కలుషిత జలంతో వ్యాధులు సోకుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు మొరాయిస్తున్నాయి.
	 ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి గ్రహణం
	  స్వచ్ఛమైన నీళ్లిస్తానన్న బాబు హామీకి తూట్లు
	  427 పంచాయతీలకు బదులు 11 చోట్లే ప్లాంట్లు
	  మొరాయిస్తున్న పథకాలతో అరకొరగా నీళ్లు
	 
	 కలుషిత జలంతో వ్యాధులు సోకుతున్నాయి. రక్షిత మంచినీటి పథకాలు మొరాయిస్తున్నాయి. బోర్లతో నీళ్లు అడుగంటిపోతున్నాయి. అలాంటి తరుణంలో రెండ్రూపాయలకే 20 లీటర్ల స్వచ్ఛమైన నీళ్లిస్తానని చంద్రబాబు చెబితే ఓటర్లు మురిసిపోయారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభిస్తే నీటి కష్టాలుండవని సంబరపడ్డారు. గ్రామగ్రామాన ఏర్పాటు చేస్తానన్న హామీ అటకెక్కిపోయింది. కేవలం 11 ప్లాంట్లు పారంభమయ్యాయి. వాటిలో కొన్ని మొరాయిస్తున్నాయి. మిగిలినవి అరకొరగా మాత్రమే
	 నీళ్లిస్తున్నాయి.
	 
	 విజయనగరం క్రైం: ఆంధ్రప్రదేశ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం రోజున రాష్ట్ర ప్రజలందరికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా అన్నీ గ్రామాలకు మంచినీరందించే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఆయన అధికారానికి వచ్చి ఏడాది దాటినా పథకం నత్తనడకన సాగుతోంది. ఎన్టీఆర్ పేరును ప్రతి ఎన్నికల ప్రచారంలో వాడుకుని ఆయన పేరుతో ప్రారంభించిన పథకంపై నిర్లక్ష్యంగా వ్యహరించడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
	 
	 నియోజకవర్గానికి ఒకటే..
	 జిల్లా వ్యాప్తంగా 921 పంచాయతీల్లో మొదటి విడతగా 427 గ్రామాల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పారిశ్రామికవేత్తల సాయంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా కలెక్టర్ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి పథకం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 82 ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు కొందరు ముందుకొచ్చారు. నిర్వహణ బాధ్యతలు కష్టం కావడంతో జిల్లావ్యాప్తంగా 11 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటిలో సక్రమంగా నీళ్లిచ్చే పథకాలను వేళ్లపై లెక్కబెట్టవచ్చు.
	 
	 అరకొరగానే పంపిణీ
	 విజయనగరం కేంద్రంలో నాగోజిపేట, కోరుకొండ, శృంగవరపుకోట నియోజకవర్గంలోని చింతలబడిలో, నెల్లిమర్ల స్టేట్‌బ్యాంకు పక్కన, బొబ్బిలి మున్సిపాలిటీలో, సాలూరు, పాచిపెంట, చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం, గర్భాం, పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం, కృష్ణపల్లిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాలను ఏర్పాటు చేశారు. గజపతినగరం నియోజకవర్గంలో ఎం.గుమడాం, కురుపాం నియోజకవర్గంలో ఇంతవరకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించలేదు. ప్రారంభమైన ప్లాంట్లు అరకొరగానే మంచినీరందిస్తున్నాయి. పథకం పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. రోజూ సుమారు 20 నుంచి 30 మంది వరకు మాత్రమే మంచినీళ్లిస్తున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.
	 
	 మొరాయిస్తున్న పథకాలు
	 పార్వతీపురం పట్టణంలోని జగన్నాథపురం ప్లాంటు పనిచేయడం లేదు. బొబ్బిలిలో ఏర్పాటు చేసిన ప్లాంటు మొరాయిస్తోంది. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి తప్పనిసరిగా బోర్‌బావి తవ్వించి మోటారును ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ నేలబావి నుంచి కనెక్షన్ ఇవ్వడంతో పూర్తిస్థాయిలో నీళ్లందించలేకపోతున్నారు. శృంగవరపుకోటలోని చింతలబడిలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మూలకు చేరింది. జిల్లా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలం గర్భాంలో ఏర్పాటు చేసిన ప్లాంటు కూడా సక్రమంగా నీళ్లివ్వడం లేదు.
	 
	 జిల్లా వ్యాప్తంగా అమలెప్పుడు?
	 జిల్లాలో 921 పంచాయతీల్లో పూర్తిస్థాయిలో నీటి సరఫరా అవుతున్న గ్రామాలు 1090 ఉన్నాయి. వీటిలో 78 సురక్షిత తాగునీటి వనరుల్లేనివి, 8 తాగునీటి వనరుల్లేని గ్రామాలను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 15,918 గొట్టపు బావులుండగా, 1121 రక్షిత నీటి సరఫరా పథకాలు, 21 సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాలున్నాయి. గొట్టపు బావులకు ఎక్కువగా మరమ్మతులు రావడంతో ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ ఏడాది గ్రామీణ ప్రాంత ప్రజల కంటే పట్టణ ప్రాంత ప్రజలు మంచినీటి సమస్యను ఎదుర్కొన్నారు. రోజు తప్పించి రోజు మంచినీరు రావడమే దీనికి కారణం. తాగునీటి వనరుల్లేని గ్రామాల్లో ట్యాంకుల ద్వారా సరఫరాకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఏర్పాట్లు చేశారు. మంచినీటి పథకాలు, గొట్టపు బావులు మరమ్మతులకు గురైనప్పుడు మంచినీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. జిల్లాలోని అన్నీ పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని అమలు చేస్తామన్న అధికారుల హామీ కార్యరూపం దాల్చలేదు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
