‘గుండె’ చేజారుతోంది | Poor Student Suffering With heart disease In Anantapur | Sakshi
Sakshi News home page

‘గుండె’ చేజారుతోంది

Jul 23 2018 10:44 AM | Updated on Jul 23 2018 10:44 AM

Poor Student Suffering With heart disease In Anantapur - Sakshi

తల్లిదండ్రులతో బాధితుడు శివభారత్‌

నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. కళ్లముందే చెట్టంత కొడుకు మృత్యువుకు చేరువవుతూ ఉంటే.. చూస్తూ మౌనంగా రోదిస్తోంది. ఆర్థిక సమస్యల భారంతో తామేమీ చేయలేని అసహా స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

అనంతపురం, పామిడి :గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి పట్టణం నెహ్రూనగర్‌కు చెందిన సి.పోతన్న, సి.నాగరతమ్మ దంపతులకు శివభారత్‌ (ప్రస్తుతం అతని వయసు 18 సంవత్సరాలు) ఒక్కగానొక్క కుమారుడు. సీఎస్‌ఐ చర్చివీధిలో ఓ గుడిసెలో నివసిస్తున్న పోతన్న ఎద్దుల బండిలో సరుకులు తరలిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదాయం అంతంగా మాత్రంగానే ఉండడంతో భార్య కూలీ పనులతో సంసారాన్ని నెట్టుకొస్తోంది. మూడేళ్ల క్రితం పోతన్న అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స కోసం అప్పటి వరకూ కూడబెట్టిన సొమ్ముకు తోడు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద రూ. లక్ష వరకు అప్పు చేయాల్సి వచ్చింది.

ఐటీఐ మానేసి.. కూలీగా మారి
తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో కుటుంబ పోషణ భారాన్ని తల్లితో పాటు శివభారత్‌ పంచుకున్నాడు. ఐటీఐలో సాంకేతిక విద్యనభ్యసిస్తున్న అతను మధ్యలోనే చదువులకు స్వస్తి పలకాల్సి వచ్చింది. గార్లదిన్నె మండలం కల్లూరులోని భాస్కరరెడ్డి ఐరన్‌ మార్ట్‌లో నెలకు రూ. 6వేలు వేతనంతో కూలీగా చేరాడు.

వెంటాడుతున్న మృత్యువు
రెండు నెలల క్రితం శివభారత్‌ తీవ్ర ఆయాసంతో అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి తీసుకోవడం భారంగా మారింది. పామిడి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో చూపించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్‌ గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడని, శస్త్రచికిత్సతోనే అతని జబ్బు నయమవుతుందని తేల్చి చెప్పారు. అంతేకాక ఎన్టీఆర్‌ వైద్య సేవ కింద విజయవాడలోని ఉషా కార్డియాక్‌ సెంటర్‌కు సిఫారసు చేశారు. పది రోజులు విజయవాడలో చికిత్స చేయించుకున్నాడు. అయినా నయం కాలేదు. వైద్య పరీక్షల అనంతరం శివభారత్‌కు గుండె మార్పిడి అవసరమని వైద్య నిపుణుడు డాక్టర్‌ వై.వి.రావు గుర్తించారు. ఇదే విషయాన్ని బాధితుడి తల్లిదండ్రులకు ఆయన వివరించి, అరుదైన ఈ చికిత్స గుంటూరులోని ప్రభుత్వాస్పత్రిలో చేస్తారంటూ అక్కడకు సిఫారసు చేశారు. 

గండం గట్టెక్కానా?
అనారోగ్యంతో బాధపడుతున్న పోతన్న కొన్ని నెలలుగా బండి తోలడం మానేశాడు. దీంతో అతని రోజు వారి సంపాదన రూ. 200 కొండెక్కింది. కుటుంబ పోషణ కోసం కూలీ పనుల ద్వారా రోజుకు రూ. 100 సంపాదించుకుని వస్తున్న నాగరత్నమ్మ కూడా ఇటీవల కొన్ని రోజులుగా కుమారుడి బాగోగులు చూసుకుంటూ ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోంది. దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్న ఇలాంటి తరుణంలో కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు రూ. 30 లక్షలు సమకూర్చుకోవడంలో వారికి తలకు మించిన భారంగా మారింది. కళ్ల ముందే మృత్యువుకు చేరవవుతున్న కుమారుడిని చూస్తూ రోదించని రోజంటూ లేదు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టే ఆపన్న హస్తం కోసం నిరుపేద కుటుంబం ఎదురు చూస్తోంది.

గుండె మార్పిడి తప్పనిసరి
తమ కుమారుడికి గుండె మార్పిడి అత్యవసరమన్న విషయం తెలుసుకోగానే నిరుపేద తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలైపోయారు. అయినా ఎక్కడో ఒక ఆశ. ప్రభుత్వాస్పత్రి కాబట్టి ఉచితంగా చేస్తారన్న కొండంత ఆశ. పైగా ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ఎలాగూ ఉంది అనే ధైర్యంతో ఈ నెల 19న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి కుమారుడిని పిలుచుకెళ్లారు. గతంలో శివభారత్‌కి అందించిన వైద్య సేవలకు సంబంధించిన రిపోర్టులు, విజయవాడలోని వైద్యులు అందజేసిన నివేదికను పరిశీలించిన అనంతరం గుండె మార్పిడి అత్యవసరమని గుర్తించారు. అయితే అంతకు ముందు గుండెకు సంబంధించిన సమగ్ర పరీక్షల కోసం రూ. లక్ష వరకు,  అనంతరం గుండె మార్పికి రూ. 30 లక్షల వరకు ఖర్చు వస్తుందని తేల్చి చెప్పారు. విషయం విన్న నిరుపేద తల్లిదండ్రులకు దిక్కు తోచలేదు. పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో ప్రాణాపాయం నుంచి కుమారుడిని ఎలా గట్టెక్కించాలో అర్థం కాక బరువెక్కిన హృదయాలతో బస్కు ఎక్కి శనివారం పామిడికి చేరుకున్నారు.

సాయం  చేయదలిస్తే..
పేరు :   సి.నాగరత్నమ్మ
బ్యాంక్‌ ఖాతా :  0422 1010 015 3521
ఐఎఫ్‌ఎస్‌ కోడ్‌ : ఏఎన్‌డీబీ0000422
బ్యాంక్‌ పేరు : ఆంధ్రాబ్యాంకు, పామిడి శాఖ
అదనపు సమాచారానికి సంప్రదించండి : 73864 79722

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement