ఇచ్చేది గోరంత..చాకిరీ కొండంత | salaries not came to Mobile bookkeeping employee | Sakshi
Sakshi News home page

ఇచ్చేది గోరంత..చాకిరీ కొండంత

Sep 24 2014 2:50 AM | Updated on Sep 2 2017 1:51 PM

మొబైల్ బుక్ కీపింగ్ కోసం తీసుకున్న వీవోలకు ఐకేపీ శాఖ ఇచ్చేది గోరంత, చేయించుకునే పని కొండంత అన్న చందంగా తయారైంది.

అద్దంకి: మొబైల్ బుక్ కీపింగ్ కోసం తీసుకున్న వీవోలకు ఐకేపీ శాఖ ఇచ్చేది గోరంత, చేయించుకునే పని కొండంత అన్న చందంగా తయారైంది. 2013 జూన్‌లో అప్పటి ప్రభుత్వం జీవో 59ని విడుదల చేసింది. దీని ప్రకారం వీవోలకు సెర్ప్ నుంచి నెలకు 2 వేల సేవా రుసుము ఇస్తామని ప్రకటించినా ఇంత వరకు ఇవ్వలేదు.
 
వీవోల నియామకం ఇలా..

 మొబైల్ బుక్ కీపింగ్ కోసం ఐకేపీ 2012లో ప్రతి వీలేజ్ ఆర్గనైజేషన్‌కు ఒకరు చొప్పున జిల్లాలోని 56 మండలాల్లో  2200 వీవోలను నియమించారు. అప్పట్లో వీరి పరిధిలో ఉన్న డ్వాక్రా సంఘాల వివరాలను మొబైల్‌లో నమోదు చేసినందుకు ఒక్కో గ్రూపునకు 50 ఇచ్చేవారు. ప్రతి వీవోలో 25 నుంచి 30 డ్వాక్రా సంఘాలుండగా నెలకు ఒక సారి మొబైల్ బుక్ కీపింగ్ చేసినందుకు గాను వీరికి 1500 వచ్చేవి.
 అదనపు పనులు...
 మొబైల్ బుక్ కీపింగ్ కోసం తీసుకున్న వీవోల చేత ఈ పనితోపాటు తరువాత ప్రభుత్వం ద్వారా గ్రామ స్థాయిలో నడుస్తున్న పథకాల పనిలోనూ, బ్యాంక్ రుణాలు, రుణాల రికవరీ, స్త్రీ నిధి, ఆమ్ ఆద్మీ, అభయహస్తం, జేబీవై, ప్రభుత్వ సంబంధ పనుల పత్రాల తయారీని కూడా చేయిస్తున్నారు. ఉపకార వేతనాల పంపిణీ, అర్హుల గుర్తింపు, ఇదంతా వీవోలకు అదనపు పనిభారమే.

 2013లో జీవో నంబర్ 59 విడుదల..
 గత ప్రభుత్వం 2013లో వీవోలకు అదనపు పనిభారం ఉందని తెలిసి వారి కోసం జీవో నంబర్ 59ని విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి వీవోకు సెర్ప్ నుంచి *2 వేలు వేతనంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా 50 వంతున వచ్చే 1500, వీవో పుస్తకాలు రాసినందుకు ఇచ్చే *300లతో కలుపుకుని మొత్తం *4 వేలు అందజేయాలనేది లక్ష్యం. కానీ సెర్ప్ ద్వారా ఇవ్వాల్సిన 2 వేలను 15 నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఇవ్వకపోవడంపై వీవోలు ఆగ్రహించి సమ్మెలోకి వెళ్లారు.
 
 వీవోల డిమాండ్లు ఇవీ...
 అదనపు పనికి సర్వీస్ చార్జి, 15 నెలల వేతన బకాయిల విడుదల, ఉద్యోగ భద్రత, వీవోలను ఐకేపీ ఉద్యోగులుగా గుర్తించడం, రాజకీయ వత్తిళ్ల నుంచి విముక్తి చేయాలని వారు కోరుతున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మేలు చేకూరుస్తామని చెబుతున్న ఈ ప్రభుత్వం వీవోల సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీవోల పనిభారాన్ని గమనించి వారి డిమాండ్లను పరిష్కరిస్తుందో లేదో, వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement