రూ.20 కోట్లు ఇస్తామన్నారు...

Rs 20 crore bargain for mla rajeshwari vantala  - Sakshi

అందుకే వంత పాడుతున్న వంతల

గతాన్ని మరిచి పార్టీకి    నమ్మక ద్రోహం

లోపాయికారీ డీల్‌ ఎంతన్నదానిపై చర్చ

ఎక్కడో మారుమూల గ్రామం మాది. నేనీ స్థానంలో ఉన్నానంటే జగనన్నే కారణం. టిక్కెట్‌ ఇచ్చి గెలిపించారాయన. టీడీపీలో చేరితే రూ. 20 కోట్లు ఇస్తానన్నారు. కానీ డబ్బుకు లొంగను.  ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఉన్నాను. నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు అపారమైన నమ్మకంతో వైఎస్సార్‌ సీపీకి ఓట్లేసి గెలిపించి శాసనసభకు పంపించారు. అదే నమ్మకంతో, విశ్వాసంతో పని చేస్తాను. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాను. పార్టీ మారే ఉద్దేశం లేదు.
2016మార్చి 28న అసెంబ్లీ ప్రాంగణం సాక్షి గా ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చేసిన వాఖ్యలివీ...

ఆ రూ.20 కోట్లేనా...  సంఖ్య పెరిగిందా...
ఇప్పుడా విశ్వాసం ఏమైంది? కృతజ్ఞత ఎక్కడికిపోయింది? ఇంతలోనే అంత మార్పేంటి? రూ. 20 కోట్లు ఇస్తానని ప్రలోభ పెట్టినా పార్టీ మారనని చెప్పిన వంతల రాజేశ్వరీ ఇప్పుడు కుదిరిన డీల్‌ ఎంతో చెప్పాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నమ్మక ద్రోహమంటే ఇది కాదా అని  నియోజకవర్గంలోని గిరిజనులు ఛీత్కరించుకుంటున్నారు. మన్యం పరువు, ప్రతిష్టలను మంటగలిపారని మండిపడుతున్నారు. ఓట్లు వేసి విజయ బావుటా అందిస్తే నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయిస్తారా అని ఏజెన్సీలో ప్రతి పల్లె ప్రశ్నిస్తోంది.

మె ఓ సామాన్య దినకూలీ...ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు...గిరిజనం ఎంతో పొంగిపోయారు. మన్యానికి దక్కిన గౌరవంగా భావించారు. ఆమె కూడా కోట్ల రూపాయల ఆశ చూపినా వెళ్లలేదంటే నిజమే అనుకున్నారు. నైతిక విలువలకు తిలోదకాలిచ్చి పచ్చ కండువా కప్పుకోవడంతో నియోజకవర్గం నివ్వెరపోయింది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీలో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరికి ప్రత్యేక స్థానాన్ని వైఎస్సార్‌ సీపీ కల్పించింది. ఎన్నికల్లో విజయానికి కృషి చేసిన నాయకులతో ఈమె విభేదించినప్పటికీ అధిష్టానం ప్రాధాన్యత కల్పించింది. సోదరి సమానురాలిగా వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి చూసుకున్నారు. ఆ విశ్వాసాన్ని తాకట్టు పెట్టేశారు. నమ్మకానికి వెన్నుపోటు పొడిచారు. రూ.20 కోట్లు ఇస్తానని ఆశ చూపినా మారనని ఏడాది కిందట చెప్పిన ఈమె ఆకస్మికంగా పార్టీ ఫిరాయించడం వెనక భారీ ఒప్పందం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇంతలో ఎంత మార్పు : ఏజెన్సీలో గనులు దోచుకునేందుకు సర్కార్‌ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఎండగట్టారు. ఇటీవల నియమించిన గిరిజన సలహా మండలి ఏర్పాటులో నిబంధనల్ని తుంగలోకి తొక్కి పెట్టారని ఏకరవు పెట్టారు. ఏజెన్సీని కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రోడ్లు, తాగునీరు తదితర మౌలిక సౌకర్యాల్లేవని, చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గగ్గోలు పెట్టారు. ఏజెన్సీలో గిరిజనులు చనిపోతున్నా పట్టించుకోవడం లేదని....వైద్య సేవలు అందించడం లేదని అంతెత్తున లేచారు. విష జ్వరాలు, కాళ్లవ్యాపు వాధితో గిరిజనులు చనిపోతున్నా ... పెద్ద ఎత్తున మాతా శిశు మరణాలు సంభవిస్తున్నా ... సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరిస్తోందని, గిరిజనులపై కనీసం జాలి చూపించడం లేదని «ధ్వజమెత్తిన వంతల ఉన్న ఫళంగా ప్రభుత్వం మంచిదైపోయిందని వంత పాడడం చూస్తే ఎవరికైనా అనుమానాలు రాకమానవు. ఇన్నాళ్లూ రాష్ట్రాన్ని సక్రమంగా పాలించలేదని చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారని భజన చేస్తే జనాలు నమ్ముతారనుకుంటే పొరపాటే. ఒక్కసారిగా వచ్చిన మార్పు వెనుక లోపాయికారీ ఒప్పందం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తారన్న ఇంగితం కూడా లేకుండా పోయిందని ప్రజాస్వామ్యవాదులు మథనపడుతున్నారు.

కదలని క్యాడర్‌...
ఎమ్మెల్యే పచ్చ కండువా వేసుకున్నప్పటికీ తాము ఆ తప్పు చేయలేమని...ఆత్మవంచన చేసుకుని పార్టీ మారలేమని.... మీకా విశ్వాసం లేకపోయినా తామంతా వైఎస్సార్‌సీపీలోనే ఉంటామంటూ రంపచోడవరం నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌ ఎమ్మెల్యేకు తేల్చి చెప్పారు. ఒకరిద్దరితో వెళ్లి పసుపు కండువా వేసుకున్న  వంతల ఇప్పుడు ఏరకంగా నియోజకవర్గ ప్రజలకు మొహం చూపిస్తారోనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పార్టీకి నష్టమేమీ లేదు...అనంత ఉదయ భాస్కర్‌
అడ్డతీగల: ప్రజల ఆకాంక్షల మేరకు పుట్టుకొచ్చిన వైఎస్సార్‌సీపీని ఎవరు వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమీలేదని వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం కో ఆర్డినేటర్‌ అనంత ఉదయ భాస్కర్‌ అన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో ఆయన అడ్డతీగలలో విలేకర్లతో మాట్లాడుతూ ఏనాడూ పార్టీ అభివృద్ధి కోసం ఆమె కష్టపడింది లేదన్నారు. పార్టీ వల్ల పదవులతోపాటు ఆర్థికంగా ఆమె లాభపడ్డారన్నారు. ఏ స్థాయి నుంచి ప్రస్తుత స్థాయికి వచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఏజెన్సీలో పార్టీ క్యాడర్‌ చెక్కుచెదరలేదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top