
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)లో రోగులకు ఆక్సిజన్ కొరత లేదని, కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందన్నారు. 11.5 కేఎల్‌డీ కెపాసిటీతో పెద్ద ఆక్సిజన్ ట్యాంక్ ఏర్పాటు చేసి.. పైపు ద్వారా రోగులకు సరఫరా చేస్తున్నట్లు వివరించారు. దీంతో పాటు అదనంగా 10 కేఎల్‌డీ కెపాసిటీతో కొత్త ఆక్సిజన్ ట్యాంక్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. నాగపూర్‌లో ఉన్న డైరెక్టర్ జనరల్ (హై ఎక్స్‌ప్లోజివ్స్) నుంచి అనుమతి వచ్చిన వెంటనే దీన్ని ఉపయోగిస్తామని చెప్పారు. ప్రస్తుతం 450 పడకలకు సరిపడా ఆక్సిజన్ సరఫరా ఉందని, అదనంగా 1,131 పడకలకు సరఫరా కోసం చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్సలో ఉన్న కరోనా బాధితుల్లో రోజూ 120 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం అవుతోందన్నారు. ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ కథనాలను ప్రజలు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.