దివ్య కేసులో షాకింగ్‌ నిజాలు.. లక్షకు అమ్మకం

Police Investigation In Divya Murder Case At Vijayawada - Sakshi

సాక్షి, విశాఖటపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించిన దివ్య హత్య కేసులో మరికొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. హత్య కేసును విచారిస్తున్న సమయంలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతవారం అరెస్ట్ చేసిన‌ నిందితులలో దివ్య పిన్ని కాంతవేణితో పాటు మరికొందరిని పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు‌ కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో విస్మయకర విషయాలు బయటపడ్డాయి. రెండేళ్ల క్రితం దివ్య అమ్మమ్మ, తల్లి, సోదరుడు అనుమానస్పదంగా మృతి చెందారు. ఇందులో అమ్మమ్మ మృతదేహం మాత్రమే గోదావరిలో శవమై కనిపించగా మిగిలిన ఇద్దరివీ ఇప్పటికీ ఆచూకి లభించలేదు. ఆ సమయంలో అనాథగా మారిన దివ్యను సొంత పిన్ని కాంతవేణి చేరదీసింది. అప్పడికే వ్యభిచార వృత్తిలో ఉన్న పిన్ని కాంతవేణి దివ్య ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని భావించింది. ఇందులో భాగంగా దివ్యను బలవంతంగా ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అక్కడితో ఆగకుండా తనకి పరిచయమున్న వ్యభిచార నిర్వహకురాలు గీతకి దివ్యను లక్ష రూపాయిలకి ఆమె పిన్ని‌ కాంతవేణి అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (దివ్య చుట్టూ రక్కసి మూక!)

కాంతవేణి సహజీవనం చేస్తున్న కృష్ణ బ్యాంకు అకౌంట్ లోకి గత ఏడాది సుమారు లక్ష రూపాయిలు గీత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ కావడాన్ని పోలీసులు గుర్తించి ఆరా తీయగా దివ్యను గీతకి అమ్మేసిన వైనం బట్టబయలైంది. దివ్యను కొనుక్కున్న గీత కొన్ని రోజుల పాటు తన వద్దే ఆశ్రయం ఇచ్చి దివ్యను విటుల వద్దకి పంపి డబ్బులు సంపాదించేది. ఆ తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో దివ్యను తాత్కాలింగా మరో వ్యభిచార నిర్వహకురాలు వసంత వద్దకి గీత పంపింది. ఇక అప్పటి నుంచి దివ్య వసంత ఇంటి వద్దే ఉంటూ వసంత చెప్పినట్లుగా వ్యభిచారాన్ని నిర్వహించేది. దివ్య ద్వారా ఆదాయం బాగానే వస్తుండటంతో దివ్యను తన దగ్గరే ఉంచుకోవాలని వసంత భావించింది. ఇందులో భాగంగా మధ్యలో ఒకసారి గీత దివ్యను వెనక్కి పంపేయాలని వసంతపై ఒత్తిడి తీసుకురాగా తన దగ్గర నుంచి వెళ్లిపోయిందని‌ అబద్దం చెప్పింది. గీత ఒత్తిడి తగ్గడంతో వసంత దివ్య ద్వారా బాగా డబ్బులు సంపాదించడం ప్రారంభించింది‌. దివ్య ద్వారా రోజుకి వేలాది రూపాయిలు వస్తుండటంతో వసంత దివ్యను బంగారుబాతులా భావించింది. (దివ్య హత్య కేసులో కొత్త కోణాలు)

దివ్య సొంతపిన్ని కాంతవేణి చాలా పకడ్బందీగా దివ్యను వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. నేరుగా వ్యభిచారంలోకి దింపితే తనకి‌ ఇబ్బంధి అవుతుందని భావించి తాను సహజీవనం చేస్తున్న కృష్ణ దగ్గర బందువు వీరబాబుతో 2018 లోనే పెళ్లి జరిపించింది. భర్త వీరబాబు, కృష్ణల సాయంతో పిన్ని కాంతవేణి దివ్యపై ఒత్తిడి తీసుకువచ్చి వ్యభిచారంలోకి దింపినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ సమయంలోనే భర్త వీరబాబు ఆమె పూర్తిగా వ్యభిచారంలోకి దిగేలా పిన్ని‌ కాంతవేణికి సహకరించినట్లు గుర్తించారు. ఇక ఆ తర్వాతే దివ్యను గీతకి అమ్మేసినట్లు తెలుస్తొంది. ఈ మొత్తం ఆధారాలను సేకరించిన విశాఖ పోలీసులు కాంతవేణితో సహజీవనం చేసిన కృష్ణ, దివ్య భర్త వీరబాబులను సైతం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. 

దివ్యతో గత కొన్ని రోజులగా ఆర్ధిక పరమైన వివాదాలే హత్యకి కారణాలగా పోలీసులు గుర్తించారు. దివ్యపై వసంత అత్యంత క్రూరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. రోజూ విటుల వద్దకి బలవంతంగా పంపడం వేలాది రూపాయిలు వస్తున్నా దివ్యకి రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఆఖరికి దివ్య వద్ద ఫోన్ కూడా ఉండకుండా చేయడంతో గత కొద్ది రోజులుగా దివ్యకి, వసంతకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వసంత దగ్గర నుంచి దివ్య బయటకి వెళ్లిపోవాలని భావించింది. దీంతో తన దగ్గర నుంచి దివ్య వెళ్లిపోతే వేలాది రూపాయిల ఆదాయం పోతుందని వసంత భావించి ఆమెను అందవి హీనంగా చేయాలని మొదట భావించింది. ముందుగా దివ్య కాళ్లూ చేతులు కట్టి గదిలో బంధించి గుండు కొట్టించి, కనుబొమ్ముల సైతం పూర్తిగా కత్తిరించి అందవిహీనంగా తయారు చేసింది. అప్పటికీ కక్ష తీరక క్రూరాతి క్రూరంగా పెద్ద అట్ల కాడను బాగా కాల్చి శరీరంలోని‌ ప్రతీ భాగంపై వాతలు పెట్టింది.

నాలుగైదు రోజులపాటు భోజనం కూడాపెట్టకుండా... రోజూ వాతలు పెట్టడంతో దివ్య శరీరం కుళ్లిపోయింది. ఆకలికి తట్టుకోలేక... రోజూ పెడుతున్న వాతలు తట్టుకోలేక దివ్య ఎంత ప్రాధేయపడ్డా వసంత కరగలేదు. నాలుగైదు రోజుల పాడు ఇదే విధంగా దివ్యను క్రూరంగా హింసించడంతో ఆమె చనిపోయింది. దివ్య హత్యను సైతం కప్పిపుచ్చడానికి వసంత ప్రయత్నించింది. దహన సంస్కారాలకి ఉపయోగించే వాహనంలో దివ్య మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించాలని వసంత ప్రయత్నాలు బెడిసికొట్టి చివరికి పోలీసులకి పట్టించింది. దివ్య మృతదేహంపై గాయాలను వ్యాన్ డ్రైవర్ గుర్తించకపోయినట్లైతే వసంత గ్యాంగ్ తప్పించుకునేవారు. చివరి నిమిషంలో దివ్య శరీరంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేసిన డ్రైవర్ వెనక్కి వెళ్లిపోయి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో దివ్య హత్య ఉదంతం పూర్తిగా బయటపడింది. దివ్య హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది‌ మందిని‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top