చౌకగా పనిచేయలేం

ration shop dealers facing problems with maintenance cost - Sakshi

 పనిభారం పెరిగిందంటున్న చౌక డీలర్లు

 క్వింటాల్‌కు రూ.150 కమీషన్‌ పెంచాలని డిమాండ్‌

 కష్టానికి తగిన ఫలితం లేదు

 ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పెదవివిరుపు

ఈ–పాస్‌ వచ్చాక రేషన్‌ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, ఇతర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. డీడీలు కట్ట డం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డీలర్లు చెబుతున్నారు. కమీషన్‌ చాలా తక్కువగా ఉందని, క్వింటాల్‌ బియ్యానికి రూ.150కి పెంచాలని, నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు.

కురబలకోట : చౌక దుకాణాల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అలసత్వాన్ని ప్రదర్శిస్తోందని డీలర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీడీలు కట్టడం నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ వరకు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నియోజక వర్గంలో 150 మంది డీలర్లు ఉన్నారు. నెలలో 15 రోజుల   సరుకులు ఇవ్వడానికే సమయం సరిపోతోందని  చెబుతున్నారు. ప్రభు త్వ పథకాల అమలులో  భాగస్వామం కావాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కమీషన్‌ పెంచాలని, మధ్యాహ్న భోజనం, ఐసీడీఎస్‌కు సరఫరా చేస్తున్న సరుకుల బకాయిలను ప్రభుత్వం చెల్లించాలని   డిమాండ్‌ చేస్తున్నారు. ఈ–పాస్‌ వచ్చాక పని భారం పెరిగి వ్యయప్రయాసలు ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కనీస ఆదాయం లేక  కాలం గడుపుతున్న తమ గోడు ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.  

వ్యయప్రయాసలు
రేషన్‌ షాపుల నిర్వహణ వ్యయ ప్రయాసగా మారింది. షాపు బాడుగ, కూలీల ఖర్చు, కరెంట్‌ చార్జీలు, అదనపు పనివారు, అన్‌లోడింగ్‌చార్జీలు, బ్యాంకు చలానాతో పాటు ఇతర ఖర్చులుతడిసి మోపెడవుతున్నాయి. డీలర్‌కు ఇచ్చే కమీషన్‌ కూడా తక్కువే. విధిలేక వదలలేక చేస్తున్నాం. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతాం
–గోపాల్‌ రెడ్డి, డీలర్ల అసోసియేషన్‌ డివిజన్‌ అధ్యక్షుడు

కమీషన్‌ పెంచాలి
క్వింటాల్‌ బియ్యానికి రూ.70 కమీషన్‌ ఇస్తున్నారు. దీన్ని రూ.150కి పెం చాలి. కూలీలతో పాటు షాపు నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే భరించాలి. కార్డుకు సర్‌చార్జీ కింద రూ.10 ఇవ్వాలి.  మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు ప్రభుత్వ పథకాల్లో సహకరిస్తున్నా కష్టానికి తగ్గ ఫలితం లేదు
–ఎస్‌ఎం.బాషా, డీలర్ల సంఘం నాయకుడు, కురబలకోట 
 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top