
బియ్యం.. మాయం!
పేదల కడుపు నింపాల్సిన బియ్యాన్ని పెద్దలు స్వాహా చేస్తున్నారు. చౌకగా వచ్చే సరకును తేరగా మింగేస్తున్నారు. అధికారుల సహకారంతో అవలీలగా దారి మళ్లిస్తున్నారు.
=లోడ్లకు లోడ్లు పక్కదారి
=చక్రం తిప్పుతున్న డీటీలు
=లక్షల్లో వసూళ్లు
=పౌర సరఫరా నుంచి రెవెన్యూ వరకు అందరికీ వాటాలు
=పైపై తనిఖీలతోనే సరి
=అరకొరగానే రికవరీలు
పేదల కడుపు నింపాల్సిన బియ్యాన్ని పెద్దలు స్వాహా చేస్తున్నారు. చౌకగా వచ్చే సరకును తేరగా మింగేస్తున్నారు. అధికారుల సహకారంతో అవలీలగా దారి మళ్లిస్తున్నారు. ప్రభుత్వ పథకాల సంరక్షకులుగా బాధ్యతతో వ్యవహరించాల్సిన ఉద్యోగులు అక్రమాలకు యథాశక్తి సాయం చేస్తున్నారు. దండిగా దండుకుంటున్నారు. లక్షల్లో వస్తున్న అక్రమార్జనను వాటాలు వేసి మరీ పకడ్బందీగా పంపిణీ చేస్తున్నారు. దాంతో పేదల బియ్యం పక్కాగా పెద్దవారి ఖజానాలో కాసుల రాసులుగా రూపాంతరం చెందుతోంది. పైపై తనిఖీల పుణ్యమాని ఈ వ్యవహారం నిరాఘాటంగా కొనసాగుతోంది.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: పేదల బియ్యానికి రెక్కలొస్తున్నాయి. మండల స్థాయి నిల్వ కేంద్రాల నుంచి లోడ్లకు లోడ్లు మాయమైపోతున్నాయి. పెద్దల గోదాముల్లోకి చేరుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. పౌర సరఫరా శాఖ అధికారుల మామూళ్ల వ్యవహారం ఫలితంగా చౌక బియ్యం రాశులు గోదాముల్లోకి చేరకుం డానే రాష్ట్రాలు దాటిపోతున్నాయి. చాలా మంది ఉద్యోగులు, అధికారుల సహకారంతో వ్యాపారం, రవాణా సాఫీగా సాగిపోతున్నాయి. జిల్లాలో చౌక సరకుల పంపిణీలో కొంత మంది డిప్యూటీ తహశీల్దార్లు చక్రం తిప్పుతున్నారు. రేషన్ దుకాణాల నుంచి స్టాకు పాయింట్ల వరకు ప్రతీ చోటా దండుకుంటున్నారు. పౌర సరఫరా శాఖ అధికారుల నుంచి రెవెన్యూ ఉన్నతాధికారుల వరకు ప్రతీ ఒక్కరికీ ఎవరి వాటాలు వారికి పంపిణీ చేస్తూ తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు.
జిల్లాలో ఉన్న 11.36 లక్షల తెల్లరేషన్ కార్డులకు బియ్యం సరఫరా చేసేందుకు వీలుగా 30 మండల స్థాయి నిల్వ కేంద్రాలు (ఎంఎల్‌ఎస్ పాయింట్లు) ఉన్నాయి. వీటిలో 9 జీసీసీ పాయింట్లు ఏజెన్సీలో ఉన్నాయి. ప్రభుత్వం కేటాయించే బియ్యం ముందుగా ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరుకుంటుంది. అక్కడ నుంచి కార్డుల సంఖ్య ప్రకారం స్టేజ్-1లో ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలిస్తారు. ఆ గోదాముల నుంచి స్టేజ్-2లో చౌక దుకాణాలను సరఫరా చేస్తారు.
పైపైనే తనిఖీలు : సాధారణంగా రేషన్ డీలర్లు కొద్ది మొత్తంలో తరలించే బియ్యాన్ని పట్టుకొని హడావుడి చేసే పౌర సరఫరా అధికారులు.. గోదాముల నుంచి లోడ్లకు లోడ్లు మాయమైపోతున్నా స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రతీ నెలా ఎంఎల్‌ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ఆమధ్య మర్రిపాలెం ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరాల్సిన లారీ లోడ్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.
ఇలా ఎఫ్‌సీఐ నుంచి పౌర సరఫరా గోదాములకు రాకుండానే బియ్యం తరలిస్తున్న వ్యవహారం బయటపడడంతో అధికారులు హడావుడి చేశారు. ఇద్దరు సిబ్బందిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. ఈ తరలింపు వెనుక అసలు వ్యక్తుల కోసం దర్యాప్తు జరుగుతూనే ఉంది. నిజానికి స్టాక్ పాయింట్‌కు చేరాల్సిన బియ్యాన్ని పైవారి ప్రమేయం లేకుండానే తరలించే అవకాశం ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. గత నెలలో సుమారుగా 1,637 కిలోల వరకు నిల్వల్లో తేడా ఉన్నట్టు అధికారులు లెక్కలు రాసుకున్నారు. రికవరీలు చేస్తున్నట్లు రికార్డులు చూపిస్తున్నారు.
అందరికీ వాటా : నిత్యావసర సరకుల సరఫరా ద్వారా జిల్లా పౌర సరఫరాల శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారుల పంట పండుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంత మంది డిప్యూటీ తహశీల్దార్లు ప్రతీ నెలా లక్షలకు లక్షలు వెనకేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చౌక దుకాణాల ద్వారా సరకులు సక్రమంగా సరఫరా అవుతున్నాయో లేదో ఎవరూ పట్టించుకోవడం లేదు. గోదాముల నుంచి మండలాల పరిధిలోని రేషన్ షాపులకు సరకులు సరఫరాపై దృష్టి సారించాల్సిన డిటీలు ఆ సరకులు గోదాములకు చేరుకుండానే తరలించే పనిలో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ డీలర్ల నుంచి స్టాకు పాయింట్లలో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు ప్రతీ ఒక్కరి నుంచి మామూళ్లు వసూలు చేస్తూ వాటిని ఉన్నతాధికారులకు పంపిణీ చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం.