ఆవిడకు టిక్కెట్టా!?... వద్దే వద్దు..


ఈసారీ నాకే ఇద్దురూ!

 - ఇదీ గుండ మనసులో మాట

 ‘ఎక్కడైనా బావగానీ.. వంగతోట కాడ కాదు’అన్నట్టుగా ఉంది టీడీపీ సీనియర్ నేత గుండ అప్పలసూర్యనారాయణ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు వస్తుందని భావిస్తున్న లక్ష్మీదేవి తన సహధర్మచారిణి అయినప్పటికీ ఎమ్మెల్యే టిక్కెట్టును మాత్రం వదిలేది లేదన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సుదీర్ఘ రాజకీయ జీవితంలో స్థితప్రజ్ఞుడిగా గుర్తింపుపొందిన అప్పల సూర్యనారాయణకు ఇప్పుడు చెప్పుకోలేని కష్టం వచ్చిపడింది. ఈసారి తనకు కాకుండా భార్య లక్ష్మీదేవికి అసెంబ్లీ టిక్కెట్టు ఇస్తారన్న సమాచారం ఆయన్ని తీవ్ర అసహనానికి గురిచేస్తోంది.

 

 1985 నుంచి వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తొలిసారి 2004లో ఓటమిపాలయ్యారు. ‘మరొక్క ఛాన్స్ ప్లీజ్’అంటూ మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెగ ఆరాటపడుతున్నారు. వర్తమాన రాజకీయాలకు ఆయన సరిపడరని చంద్రబాబు 2009లోనే గుర్తించారు. అప్పటి ఎన్నికల్లోనే లక్షీదేవిని అభ్యర్థిగా నిర్ణయిస్తామన్నారు. ఆమెదే టిక్కెట్టు అని అనుకుంటున్న తరుణంలో గుండ వ్యూహాత్మకంగా ఎదురుతిరిగారు. తానే పోటీచేస్తానని కుటుంబ సభ్యుల వద్ద పట్టుబట్టారు. సానుకూలత రాకపోవడంతో అలకపాన్పు కూడా ఎక్కినట్లు ఆయన సన్నిహితులే చెబుతారు. ఆయన చిన్నబుచ్చుకోవడంతో లక్ష్మీదేవి నొచ్చుకున్నారు. ‘ఆయనకే టిక్కెట్టు ఇవ్వండి. నేను పోటీ చేయను’అని పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పేశారు. దాంతో అయిష్టంగానే చంద్రబాబు 2009లో కూడా అప్పల సూర్యనారాయణనే అభ్యర్థిగా ఖరారు చేశారు. కానీ భయపడినట్లే ఆయన మళ్లీ ఓడిపోయారు.

 

 మళ్లీ అదే సీన్..

 ప్రస్తుత ఎన్నికల తరుణంలో గుండ ఇంట మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ఈసారి మాత్రం లక్ష్మీదేవికే టిక్కెట్టు ఇస్తామని చంద్రబాబు కొంతకాలంగా సూచనప్రాయంగా స్పష్టం చేస్తూ వస్తున్నారు. అప్పల సూర్యనారాయణ మాత్రం ఇవేవీ పట్టించుకోలేదు. ఇటీవల విజయనగరం పర్యటన సందర్భంగా చంద్రబాబు కుండబద్దలు కొట్టేశారు. ‘ఈసారి లక్ష్మీదేవికి టిక్కెట్టు ఇస్తాం. మీరు గెలిపించుకురండి’అని తేల్చిచెప్పేశారు. అప్పటికప్పుడు అధినేత ముందు బయటపడనప్పటికీ ‘గుండ’కు ఈ నిర్ణయం రుచించలేదు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవడానికి ఆయన మనసు ససేమిరా అంటోంది. ‘టిక్కెట్టు బయటవ్యక్తులకు ఇవ్వడం లేదు కదా. మన ఇంటిలోనే ఉంటోంది కదా! ఒప్పుకోండి’అని కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో ఆయన హతాశుడయ్యారు. అటు పార్టీ అధిష్టానం, ఇటు కుటుంబ సభ్యులు తనను తప్పుకోమనడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. రాజకీయాల్లో ఇంతకాలం మచ్చలేకుండా ఉన్న తాను మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండానే రాజకీయ సన్యాసం చేయాల్సి వస్తుందన్న ఊహే ఆయన తట్టుకోలేకపోతున్నారు. తనకున్న అనర్హత ఏమిటని ఆయన తనను తానే ప్రశ్నించుకుంటూ మథనపడిపోతున్నారు.

 

  ‘పార్టీ ఏం చెబితే అది చేశాను. ధర్నాలు చేశాను.. వయోభారాన్ని లెక్కచేయకుండా ఆందోళనలు చేశాను. ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాను. కానీ నాకు టిక్కెట్టు ఇవ్వరా?’అని ఆయన సన్నిహితలు వద్ద వాపోతున్నారు. బలమైన రాజకీయ ప్రత్యర్థి ఉన్న జిల్లా కేంద్రంలో పార్టీ జెండాను మోసుకుతిరిగితే చివరికి మిగిలింది ఇదా!’అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్టు సాధించడం ఎలాగబ్బా అని మథనపడిపోతున్నారు. ఈసారీ టిక్కెట్టు వదులుకోవాలని లక్ష్మీదేవికి చెప్పలేక.. అలాగని ఆమెనే పోటీచేయనిచ్చేందుకు మనస్ఫూర్తిగా అంగీకరించలేక సతమతమైపోతున్నారు. తన మనోగతాన్ని గుర్తించి లక్ష్మీదేవే తనంతట తానుగా టిక్కెట్టును వదులుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. గుండవారికి ఎంతటి కష్టం వచ్చిపడిందో కదా!

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top