రైజింగ్‌డే విషాదం | NTPC on Thursday, three contract workers were killed in the accident. | Sakshi
Sakshi News home page

రైజింగ్‌డే విషాదం

Nov 8 2013 3:10 AM | Updated on Sep 2 2017 12:23 AM

ఎన్టీపీసీ గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం చెందారు. 500 మెగావాట్ల నాల్గో యూనిట్‌లోని కోల్ బంకర్ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస...

గోదావరిఖని/జ్యోతినగర్, న్యూస్‌లైన్ : ఎన్టీపీసీ గురువారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం చెందారు. 500 మెగావాట్ల నాల్గో యూనిట్‌లోని కోల్ బంకర్ వద్ద విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస ఇంజినీరింగ్ వర్క్‌లో పనిచేసే సూపర్‌వైజర్ బొల్లం వెంకటరత్నం (45), హెల్పర్ దేవసహాయముని(33), టెక్నీషియన్ నూటెంకి సుదర్శన్(40) దుర్మరణం పాలయ్యారు. కోల్‌బంకర్ నుంచి బొగ్గును పౌడర్‌గా చేసి మండించేందుకు మిల్‌లోకి నిత్యం బొగ్గు పంపిస్తారు.

తడి బొగ్గు లేదా పెద్ద బొగ్గు ముక్కలు వచ్చినప్పుడు బంకర్‌లో జామ్ అవుతుంది. దీనిని ఎప్పటికప్పుడు ఫీడర్ వద్ద తొల గిస్తారు. గురువారం సాయంత్రం కూడా బంకర్‌లో జామ్ అయిన బొగ్గును తొల గిస్తుండగా బంకర్‌లో నిల్వ ఉన్న బొగ్గు, నీరు ఒకేసారి గాలి ఒత్తిడితో ముందుకు ప్రవహించింది. అక్కడే 18 మీటర్ల ఎత్తులో విధి నిర్వహణలో ఉన్న వెంకటరత్నం, ముని, సుదర్శ న్ గమనించారు. ఓ వైపు పడితే బొగ్గును పౌడర్‌గా మార్చే మిల్‌లో పడిపోతారు. అటువైపు దూకకుం డా ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో మరోవైపునకు దూకారు.

వీరిపై బొగ్గుబురద పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన చోటే పనిచేస్తున్న శాశ్వత ఉద్యో గి కేకే వెంకట్‌ను డీజీఎం థామస్ చేయి పట్టుకుని లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. క్షణాల్లో జరిగిన ప్రమాదంతో అంతా నివ్వెరపోయారు. మృతదేహాలను వెంటనే ఎన్టీపీసీ ఏరియా ఆస్పత్రి కి తరలించగా పెద్ద ఎత్తున ఉద్యోగ, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు అక్కడకు చేరుకున్నారు. ప్రమాదంతో 38వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాత్రి నిర్వహించాల్సిన పలు కార్యక్రమాలను యాజమాన్యం రద్దు చేసింది.
 
 మృతులంతా నిరుపేదలే...
 ప్రమాద మృతులంతా నిరుపేదలే. సుమారు పదేళ్లుగా ఎన్టీపీసీలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. కేసీఆర్ కాలనీకి చెందిన మునికి భార్య శశి, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అన్నపూర్ణకాలనీకి చెందిన బొల్లం వెంకటరత్నంకు భార్య ప్రమీలాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన నూటెంకి సుదర్శన్‌కు భార్య లక్ష్మి, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరిన మృతుల కుటుంబసభ్యులు, బంధువులు రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాంట్రాక్టు కార్మికుల మృతితో వివిధ లొకేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఆస్పత్రికి చేరుకుని యాజ మాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
 - ఎంపీ, ఎమ్మెల్యే
 
 ఎన్టీపీసీ ప్రమాదంలో మరణించిన వారికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఇచ్చిన విధంగా రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలని పెద్దపల్లి ఎంపీ జి.వివేక్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలకు ఉచిత విద్య అందించడంతోపాటు వారి సంక్షేమాన్ని బాధ్యతగా స్వీకరించాలన్నారు.
 
 పర్మినెంట్ కార్మికులతో పనిచేయించాల్సిన చోట కాంట్రాక్టు కార్మికులతో విధులు నిర్వహింపజేస్తుండడంపై విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎన్టీపీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు బాబర్ సలీంపాషా, ఉదయ్‌కుమార్, శంకరయ్య, కాంగ్రెస్ నాయకులు కౌశికహరి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గోపు అయిలయ్యయాదవ్, వివిధ యూనియన్ల నాయకులు ఉపేందర్, గడ్డం సత్యనారాయణ, మనోహర్‌రావు, ఏవీ రావు, గోపాల్‌రెడ్డి, శ్రీపతిరావు, రామాచారి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఎన్టీపీసీ జీఎం సుభాషిస్ ఘోష్, ఇతర ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. తహశీల్దార్ పద్మయ్య ఆధ్వర్యంలో శవ పంచనామా చేయగా, సీఐలు శ్రీధర్, నారాయణ, ఎల్.ప్రకాశ్, ఎస్సై శ్రీను బందోబస్తు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement