‘తూర్పు’ చేలల్లో ‘ఉత్తరాంధ్ర’ స్వేదం | North Andhra labours went for Godavari paddy works | Sakshi
Sakshi News home page

‘తూర్పు’ చేలల్లో ‘ఉత్తరాంధ్ర’ స్వేదం

Dec 14 2013 2:40 AM | Updated on Sep 2 2017 1:34 AM

డెల్టా వరి చేలలో ఇప్పుడు విలక్షణమైన ఉత్తరాంధ్ర పలుకుబడి ప్రతిధ్వనిస్తోంది. గోదావరి నీటితో పండిన పంట ఆ ప్రాంతపు శ్రమజీవుల చెమటతో సంచులకు ఎక్కుతోంది.

అమలాపురం, న్యూస్‌లైన్ :  డెల్టా వరి చేలలో ఇప్పుడు విలక్షణమైన ఉత్తరాంధ్ర పలుకుబడి ప్రతిధ్వనిస్తోంది. గోదావరి నీటితో పండిన పంట ఆ ప్రాంతపు శ్రమజీవుల చెమటతో సంచులకు ఎక్కుతోంది. ఖరీఫ్ వరికోతలు ముమ్మరమైన తరుణంలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి జిల్లాకు వలస కూలీలు వెల్లువలా వచ్చారు.

స్థానిక కూలీలతో పాటు వారందరికీ కూడా చేతి నిండా పని దొరుకుతోంది. తుపాను దెబ్బ నుంచి తేరుకున్న అనంతరం అటు తూర్పు, ఇటు మధ్యడెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), మెట్ట, ఏజెన్సీల్లో వరి కోతలు జోరందుకున్నాయి. పోగా మిగిలిన పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. తూర్పు డెల్టాలో ఆలమూరు, రామచంద్రపురం, అనపర్తి సబ్ డివిజన్ల పరిధిలో కోతలు దాదాపుగా పూర్తికాగా, మిగిలిన ప్రాంతాల్లో ఒకేసారి కోతలు ఆరంభమయ్యాయి.

 దీనితో కూలీలకు గిరాకీ ఏర్పడింది.  స్థానిక కూలీలు కూలి రేట్లను అనూహ్యంగా పెంచివేశారు. ఒకదశలో మగ, ఆడ జంటకు రోజుకు రూ.వెయ్యి చొప్పున  కూడా వసూలు చేశారు. అసలే ప్రకృతి కొట్టిన దెబ్బకు కుదేలైన రైతులు అంతంత కూలి ఇచ్చుకోలేక వలస కూలీలపై ఆధారపడడం మొదలు పెట్టారు. ఈ సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో పెద్దగా పనులు ఉండని కారణంగా అక్కడి నుంచి వచ్చే వలస కూలీలతో వరి కోతలు కోయిస్తున్నారు. వారికి మగ, ఆడ జంటకు రోజుకు రూ.700 చొప్పున ఇస్తున్నారు. ఈ రేటు కూడా ఆర్థికంగా భారమే అయినా స్థానిక కూలీల కన్నా తక్కువేనని రైతులు అంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి గ్రామానికి 25 నుంచి 50 మంది చొప్పున వలస కూలీలు వస్తున్నారు. కోనసీమలోని అన్ని మండలాలతోపాటు తూర్పుడెల్టా పరిధిలో తాళ్లరేవు, కాకినాడ రూరల్, కరప, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం మండలాల్లో వారి సందడి ఎక్కువగా ఉంది.

Advertisement

పోల్

Advertisement