పారా మెడికల్ విద్యార్థుల అవస్థలు | Para Medical Students stranding | Sakshi
Sakshi News home page

పారా మెడికల్ విద్యార్థుల అవస్థలు

Sep 22 2013 4:52 AM | Updated on Sep 1 2017 10:55 PM

ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సుల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు చుక్కెదురైంది.

 ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సుల్లో ఆన్‌లైన్ ప్రవేశాలకు చుక్కెదురైంది. ఎంసెట్ ద్వారా వైద్యవిద్య కోర్సులు చేయలేని విద్యార్థులు పారామెడికల్ కోర్సులను ఆశ్రయిస్తే ఈ విద్యా సంవత్సరం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ వంటి పారామెడికల్ కోర్సులకు ఇంటర్మీడియెట్ విద్య కనీస విద్యార్హతగా ప్రభుత్వం ఈ ఏడాది నిర్ణయించింది. దీంతో పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో ఈ కోర్సుల్లో ప్రవేశాలను నిలిపేశారు. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.
 
ప్రభుత్వ నిర్ణయంపై  కోర్టు స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులను ఎప్పటిలానే పదో తరగతి విద్యార్హతతోనే ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకున్నారు. సుమారు 300 మంది విద్యార్థులు వాటిలో చేరారు. జిల్లాలో  ఓకేషనల్ జూనియర్ కళాశాలలు 18 ఉండగా వాటిలో ఒకటే ప్రభుత్వ కళాశాల. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండబోదని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నమ్మబలికి విద్యార్థులను చేర్చుకున్నాయి. ఇంటర్ బోర్డు అనుమతి లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలు నిలిపివేశారు.  ప్రైవేటు కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. విద్యార్థులు మూడు నెలలుగా తరగతులకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకేషనల్ ప్రైవేటు యాజమాన్యాలు ఇంటర్ బోర్డుపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేశాయి.
 
 అయితే జూనియర్ కళాశాలల్లో పారామెడికల్ కోర్సులకు అనుమతి లేదంటూ బోర్డు తేల్చి చెప్పింది. అంతేకాదు ఇప్పటికే విద్యార్థులను చేర్చుకున్న కళాశాలలు వారిని ఇతర కోర్సుల్లోకి మార్చాలని ఆదేశించింది. జూలై నుంచి పారా మెడికల్ తరగతులు వింటున్న విద్యార్థులను ఇతర కోర్సుల్లో చేరమనడంతో వారు కంగుతింటున్నారు. మూడు నెలలు ఒక కోర్సును అభ్యసించి ఇప్పుడు మరో కోర్సులో చేరాలంటే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా కొత్త కోర్సులో విద్యా సంవత్సరం మూడు నెలలు నష్ట పోవాల్సి వచ్చిందని విద్యార్థులు వాపోతున్నారు.  
 
 ఇదిలా ఉండగా 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ప్రతి ఒక్క విద్యార్థి ఫొటో, సంతకం, ఇతర వివరాలన్నీ ఆన్‌లైన్‌లో పొందుపరచాలి. అలా నమోదు చేసిన విద్యార్థికే ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహిస్తారు. ఈనెల 13వ తేదీతో ఆన్‌లైన్‌లో నమోదు గడువు ముగిసింది. రూ. 400ల అపరాధ రుసుముతో ఈ నెల 21వ వరకూ అంటే శనివారం వరకూ ఇచ్చిన గడువు కూడా పూర్తయింది. దీంతో ఇతర కోర్సుల్లో చేరే అవకాశాన్ని కూడా విద్యార్థులు కోల్పోయారు. కొన్ని కళాశాలల వారు ఆర్‌ఐఓ కార్యాలయం బాట పట్టారు. మరి కొందరు ఇంటర్మీడియెట్ బోర్డు తమకు అనుకూలంగా వ్యవహరించి ఈ సంవత్సరానికి అనుమతులు మంజూరు చేస్తుందని విద్యార్థులకు నమ్మబలుకుతున్నారు. మొత్తం మీద వృత్తి విద్యను అభ్యసిస్తే తమ కాళ్ల మీద తాము బతకవచ్చు అనే ఉద్దేశంతో ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు మోసపోయారు. అటు ఇంటర్మీడియెట్ కోర్సుల్లో చేరలేక, అదే విధంగా ఒకేషనల్ కోర్సుల్లోనూ చేరలేక విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement