రోడ్డెక్కని ఆర్టీసీ | Sakshi
Sakshi News home page

రోడ్డెక్కని ఆర్టీసీ

Published Wed, May 6 2015 2:43 AM

Rtc on roads

సమ్మెకు దిగిన 6400 మందికి పైగా కార్మికులు,ఉద్యోగులు
జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన 1100 బస్ సర్వీసులు
రోజుకు రూ.కోటికి పైగా నష్టం
ఆందోళనలో అధికారగణం

 
పట్నంబజారు (గుంటూరు) : సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఇచ్చిన పిలుపునకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వడంతో జిల్లాలోని ప్రగతి చక్రాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ సమ్మెకు ఎన్‌ఎంయూ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మె అనివార్యమైందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మంగళవారం తెలిపారు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బాసటగా నిలవటంతో, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.

రోజుకు రూ. కోటి నష్టం...
 గుంటూరు రీజియన్ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం  6400 మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా సంస్థకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా తప్పటం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రోజుకు రూ. కోటి మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

పలు సంఘాల మద్దతు ...
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈయూ సమ్మెకు పిలుపునిచ్చింది. మరో ప్రధాన యూనియన్ నేషనల్ మజ్దూర్ (ఎన్‌ఎంయూ)తో పాటుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిత్యం రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 1275 సర్వీసులు తిరుతున్నాయి. కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో సుమారు 1100 పైగా బస్సులు నిలిచిపోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

6,400 మంది కార్మికుల్లో ఈయూలో 2, 800 మంది, ఎన్‌ఎంయూలో 2,700 మంది ఉండగా, మిగిలిన వారు వివిధ సంఘాల్లో ఉన్నారు. ఈయూ నాయకులు గత నెల 2వ తేదీన సమ్మె నోటీసులు జారీ చేశారు. సమ్మెలో 13 డిపోల కార్మికులు, నాయకులు పాల్గొనాలని తీర్మానించారు. దీంతో పూర్తి స్థాయిలో బస్సులు నిలిచిపోయే అవ కాశం కూడా ఉంది.

 ప్రత్యామ్నాయం కోసం అధికారుల ప్రయత్నాలు...?
   కార్మికులు సమ్మెకు సిద్ధం కావడంతో బస్సులు నడపటం కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మిక సంఘాల నేత లు మాత్రం ఒక్క బస్సును కూడా డిపోల నుంచి కదలనివ్వబోమని తేల్చిచెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement