దేశాన్ని పాలించే శక్తి, యుక్తి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకే ఉన్నాయని విశ్వసిస్తూ, ఆయన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని బీజేపీ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ లోక భూపతి రెడ్డి అన్నారు.
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్: దేశాన్ని పాలించే శక్తి, యుక్తి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకే ఉన్నాయని విశ్వసిస్తూ, ఆయన పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని బీజేపీ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ లోక భూపతి రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చుతూ మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారని అన్నారు.
రాబోయే సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు ఫైనల్‌గా భావిస్తున్నట్లు, ఈ ఎన్నికల్లో మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభ కోణాలతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం సడలిందన్నారు. సామాన్యుడి బతుకును దుర్భరం చేసిన కాంగ్రెస్‌ను ప్రజలు విశ్వసించడం లేదని, మార్పు కోరుకుంటున్నారని అన్నారు. 2014 ఎన్నికలు దేశ, బీజేపీ భవిష్యత్తును తీర్చిదిద్దేవని అభివర్ణించారు.
దిగ్విజయ్ ప్రకటనపై అనుమానం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ అదేశాల మేరకు వ్యవహరిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోందని భూపతి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి విరుద్ధంగా మాట్లాడుతున్నారని, దీంతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు, విభజన బిల్లు ఆమోదం పొందాలన్నారు. అంతకు ముందు పార్టీ తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్‌గా నూతనంగా నియమితులైన భూపతి రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో సత్కరించారు. మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా భూపతిరెడ్డి పేర్కొన్నారు.