జగన్‌ దిగే హెలిపాడ్‌ వద్ద క్షుద్రపూజలు

Officials confused to give Permission of YS Jagan helicopter landing - Sakshi

హెలిపాడ్‌ వద్ద పసుపు, నిమ్మకాయలు, టెంకాయలు 

పోలీసులకు సమాచారమిచ్చిన పలమనేరు పార్టీ కన్వీనర్‌

గంగవరం(చిత్తూరు జిల్లా): ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా పలమనేరులో పర్యటించనున్నారు. దీనికోసం గంగవరం మండలంలోని మన్నార్‌నాయుని పల్లి సమీపంలో హెలిపాడ్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈ హెలిపాడ్‌ వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు జరిపిన విషయం సోమవారం వెలుగుచూసింది. పనులు పర్యవేక్షించేందుకు అక్కడకు వెళ్లిన పార్టీ పట్టణ కన్వీనర్‌ మండీ సుధా దీన్ని గమనించి స్థానిక సీఐ, ఎస్‌ఐలకు చూపించి దీనిపై విచారణ జరపాలని కోరారు.

ఆ తర్వాత అక్కడికి వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సైతం ఈ విషయాన్ని తెలిపారు. ఇలా ఉండగా దీనికి విరుగుడుగా నేడు పరిహారపూజలు జరిపించనున్నట్లు పట్టణ కన్వీనర్‌ మండీసుధా తెలిపారు. హెలిపాడ్‌ నుంచి వైఎస్‌ జగన్‌ వచ్చే మార్గంలో పసుపు, కుంకుమ చల్లి, కొబ్బరికాయ కొట్టి, నలు వైపులా నిమ్మకాయలు విసిరేశారు. హెలిపాడ్‌ వద్ద సామాన్యులు ఇటువంటి పనులు ఎందుకు చేస్తారని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

జగన్‌ హెలికాప్టర్‌ లాండింగ్‌పై అధికారుల దోబూచులాట 
కొల్లూరు(వేమూరు): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా వేమూరులో మంగళవారం జరిగే ఎన్నికల బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో  ఆయన ప్రయాణించే హెలికాప్టర్‌ లాండింగ్‌కు అనుమతినిచ్చే విషయంలో అధికారులు తర్జనభర్జనలు పడ్డారు. తొలుత కొల్లూరు మండలంలోని దోనేపూడి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెలీపాడ్‌ ఏర్పాటుకు అనుమతించిన పోలీసులు తర్వాత అక్కడ కుదరదని చెప్పారు. అయితే అప్పటికే గతంలో సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హెలీపాడ్‌ను వైఎస్సార్‌సీపీ శ్రేణులు మూడొంతులుకు పైగా సిద్ధం చేశాయి. పోలీసులు లా అండ్‌ ఆర్డర్‌ సమస్యను సాకుగా చూపి వేమూరులో హెలీపాడ్‌ ఏర్పాటు చేయాలని చెప్పడంతో వేమూరు సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద పనులు చేపట్టారు.
వేమూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హెలిపాడ్‌ స్థలం విషయంలో మేరుగ నాగార్జున, పోలీసుల మధ్య వాగ్వాదం    

తిరిగి సోమవారం రాత్రి పోలీసులు దోనేపూడిలో ఏర్పాటుకు అనుమతించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు తిరిగి అక్కడ హెలిపాడ్‌ను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అవాంతరాలు కల్పించడం వెనుక టీడీపీ నాయకుల హస్తం ఉందని వైఎస్సార్‌సీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దోనేపూడి నుంచి కొల్లూరు మీదుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణించడం ద్వారా వేమూరుతో కలుపుకుని మూడు పెద్ద గ్రామాలు పర్యటనలో కవర్‌ అవుతుండటంతో గ్రామాల పర్యటన లేకుండా చేసేందుకు టీడీపీ పెద్దలు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారన్న భావన వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top