డీజీపీగా గౌతమ్‌ సవాంగ్‌

RP Thakur shunted And Gautam Sawang is new DGP of Andhra Pradesh - Sakshi

పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

ఏసీబీ ఏడీజీగా కుమార్‌ విశ్వజిత్‌ నియామకం 

ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ కమిషనర్‌గా ఆర్పీ ఠాకూర్‌ బదిలీ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసుగా(డీజీపీ) పూర్తి అదనపు బాధ్యతలను సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతమ్‌ సవాంగ్‌కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా కొనసాగుతారు. నలుగురు ఐపీఎస్‌ల బదిలీలకు సంబంధించి రెండు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటిదాకా డీజీపీగా పనిచేసిన ఆర్పీ ఠాకూర్‌ను ప్రింటింగ్, స్టేషనరీ అండ్‌ స్టోర్స్, పర్ఛేజ్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కుమార్‌ విశ్వజిత్‌ను అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఏడీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును వేరొక పోస్టులో నియమించే వరకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆ ఇద్దరి తీరు వివాదాస్పదం
ఎన్నికల ముందు నుంచి డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం వీరిద్దరూ పనిచేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. వారు ఆయా పోస్టుల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసింది. దీంతో ఠాకూర్‌ను ఏసీబీ డీజీ పోస్టు నుంచి తప్పించి డీజీపీగా కొనసాగించేలా ఈసీ నిర్ణయం తీసుకుంది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు నుంచి బదిలీ చేయడంతోపాటు ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని ఈసీ ఆదేశించింది. ఏబీ వెంకటేశ్వరరావును ఇంటెలిజెన్స్‌ డీజీ పోస్టు నుంచి తప్పించేందుకు చంద్రబాబు ససేమిరా అన్నప్పటికీ కోర్టు జోక్యంతో తప్పనిసరి అయ్యింది. ఖాళీ అయిన ఏసీబీ డీజీ పోస్టులో ఏబీ వెంకటేశ్వరరావును చంద్రబాబు సర్కారు నియమించింది.   

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏఎస్పీ నుంచి డీజీపీ వరకు..  
అస్సాంకు చెందిన గౌతమ్‌ సవాంగ్‌ అరుణాచల్‌ ప్రదేశ్, కేరళ, మేఘాలయ, లక్షద్వీప్, త్రిపుర, ఢిల్లీలో ప్రా«థమిక విద్య అభ్యసించారు. గ్రాడ్యుయేషన్‌ చెన్నై లయోలా కాలేజీ, పీజీ ఢిల్లీ యూనివర్శిటీలో సాగింది. ఐపీఎస్‌ 1986 బ్యాచ్‌కు చెందిన సవాంగ్‌ ఏపీ కేడర్‌ అధికారి. ఏఎస్పీగా ఆయన ప్రస్థానం మొదలైంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినరోజే రాష్ట్ర పోలీస్‌ బాస్‌గా పూర్తి అదనపు బాధ్యతలు సవాంగ్‌కు దక్కడం విశేషం. సవాంగ్‌ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా పనిచేశారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఏపీ గ్రేహౌండ్స్‌ విభాగం ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌లో వెస్ట్‌ జోన్‌ ట్రాఫిక్‌ డీసీపీగా సేవలందించారు.

2000లో డీఐజీగా పదోన్నతి పొంది వరంగల్, కరీంనగర్‌ రేంజ్‌ల్లో పనిచేశారు. ఏసీబీ, ఎస్‌ఐబీ వింగ్‌లో విధులు నిర్వర్తించారు. 2005 నుంచి 2008 వరకు సీఆర్‌పీఎఫ్‌ డీఐజీగా కేంద్ర సర్వీసుకు వెళ్లారు. అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించేందుకు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఏపీలో పనిచేశారు. 2008 నుంచి 2012 వరకు ఐక్యరాజ్యసమితి తరపున లైబిరియాలో పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఏడీజీగా పదోన్నతి పొంది ఏపీఎస్పీలో పనిచేసి, తర్వాత 2015 నుంచి విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2016 జూన్‌లో ఆయనకు డీజీగా పదోన్నతి వచ్చింది. సవాంగ్‌ను డీజీపీగా నియమిస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు చివరి నిమిషంలో ఆర్పీ ఠాకూర్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. సవాంగ్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా చంద్రబాబు ప్రభుత్వం నియమించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top