కన్నపేగును కాదని.. ఉద్యమమే ఊపిరిగా..

Parents leave Their Children And Joined Maoist - Sakshi

సాక్షి, సీలేరు (విశాఖపట్టణం) : కన్నపేగు బంధం విడదీయరానిది. కాలే కట్టె వరకు ఆ బంధం ఎంతో గొప్పది. కడుపున పుట్టిన బిడ్డకు తన రొమ్మునుంచి ప్రతీ పాలచుక్కును ఇచ్చి, పెరిగి పెద్దయ్యే వరకూ కంటికి రెప్పలా చూసుకుంటుంది. చిన్న గాయం తగిలినా ఆమె ప్రాణం విలవిలాడుతుంది. తన బిడ్డే సర్వస్వం అనుకునే ఎందరో మాతృమూర్తులను చూశాం. కానీ ఆ తల్లి పది నెలల బిడ్డ ఆలన పాలనా తమ బంధువులకు అప్పజెప్పి ఉద్యమమే ఊపిరిగా మావోయిస్టుల్లో చేరింది. తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో, అసలు వస్తారో..రారో, ప్రాణాలతో వస్తారో రారో కూడా ఆ బిడ్డకు తెలియదు. ఇలాంటి తరుణంలో 30 ఏళ్ల తరువాత పేగుబంధం ఒకటి చేసింది. తన తల్లి ఉందని తెలుసుకొని ఒక కంట దుఖం, ఒక కంట ఆనందంతో తన తల్లిని చూసేందుకు పరుగులు తీసిన బిడ్డ. ఇందుకు సంబంధించిన వివరాలిలావున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కైలాసం, కళావతి దంపతులు. వీరికి ఒక కుమారుడు.

అతడికి పది నెలల వయసులోనే తల్లిదండ్రులు మావోయిస్టుల దళంలోకి చేరారు. 2005లో ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తండ్రి కైలాసం మృతి చెందాడు. తల్లి ప్రస్తుతం ఇదే ఏవోబీలో పెదబయలు ఏరియా కార్యదర్శిగా కళావతి అలియాస్‌ భవానీ ఉంటోంది. ఇటీవల విశాఖ ఏజెన్సీ మాదిగమల్లు అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనలో భవాని గాయాలతో తప్పించుకొని చెరుకుమళ్లు గ్రామంలో మృత్యువుతో పోరాడుతూ పోలీసు బలగాలకు పట్టుబడింది. ఆమెను వారు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పత్రికల్లో రావడంతో..
ఆమెది అనంతపురం జిల్లా పేరు కళావతి, భర్తపేరు కైలాసం అని  పత్రికల్లో రావడంతో వరుసకు కైలాసానికి  అన్నయ్య అయిన నాగేశ్వరరావు, భవాని అన్నయ్య నరేష్‌ గుర్తించారు.  ఈ విషయాన్ని నాగేశ్వరరావు, నరేష్‌లు తమ వద్ద పెరుగుతూ ప్రస్తుతం అనంతపురం స్టేట్‌ బ్యాంక్‌లో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్న కళావతి కుమారుడికి చెప్పారు. దీంతో తన తల్లి ఉందని ఒక పక్క ఆనందం, మరో వైపు దుఖంతో పరుగు పరుగున రాజమండ్రిలో చికిత్స పొందుతున్న తన తల్లిని చూసేందుకు 12 మంది కుటుంబ సభ్యులతో వచ్చాడు. ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు వి.చిట్టిబాబును కలిశారు. అతని ఆధ్వర్యంలో తన తల్లిని కలిసేందుకు ఆదివారం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లినట్లు చిట్టిబాబు సాక్షికి తెలిపారు. 

తల్లి, బిడ్డ చూసుకోవడం ఇదే మొదటిసారి
మావోయిస్టు అగ్రనేత కైలాసం, భార్య కళావతి (భవాని). వీరిద్దరు  కుమారుడిని పది నెలల వయసులో వదిలి ఉద్యమంలోకి వచ్చారు. అప్పటి నుంచి విశాఖ ఏజెన్సీ ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోనే మావోయిస్టు పార్టీలో తుపాకీ చేతపట్టి అడవుల్లోనే తిరిగారు. ఒక్కసారి కూడా సొంత గ్రామానికి వెళ్లింది లేదు. తమ బిడ్డను చూసుకునేందుకు వారికి వీలు కుదరలేదు. ఈ తరుణంలో ఎన్‌కౌంటర్‌ జరగడం, ఆమె గాయాలతో తప్పించుకోవడంతో ఆ కుమారుడికి కన్నతల్లిని చూసుకొనే అవకాశం దక్కింది. ఒక్కసారిగా తన తల్లిని కలిసి గుండెకు హత్తుకొని బోరున విలపించి ఆనందం చెందాడు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top