'బరి'తెగిస్తున్నారు...!

Political Leaders Ready For Sankranthi Hen Fights in YSR Kadapa - Sakshi

రాజకీయ కత్తులు దూస్తున్న పందెం కోళ్లు

రంగులను బట్టి కోళ్లకు డిమాండ్‌

చేతులు మారుతున్న రూ. కోట్లు

గ్రామాల్లో మొదలైన సంక్రాంతి సందడి....

కొంతమందికి పందెం కాయడం సరదా... మరికొంతమందికి ప్రవృత్తి... ఎన్నికల ఫలితాలా లేక క్రికెట్,మట్కా, పేకాట, కోడిపందెం అన్న వాటితో సంబంధంలేకుండా సీజనల్‌ వారీగా, అనుకూలంగా ఉన్న వాటిని
ఎంచుకోవడం పరిపాటిగా మారింది. సంక్రాంతి ఇంకాపది రోజులు ఉండగానే పందెంరాయుళ్లు బరిలోకి కోళ్లనుదింపారు... కాళ్లకు కత్తులు కట్టి రసవత్తరంగా పోటీలు నిర్వహిస్తున్నారు.. రూ. కోట్ల రూపాయలు చేతులుమారుతున్నాయి... ఇక పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటేపండుగ రోజుల్లో ఇంకెన్ని రూ.కోట్లు చేతులు మారుతాయో పరిస్థితికి అద్దం పడుతోంది. అసాంఘికకార్యక్రమాలను పోట్లాటలో ఆగినంత గస వస్తోందే
తప్ప వాటిని పోలీసులు నిలువరించలేక పోతున్నారన్నవిమర్శలు వినిపిస్తున్నాయి.

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాయచోటి : జిల్లాలో కోడిపందెంరాయుళ్లకు సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు మరో వారం రోజులు ఉండగానే పందేలు లక్షలు, కోట్ల రూపాయలుగా చేతులు మారుతున్నాయి. రంగ వల్లులు.. తినుబండారాలు.. వచ్చే బంధువుల జాబితాలతో మహిళలు ముచ్చటిస్తుండగా, కోడి పందెలు, ఎద్దుల బల ప్రదర్శన తదితర పందేల గురించి యువకులు, పురుషుల మధ్య జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఒక్కో కోడి పుంజు ఈక, కలరు, జాతిని బట్టి రూ.5 నుంచి లక్ష రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రాయచోటి, రాజంపేట, బద్వేల్, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో కోడిపందెం ఆట మూడు పుంజులు ఆరు కత్తులు అన్న రీతిలో సాగుతోంది. పందెం రాయుళ్లపై పోలీసులు డేగకన్నేసినప్పటికీ కోడిపుంజుల తన్నులాటలను మాత్రం నిలువరించలేక పోతున్నారు. ప్రతి రోజు పులివెందుల, రాజంపేట సబ్‌ డివిజన్ల పరిధిల్లో కోడిపందెం స్థావరాలపై దాడులు చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. కోడి పుంజులతో పాటు లక్షల రూపాయలు పట్టుబడుతున్నా చర్యల పరంగా నామమాత్రం కావడంతో కోడిపందెం రాయుళ్లు బరితెగిస్తున్నారు... సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న కొద్ది పందెం కోళ్ల కోసం వేట మొదలైంది.

రంగును బట్టి ధర..
పందెం కోళ్ల కోసం జిల్లాలో పల్లె, పట్టణం అన్నా తేడా లేకుండా డిమాండ్‌ భారీగా నెలకొంది. బలమైన కోడికూత వినిపిస్తే చాలు క్షణాల్లో అక్కడ పందెంరాయుళ్లు వాలిపోతున్నారు. కోడిని పట్టిపట్టి పరీక్షించి యజమానితో బేరసారాలు సాగిస్తున్నారు. రంగును బట్టి కోడి ధరను నిర్ణయిస్తున్నారు. జాతిని బట్టి ఒక్కో కోడి ధరలు వేల నుంచి లక్ష రూపాయల వరకు పలుకుతున్నాయి. జాతితో పాటు రంగులూ కలిసొస్తే అనుకున్న ధరకంటే మరింత వెచ్చించడానికి పందెం ప్రియుళ్లు సిద్ధమవుతున్నారు.

వ్యాపారంగా...
కోడిపందెం ఆడడం కొంతమందికి ఆనందమైతే.. ఆ కోడి పుంజులను సేకరించి వాటిని నాజూగ్గాను, పందెం పిచ్‌లో పరుగులు, ఎదుటి కోడిపై ఎగిరి దూకేలా తయారు చేయడం సదానందం. వీటి సేకరణ, యుద్ధానికి తయారు చేసి విక్రయిం చుకోవడంతో అనేకమంది వేలకు వేల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నారు. ఇందుకోసం పల్లెల వెంట తిరిగి కోడిపుంజులను సేకరించి ఇళ్ల ముంగిట కట్టేసి వాటికి ప్రత్యేక ఆహారాన్ని అందిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం
కోడి పందెం ఆట చట్ట వ్యతి రేకం. ఎవరు ప్రోత్సహించినా, ఆడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అనేకమంది సంక్రాంతి పండుగ సంప్రదాయమంటూ కోడిపందెం ఆటపై దృష్టి పెడుతున్నారు. అలాంటి ఆటలను సాగనివ్వం. కోడిపందెం  ఎక్కడ జరుగుతున్నా దాడులు నిర్వహించి, కేసులు నమోదు చేస్తాం.    –నాగరాజ, డీఎస్పీ, పులివెందుల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top