. అడ్మిషన్‌లో ఉంటున్న గర్భిణులు, బాలింతలకు.. ఆస్పత్రిలోని పడకలు.. సిబ్బందికి పొంతన లేకుండా         పోయింది. ఫలితంగా సర్వజనాస్పత్రికి వస్తున్న వారు నరకం చూస్తున్నారు.

అనంతపురం న్యూసిటీ: మెడికల్‌ కళాశాలకు అనుబంధంగా ఏర్పాటైన సర్వజనాస్పత్రే జిల్లాకు పెద్దదిక్కు. పేదోడికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ఇక్కడికే పరిగెత్తుకు వస్తాడు. ఇక ప్రసవాల సంగతి సరేసరి. అందుకే ఓపీ రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఇక్కడ మౌలిక వసతులు లేక సరిపడా సిబ్బంది లేక జనం నరకం చూస్తున్నారు. ఇక పీజీ సీట్ల అనుమతులు, జీఓ 124 అమలు, ఎంసీహెచ్‌ బ్లాక్‌ కలగా మారడందో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  

నత్తనడకన సూపర్‌ స్పెషాలిటీ పనులు
సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు నత్తనడకనసాగుతున్నాయి. వాస్తవంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైనా...టీడీపీ నేతలు మాత్రం తామే మంజూరు చేయించామని గొప్పలు చెబుతున్నారు. అయినా కూడా పనులపై దృష్టి సారించడం లేదు. అందువల్లే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు ఆగుతూ...సాగుతున్నాయి. 2014–15లో రూ.150 కోట్లతో ఆస్పత్రి ఏర్పాటుకు బీజం ఏర్పడింది. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు భాగస్వామ్యంతో ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  2015–16లో పనులు ప్రారంభమయ్యాయి. 2017 డిసెంబర్‌కంతా పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంత వరకు పనులు పూర్తి కాలేదు. ఆస్పత్రి ఏర్పాటైతే కార్డియాలజీ, కార్డియో థొరాసిక్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, యూరాలజీ, రేడియాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ తదితర సేవలతో పాటు 200 నుంచి 300 మందికి ఉపాధి దొరుకుంది. అంతటి ప్రాధాన్యం కలిగిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.  మరో ఐదారు నెలల్లో టీడీపీ సర్కార్‌ గడువు ముగియనుంది. మళ్లీ కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం దృష్టి సారిస్తే సరి..లేదంటే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. కనీసం టీడీపీ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి.. దాదాపు 80 శాతం నిర్మాణపనులు పూర్తయిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని తమ హయాంలోనే పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి చూపితే జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది..చరిత్రలో వారి పేరూ మిగులుతుంది. లేకపోతే ఎప్పటిలాగే జనం ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకూ కర్నూలు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు పరుగులు తీయాల్సి వస్తుంది. 

బాలింతలకు తప్పని నరకం
సర్వజనాస్పత్రిలో అవుతున్న ప్రసవాలకు, పడకలకు పొంతన కుదరడం లేదు. అయినప్పటికీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లలేని నిరుపేదలంతా సర్వజనాస్పత్రిలోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. ఇలా సిజేరియన్‌ చేయించుకుంటున్న వారిని కనీసం వారం రోజుల పాటు గైనిక్‌ వార్డులో ఉంచుతారు. అయితే పడకలు తక్కువగా ఉండడంతో ఒకే మంచంపై ముగ్గురు పడుకోవాల్సి వస్తోంది. దీంతో బాలింతలు కదలకుండా పడుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు తమ చిన్నారులు ఎక్కడ పడిపోతారో..? కుట్లు ఎక్కడ ఊడిపోతాయోమోనని భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలోనే వారు నరకం చూస్తున్నారు. ఆస్పత్రికి ఎంసీహెచ్‌ బ్లాక్‌ మంజూరైనా అది హిందూపురం జిల్లా ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రి యాజమాన్యం కలెక్టర్‌ ద్వారా రూ.55 కోట్లతో ఎంసీహెచ్‌ బ్లాక్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. కానీ ఇంతవరకూ అతీగతీ లేదు. ప్రస్తుతం గైనిక్‌ విభాగంలో 60 పడకలు మాత్రమే మంజూరైనా... 250 మంది అడ్మిషన్‌లో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

పీజీ సీట్లు లేక ఇబ్బందులు
బోధనాస్పత్రి ఏర్పడి 18 ఏళ్లు గడుస్తున్నా.. పీజీ సీట్లు లేకపోవడంతో వైద్యులపై అదనపు భారం పడుతోంది. పొరుగున ఉన్న కర్నూలు జిల్లాలోని  ఏ ప్రైవేటు మెడికల్‌ కళాశాల ఏర్పడి ఎనిమిదేళ్లు కాకముందే పీజీ సీట్లు సంపాదించుకోగలిగింది. కారణం ఆ యాజమాన్యం పీజీ సీట్లకోసం పట్టుబట్టి సాధించుకుంది. మన జిల్లా నుంచి ఎన్నికైన వారిలో ఎక్కువ మంది టీడీపీ వారే అయినా... ఎప్పుడు ఇద్దరు కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ పీజీ సీట్లు సాధించడంలో వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఎప్పుడో ఒకసారి ఆస్పత్రికి వచ్చి తనిఖీల పేరుతో హడావిడి చేయడం తప్ప నిజంగా చిత్తశుద్ధితో వారు ప్రయత్నించింది శూన్యమనే చెప్పాలి. ఇప్పటికైనా వారు కళ్లు తెరిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పీజీ సీట్లు మంజూరు చేయించడంతో పాటు ఎంసీహెచ్‌ బ్లాక్, జీఓ 124 అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అదే జరిగితే  జీఓ 124 ద్వారా 649 పోస్టులు మంజూరవుతాయి. దీని ద్వారా రోగులకు మరింత మెరుగ్గా సేవలదించేందుకు వీలుగా ఉంటుంది.  

నరకం చూశా  
మూడ్రోజులుగా గైనిక్‌ వార్డులో ఉంటున్నాం. మంచాలు చాలడం లేదు. ఒకే మంచంపై ముగ్గురు పడుకుంటున్నాం. రాత్రి వేళల్లో కదిలేందుకు వీలుండదు. ఎక్కడ పడిపోతామోనన్న భయం. కుట్లు ఊడి మరింత ఇబ్బంది అవుతుందని కదలకుండా ఉంటూ నరకం చూశాం.  – అరుణ, ఆనందరావు పేట, శింగనమల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top