కళ్లు మూసుకుని ‘బిల్లులు’ పాస్‌

No new allocations from the current budget - Sakshi

ట్రెజరీ, పీఏవో, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులపై ఆర్థిక శాఖ కార్యదర్శుల అసహనం

సరిగ్గా పరిశీలించకుండానే బిల్లులు పంపిస్తారా?

తిరస్కరించిన రూ.8 వేల కోట్ల బిల్లులు మళ్లీ ఎందుకొచ్చాయి?

గత ఆర్థిక సంవత్సరం నుంచి బదిలీ అయిన రూ.15,000 కోట్ల బిల్లులు 

పెండింగ్‌ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఇవ్వాలి 

ఈ 4 నెలలకు కేటాయించిన బడ్జెట్‌ సరిపోతుందో లేదో పరిశీలించాలి 

కేటాయింపులు సరిపోని పక్షంలో అదనపు బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు పంపాలి 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి కొత్తగా ఎలాంటి కేటాయింపులు వద్దు

గతంలో రెగ్యులర్‌ బిల్లులను నిలిపివేసి, చంద్రబాబు సూచించిన రంగాలకే చెల్లింపులు చేసిన అధికారులు.. భారీగా పెండింగ్‌లోనే ఉండిపోయిన బిల్లులు

సాక్షి, అమరావతి: సాక్షాత్తూ శాసనసభ ఆమోదించిన గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు ఏమాత్రం విశ్వసనీయత లేకుండా చేసిన చంద్రబాబు నాయుడి ప్రభుత్వం.. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు అసెంబ్లీ ఆమోదించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు కూడా అదే దుర్గతి పట్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ కేటాయింపులు ఉన్న వాటికి రెగ్యులర్‌గా విడుదల చేయాల్సిన బిల్లులను నిలుపుదల చేయించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలు బడ్జెట్‌ కేటాయింపులు లేని వాటికి సైతం బిల్లులను చెల్లించాల్సిందేనని ఆర్థిక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో రెగ్యులర్‌ బిల్లులను నిలిపివేసి, చంద్రబాబు సూచించిన రంగాల బిల్లులనే అధికారులు చెల్లించారు. దీంతో రెగ్యులర్‌గా చెల్లించాల్సిన రంగాల బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి.

వీటిలో హోంగార్డుల వేతనాలు, డైట్‌ చార్జీలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాలు, ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్‌) తదితర అత్యవసర రంగాల బిల్లులు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించాల్సిన రూ.15 వేల కోట్ల బిల్లులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదిలీ అయ్యాయి. ఈ బిల్లుల చెల్లింపుపై ఆర్థిక శాఖ కార్యదర్శులు పీయూష్‌ కుమార్, సత్యనారాయణ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్‌ఎంఎస్‌), ట్రెజరీ, పేఅండ్‌అకౌంట్‌ ఆఫీస్, వర్క్‌ అండ్‌ ప్రాజెక్టు కార్యాలయ అధికారులతో మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 

ప్రస్తుత బడ్జెట్‌ నుంచి కొత్త కేటాయింపులు వద్దు 
గత ఆర్థిక సంవత్సరంలో నిధుల మళ్లింపు కారణంగా పెండింగ్‌లో పడిన బిల్లులు మొత్తం రూ.15 వేల కోట్లు ఉన్నాయని సమీక్షలో తేల్చారు. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన పెండింగ్‌ బిల్లున్నింటినీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి బదలాయించారు. ఇప్పుడు ఆ రూ.15 వేల కోట్ల బిల్లులు చెల్లింపునకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆదేశించారు. ఆ బిల్లులు చెల్లింపునకు ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకు కేటాయించిన బడ్జెట్‌ సరిపోతుందా లేదా అనేది పరిశీలించాలన్నారు. కేటాయింపులు సరిపోని పక్షంలో అదనపు బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ నుంచి కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయరాదని వెల్లడించారు. కొత్త బడ్జెట్‌ నుంచి పాత బడ్జెట్‌కు చెందిన బిల్లులు చెల్లించడానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. 

తిరస్కరించిన బిల్లులు మళ్లీ వచ్చాయెందుకు? 
కొన్ని రంగాలకు సంబంధించి డబుల్‌ బిల్లులు రావడాన్ని ఆర్థిక శాఖ కార్యదర్శలు తప్పుపట్టారు. సరిగ్గా పరిశీలన(స్క్రూటినీ) చేయకుండానే బిల్లులను పంపిస్తున్నారని, అందువల్లే డబుల్‌ పేమెంట్లు జరిగాయని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వాటికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరం ముగింపులో మార్చి నెలలో వచ్చిన రూ.8 వేల కోట్ల బిల్లులను తిరస్కరించామని, ఈ బిల్లులన్నీ మళ్లీ  చెల్లింపుల కోసం వచ్చేశాయని పేర్కొన్నారు. బిల్లులను తిరస్కరించి నెల రోజులు కాకుండానే మళ్లీ ఎలా తిరిగి వచ్చాయని ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆయా విభాగాల అధికారులను ప్రశ్నించారు. వీటిపై మరోసారి స్క్రూటినీ చేయాలని సూచించారు. 

కేంద్ర పథకాలకు మొండిచెయ్యి  
గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి మళ్లించిందని సమీక్షలో తేల్చారు. ఇప్పుడు ఆ రూ.3,000 కోట్లతోపాటు రాష్ట్ర వాటాను కూడా జోడించి ఆయా పథకాలకు విడుదల చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలకే బడ్జెట్‌ కేటాయింపులు ఉండడంతో నిధులు సరిపోవని నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర పథకాలకు నిధుల విడుదలను పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. కేంద్ర పథకాలకు నిధులు వ్యయం చేసి, వినియోగ పత్రాలు సమర్పిస్తే గానీ తదుపరి నిధులను కేంద్ర సర్కారు విడుదల చేయదు. 

ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు 
ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన బిల్లులను మరో ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన దుస్థితి గతంలో ఎన్నడూ రాలేదని ఆర్థిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి తన సొంత ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీశారని చెబుతున్నాయి.  

రూ.కోట్లు ఖర్చు చేసినా ‘సీఎఫ్‌ఎంఎస్‌’ నిష్ఫలమే! 
రూ.వందల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ఇప్పటికీ అక్కరకు రాలేదు. సీఎఫ్‌ఎంఎస్‌ పేరుతో ఇప్పటికే రూ.400 కోట్లు వ్యయం చేశారని, ఇప్పుడు మరో రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎఫ్‌ఎంఎస్‌ పారదర్శకంగా, యూజర్‌ ఫ్రెండ్లీగా లేదని ఆర్థిక శాఖ ఉద్యోగులు ఎప్పటి నుంచో గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. గత మూడు బడ్జెట్‌ల చెల్లింపులను సీఎఫ్‌ఎంఎస్‌లోనే చేస్తామని చెబుతూ వచ్చినప్పటికీ ఆఖరికి పాత గుడ్‌ గవర్నెన్స్‌ పోగ్రామ్‌లోనే చేయాల్సి వచ్చిందని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ను ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా మార్చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సీఎఫ్‌ఎంఎస్‌ పనితీరుపై ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మే 2న అన్ని శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించాలని ఆర్థిక శాఖకార్యదర్శులు పీయూష్‌ కుమార్, సత్యనారాయణ నిర్ణయించారు. అయితే, అన్ని శాఖల కార్యదర్శులతో ఒకేసారి సమావేశం నిర్వహిస్తే ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, అందుకే నాలుగు విడతలుగా ఆర్థిక శాఖలోనే అంతర్గత సమావేశాలను నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top