'దిశ' అప్పుడు ఉంటే.. రిషితేశ్వరి బతికేది!

సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' చట్టం.. నాలుగేళ్ల కిందటే వచ్చి ఉంటే.. తమ కూతురు బలవన్మరణానికి పాల్పడకుండా ఇవాళ బతికే ఉండేదని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే సత్వరమే కఠినశిక్ష విధించేలా తీసుకొచ్చిన దిశ చట్టంపై రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ,దుర్గాబాయ్ మాట్లాడారు. దిశ చట్టంతో ఆడపిల్లలు, మహిళలు ఎంతో ధైర్యంగా ఉంటారని, వారితో అసభ్యంగా ప్రవర్తించాలని చూస్తే మరణ శిక్ష పడుతుందనే భయం వస్తుందని అన్నారు.
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి.. రాష్ట్రంలోని ఆడపిల్లల తరపున కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలల విద్యార్థులతో పాటుగా గ్రామీణ స్థాయిలో ప్రజలకు దిశ చట్టంపై అవగహన కల్పించాలని ఈ సందర్భంగా రిషితేశ్వరి తల్లిదండ్రులు కోరారు. గతంలోకి వెళితే.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సహ విద్యార్థుల అమానుష చర్యల (ర్యాగింగ్) కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఎం. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబూరావుతో సహా మరో ముగ్గురు విద్యార్థుల ప్రమేయం ఉన్న సంగతి తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి