జిల్లాపై బాబు కక్ష సాధింపు | On District Babu vengeance | Sakshi
Sakshi News home page

జిల్లాపై బాబు కక్ష సాధింపు

Aug 21 2015 4:37 AM | Updated on Sep 17 2018 4:56 PM

జిల్లాపై బాబు కక్ష సాధింపు - Sakshi

జిల్లాపై బాబు కక్ష సాధింపు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పట్ల రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ధ్వజమెత్తారు...

- స్టీల్ ప్లాంటు కడపలోనే ఏర్పాటు చేయాలి
- ‘సీమ’కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
- సంతకాల సేకరణలో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
కడప సెవెన్‌రోడ్స్:
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పట్ల రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరిస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ధ్వజమెత్తారు. వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన సంతకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం 12 జాతీయ స్థాయి సంస్థలను మంజూరు చేసిందని పేర్కొన్నారు. జిల్లాకు ఒక జాతీయ సంస్థను కేటాయించి సమన్యాయం పాటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సంస్థలన్నింటినీ ఇప్పటికే అభివృద్ధి చెందిన జిల్లాల్లో ఏర్పాటు చేయడం అన్యాయమని మండిపడ్డారు. కడపకు ఒక్క జాతీయ స్థాయి సంస్థను కూడా కేటాయించకపోవడం దారుణమని విమర్శించారు.

రాష్ట్ర విభజన చట్ట ప్రకారం జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయవలసి ఉందని చెప్పారు. అయితే, దీన్ని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. కడపలోనే స్టీల్‌ప్లాంట్ సెయిల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  ‘సీమ’కు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కేటాయించాలని కోరారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్‌కు రూ. లక్షా 25 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం అధికారు దుర్వినియోగానికి పరాకాష్ట అని విమర్శించారు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యమ వేదిక జిల్లా కన్వీనర్ ఎ.రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement