ప్చ్‌.. నిరాశే

Political And Economic Experts Are Commenting On The Union Budget - Sakshi

కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావన లేని రీఆర్గనైజేషన్‌ బిల్లు అంశాలు

వేతన జీవులకు ఊరట  

చిన్న, సన్నకారు రైతులకు చేయూత

బంగారంపై అదనపు పన్ను.. పెరగనున్న ధర 

గృహ నిర్మాణ రంగంపై భారం

కేంద్ర బడ్జెట్‌పై పెదవి విరుస్తున్న రాజకీయ, ఆర్థిక రంగ నిపుణులు

కేంద్ర ప్రభుత్వం వేతనజీవులు.. చిన్న, సన్నకారు రైతుల పట్ల మమ అన్పించడం మినహా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల ప్రత్యేక చొరవ చూపెట్టలేకపోయింది. రీఆర్గనైజేషన్‌ బిల్లు అంశాలే గుర్తించలేదు. చట్టంలో పొందుపర్చిన ఉక్కుపరిశ్రమ ఊసే లేకపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రానికి మొండిచేయి చూపారు. బడ్జెట్‌లో జిల్లా ఊసే లేకుండా పోయింది. మధ్యతరగతి ప్రజానీకానికి ప్రత్యక్షంగా ఊరట కల్పించినా, పరోక్షంగా నడ్డివిరిచే చర్యలే అధికంగా ఉన్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ రూపొందించిన బడ్జెట్‌పై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 

సాక్షి ప్రతినిధి, కడప: కేంద్ర ప్రభుత్వం చర్యలు చిరుద్యోగులు, బడుగుజీవులకు ఊరట కల్పించే దిశగా ఉన్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లో ఈ విషయం ప్రస్ఫుటమౌతోంది. రాష్ట్రాల ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా అసంఘటిత కార్మికులు, చిరుద్యోగులు, పేద, మధ్యతరగతి ప్రజానీకానికి లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారు. వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంచారు. సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1.5 లక్షలు నుంచి రూ.2 లక్షలకు పెంచడాన్ని చిరుద్యోగులు హర్షిస్తున్నారు.

గృహ రుణాలు, ఇంటి అద్దెలు, ఇన్‌స్రూ?న్స్‌లను అందులో చూపించవచ్చు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిస్తోంది. ఔట్‌సోర్సింగ్, నూతనంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇది ప్రయోజనకరమని, 10 ఏళ్లు సర్వీసు ఉన్న ఉద్యోగులకు బడ్జెట్‌తో వాతలు పెట్టారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.5 లక్షల పైన వార్షిక ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లింపు బాదుడు పెట్టారని పలువురు వివరిస్తున్నారు. రూ.10 లక్షల వరకూ 20 శాతం చెల్లించేలా నిర్ణయించడంపై ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి.
 
కర్షకుడిపై కరుణ
రైతుల పట్ల కనీస బాధ్యతను కేంద్ర ప్రభుత్వం గుర్తించి బడ్జెట్‌లో పెట్టింది. పెట్టుబడి నిధి కింద చిన్న, సన్నకారు రైతులకు ఎకరాకు రూ.6 వేలు కేటాయించేలా పొందుపర్చారు. పెట్టుబడి నిధి రూ.3 లక్షల కోట్లకు పెంచాలనే డిమాండ్‌ ఉన్నా పరిగణనలోకి తీసుకోలేదు. చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఈ పథకం ద్వారా జిల్లాలో నేరుగా 3.64 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

కాగా కౌలుదారులకు, వ్యవసాయ కూలీలకు ప్రయోజనం గుర్తించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోతున్న రైతులకు రుణాలు రీషెడ్యూల్‌ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఈ పరిణామం కొంత హర్షించదగ్గ విషయమని పలువురు వెల్లడిస్తున్నారు. గృహాపకరణ వస్తువుల పెంపుతో నిర్మాణభారం పెరగనుంది. అయితే, రూ.45 లక్షలలోపు గృహ రుణాలు పొందిన వారికి రూ.3.5 లక్షలు వడ్డీ రాయితీ వర్తించేలా తీసుకున్న నిర్ణయంతో కాస్తా ఊరట దక్కింది.

పెట్రో భారం
పెట్రోల్, డీజిల్‌పై లీటరు రూ.2.50 ధర పెరిగింది. తెలియకుండానే ప్రజానీకం భారం భరించేలా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లీటర్‌  పెట్రోల్‌ ధర రూ.73.97, డీజిల్‌ ధర రూ.68.83 ఉంది. జిల్లాలో 300 పెట్రోల్‌ బంకుల ద్వారా ఒక్క రోజుకు సరాసరిగా పెట్రోల్‌ 5 లక్షల లీటర్లు, డీజిల్‌ 15 లక్షలు లీటర్లు వినియోగం ఉంది. పెంచిన ధరల కారణంగా ప్రతి రోజు పెట్రోల్‌పై రూ.12.5 లక్షలు, డీజిల్‌పై రూ.37.5 లక్షలు అదనపు భారం భరించనున్నారు. 

ఏపీకి ప్రత్యేక హోదా, రీ–ఆర్గనైజేషన్‌(పునర్‌ వ్యవస్థీకరణ) బిల్లులోని ఇతర అంశాలు గుర్తుకు రాలేదని పలువురు వాపోతున్నారు. కడప గడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని చట్టం చేసినా నరేంద్రమోదీ సర్కార్‌ విస్మరిస్తోంది. తాజా బడ్జెట్‌లో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ పరిణామం జిల్లా వాసులకు రుచించడం లేదు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం పట్ల ప్రత్యేక కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్ర ప్రజానీకం పెదవి విరుస్తోంది. 

పసిడిపై పిడుగు
ప్రొద్దుటూరు కల్చరల్‌ : బంగారం వ్యాపారంలో రెండో ముంబయిగా ప్రొద్దుటూరు పట్టణం పేరుగాంచింది. జిల్లా నుంచే కాక కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి కూడా కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే ఇటీవల కాలంలో బంగారం ధర పెరగడంతో వ్యాపారాలు తగ్గాయని చెప్పవచ్చు. బంగారంపై రెండేళ్ల క్రితం విధించిన 3 శాతం జీఎస్టీ నుంచి ఇంకా కోలుకోకముందే.. కేంద్రం పన్ను పెంచడంపై బంగారు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. 10 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీతో మొత్తం 13 శాతం ఉండేది. అయితే ఈ బడ్జెట్‌లో 12.5 శాతం దిగుమతి సుంకం, 3 శాతం జీఎస్టీతో కలిపి మొత్తం 15.5 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల కొనుగోళ్లు బాగా తగ్గి బంగారు వ్యాపారులు,  కార్మికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు అంటున్నారు.

కేంద్రం పెంచిన పన్ను వల్ల దేశంలోకి బంగారం స్మగ్లింగ్‌ ఎక్కువగా జరిగే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌ ధర కంటే స్మగ్లింగ్‌ ద్వారా వచ్చే బంగారం 10 గ్రాములపై రూ.1300 నుంచి రూ.1500 తక్కువగా లభిస్తోంది. పెంచిన పన్ను వల్ల స్మగ్లింగ్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం డాలర్ల ఖర్చును తగ్గించుకోవడానికి ప్రజల్లో బంగారంపై మోజు తగ్గించడానికి, బంగారంపై పన్ను పెంచుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర పెరుగుదలతో వ్యాపారాలు తగ్గిపోయాయని, పన్ను పెంపుతో తాము జీవనోపాధి కోల్పోతామని షరాబు వ్యాపారులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో 6 వేల మంది స్వర్ణకార్మికులు, 750 మందిపైగా వ్యాపారులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 వేల మంది స్వర్ణకార్మికులు, 5 వేల మంది దాకా వ్యాపారులు ఉన్నారు. వీరందరిపై పన్నుల పెంపు ప్రభావం చూపనుంది. ఉదయం 24 క్యారెట్ల గ్రాము ధర రూ.3390 ఉండగా బడ్జెట్‌ తరువాత రూ.180 పెరిగి రూ.3570 చేరింది. వెండి కిలోపై రూ.300 పెరిగింది.

ఉక్కు పరిశ్రమ ఊసే లేదు
ఆంధ్రప్రదేశ్‌కు విభజన సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ బడ్జెట్‌ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదు. రాజధానికి గానీ, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు గానీ ఏమాత్రం నిధులు కేటాయింపులు జరగలేదు. కొత్త ప్రభుత్వంలోనైనా రాష్ట్రానికి కేంద్రం సహకారం ఇస్తుందని ప్రజలు భావించినా నిరాశే ఎదురయ్యింది. 
– కె.సురేష్‌బాబు, కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ 

లోటు బడ్జెట్‌ను పూడ్చే ప్రయత్నం చేయలేదు
విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో లోటు బడ్జెట్‌ ఏర్పడింది. దాన్ని పూడ్చేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందించలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది. బడ్జెట్‌లో దాని ప్రస్తావనే తీసుకురాలేదు. పోలవరం ప్రాజక్టు నిధుల విషయం గానీ, కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదన గానీ లేదు.
– ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, వైఎస్‌ఆర్‌సీపీ 

కేంద్రంతో పోరాటం చేయాలి
ఐదేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మారినా అన్యాయమే చేశారు. విభజన హామీలను అమల్లోకి తీసుకురాలేదు. ఉక్కు పరిశ్రమ, ప్రత్యేక హోదా, ఆగిపోయిన ప్రాజెక్టులకు నిధులు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు ఆర్థిక సహకారం వంటివి బడ్జెట్‌లో పొందుపరచలేదు. ఇది ఏపీ ప్రజల గొంతు కోసే పని. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కలుపుకొని బీజేపీపై పోరాటం చేయాలి.    – ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి, సీపీఎం  

ప్రజా వ్యతిరేక బడ్జెట్‌
బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రజానుకూలంగా లేదు. బడ్జెట్లో ఏపీకి తీరని అన్యాయం, నష్టం చేసేలా, పెట్టుబడిదారులకు ఊడిగం చేసేలా ఉంది. ప్రత్యేక విభజన చట్టంలో పొందుపరిచిన ఏ అంశాలు ప్రస్తావనకు రాకపోవడం బీజేపీ నిరంకుశ పాలనకు నిదర్శనం. బడ్జెట్‌ అంతా అంకెలగారడీతో, అబద్ధాలతో, అర్ధ సత్యాలతో నిండిపోయింది.      – జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి, సీపీఐ 

రాష్ట్రానికి మోసం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి నిధులు కేటాయించకుండా మోసం చేసింది. అమరావతికి నిధుల ప్రస్తావన లేదు. బ్యాంకింగ్, రైల్వే, విమానయాన సంస్థలను ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్ర పన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించాల్సి ఉండగా.. ఆ ఊసే లేకపోవడం బాధాకరం.         –నీలి శ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతినిధి, కాంగ్రెస్‌ 

రైతులకు భరోసా ఇవ్వని బడ్జెట్‌
కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ రైతులకు ఏమాత్రం భరోసా లేవ్వలేదు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం పంట సాగు ఖర్చులకు 50 శాతం మేర ధరలు పెంచుతామని చెప్పింది. ఇప్పుడు ఆ ఊసే లేకపోవడం బాధాకరం.  రైతులపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. పెట్రోల్, డీజిల్‌పై రూ.1 సుంకం పెంచడం సరికాదు.       – బి.దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం 

పేదల సంక్షేమానికి నిధులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చాలా బాగుంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రైతులకు ప్రాధాన్యత కల్పించారు.  పేదల సంక్షేమానికి నిధులు కేటాయించారు.     
– ఆర్‌.సదాశివశర్మ, సీనియర్‌ ఆడిటర్, ప్రొద్దుటూరు

వ్యవసాయ రంగానికి పెద్దపీట 
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, విద్యాభివృద్ధికి పెద్దపీట వేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచడానికి రూ.80 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరచడానికి 10 వేల వ్యవసాయ సంస్థలను నూతనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
– కనపర్తి త్రివిక్రమ్‌రెడ్డి, ప్రిన్సిపాల్, గౌరీశంకర్‌ జూనియర్‌ కాలేజీ, ప్రొద్దుటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top