పందెంరాయుళ్ల హడావిడి.. బరిలో పందెం కోళ్లు

Sankranthi Cock Fights In Andhra Pradesh - Sakshi

పల్లెల్లో కోడి పందేల హడావిడి మొదలైంది. పండుగ నాడు పందెం కోళ్లు సందడి చేస్తున్నాయి.. బరిలోకి దిగి ప్రత్యర్ధి కోడిని మట్టికరిపిస్తున్నాయి. పందెం రాయుళ్లు సైతం జోరుగా పందేలు కాస్తూ హడావిడి చేస్తున్నారు. ఈ మూడు రోజుల్లో  వందల కోట్ల రూపాయలు పందేల రూపంలో చేతులు మారనుంది. 

కృష్ణా జిల్లా/ గుడివాడ: టీడీపీ ఇన్‌ఛార్జి రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కోడి పందేలు ప్రారంభమయ్యాయి. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. మాకు అధికారుల అండదండలు ఉన్నాయంటూ పందెంరాయుళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసినా కోడిపందాల శిబిరాలపై దాడులకు పోలీసుయంత్రాంగం వెనుకడుగు వేస్తోంది. నందిగామ మండలం చందాపురం గ్రామంలో కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించి పందెంరాయుళ్లు బరులను సిద్ధం చేయగా.. పోలీసు అధికారులు వాటిని రాత్రికి రాత్రి నాశనం చేశారు. దీంతో పందెంరాయుళ్లు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఎలాగైనా సరే పందెం వెయ్యాల్సిందే అని భీష్మించుకు కూర్చున్నారు. అసలు పందెమే జరగనియ్యమని పోలీసు అధికారులు అంటున్నారు. నాశనం చేసిన బరుల వద్ద పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. 

పశ్చిమ గోదావరి: జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు ప్రారంభమయ్యాయి. పందెంరాయుళ్లు శిబిరాల వద్ద హడావిడి చేస్తున్నారు. కోడి పందేల శిబిరాల వద్ద గుండాటలు, పేకాట జోరుగా సాగుతున్నాయి. ఆకివీడు మండలం, ఐ భీమవరం, కాళ్ళ మండలం సీసలి, కాళ్ళ, ఉండి మండలం కోలమూరు, ఉండిలలో యధేచ్చగా కత్తులు కట్టి కోడిపందేలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నా.. పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కనపడకపోవటం గమనార్హం. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు కాళ్ళ మండలం సీసలిలో కోడి పందేలను ప్రారంభించారు. కోడి పందేలు సాంప్రదాయం అంటూనే  పందెంరాయళ్లు కోళ్లకు కత్తులు కడుతున్నారు. 

తూర్పుగోదావరి: సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమ వ్యాప్తంగా పలు గ్రామాల్లోని 40 బరుల్లో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. కోడి పందేలతో పాటు భారీగా గుండాట, పేకాటలు జోరందుకున్నాయి. అమలాపురం నియోజకవర్గ పరిధిలోని ఎస్‌ గున్నేపల్లి, ఇందుప్పల్లి, కామనగరువు, అల్లవరం, గోడి, గోడివంక, రెల్లిగడ్డ, దేవగుప్తం, గుండెపూడి, కోమరగిరిపట్నం, ఎన్‌.కొత్తపల్లి, భీమనపల్లి, చల్లపల్లి గ్రామాలలో కోడిపందేలు ప్రారంభమయ్యాయి. రెవిన్యూ, పోలీసు యంత్రాంగం కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని చివరివరకూ ప్రచారం చేసి చివరకు చేతులెత్తేసి.. ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి కోడి పందేలను ప్రారంభించారు. కోడిపందేల బరుల వద్దే జూదం శిబిరాలు వెలిశాయి. గుండాటలు జోరుగా సాగుతున్నాయి. జనం కోడి పందేలపై వేలల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు.

కృష్ణా: జిల్లా వ్యాప్తంగా కోడిపందేల బరులు సిద్దమయ్యాయి. జిల్లాలో రెండు వందల బరుల్లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. నిషేదాలను పట్టించుకోకుండా కత్తులు కట్టి కోళ్ళతో పందాలు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో కోడిపందాల నిర్వహణ జరుగుతోంది. ఇడుపు గల్లు, గోడవర్రు, అంపాపురంలో పదెకరాల్లో భారీగా కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలు చూడడానికి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు. పోలీసులు సైతం కోడిపందాల బరుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కోడి పందేలతో పాటు గుండాట, కోసు వ్యాపారం ద్వారా మూడు రోజుల్లో రూ. వంద కోట్ల మేర సొమ్ము పందేల రూపంలో చేతులు మారనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top