విభజనకు మా పార్టీ వ్యతిరేకం: కేంద్రానికి జగన్ లేఖ | Sakshi
Sakshi News home page

విభజనకు మా పార్టీ వ్యతిరేకం: కేంద్రానికి జగన్ లేఖ

Published Sun, Nov 3 2013 3:47 PM

విభజనకు మా పార్టీ వ్యతిరేకం: కేంద్రానికి జగన్ లేఖ - Sakshi

హైదరాబాద్: రాష్ట్ర విభజనకు తమ పార్టీ వ్యతిరేకం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. పార్టీ నేతలు మైసూరా రెడ్డి, కొణతాల రామకృష్ణ ఆ లేఖను ఈరోజు పత్రికలకు విడుదల చేశారు. ఏ రకమైన విభజనకైనా తమ పార్టీ వ్యతిరేకమని, సమైక్య ఆంధ్రకే తాము కట్టుబడి ఉన్నామని ఆ లేఖలో జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని విభజించాలని అక్టోబరు 3న కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని తాము అంగీకరించం అని తెలిపారు. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 75 శాతం మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి మూడు నెలల నుంచి ఉద్యమం చేస్తున్నట్లు వివరించారు.  కాంగ్రెస్ పార్టీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ వాస్తవాలను పట్టించుకోకుండా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు.  

రాష్ట్రాన్ని విభజించడానికే మంత్రుల బృందం(జిఓఎం)ను ఏర్పాటు చేశారని, అందువల్ల జిఓఎంను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జగన్ ఆ లేఖలో తెలిపారు. అత్యధిక మంది ప్రజల అభీష్టంమేరకు రాష్ట్రం విభజించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

Advertisement
Advertisement