సరికొత్త చరిత్రకు ‘ప్రజా సంకల్పం’

New History YS jagan mohan reddy praja sankalpa yatra - Sakshi

ప్రజల వద్దకే, ప్రజల మధ్యకే వెళ్లి.. అన్ని అంశాలు వారికే నివేదించి, వారినే తీర్పు ఇవ్వమని కోరడమే ప్రజాసంకల్ప యాత్ర లక్ష్యం. ఇది ప్రజలలో చైతన్యాన్ని పెంచే యాత్ర. మాట తప్పి, విలువలను పాతర వేసిన వారిని, ప్రజాకోర్టులో నిలదీసే యాత్ర.

అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ప్రజలవద్దకు వెళ్ళడమే ప్రజా జీవితంలో మిగిలిన ఏకైక మార్గం. ఆ కారణంతోనే వై.యస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నవంబర్‌ 6 నుంచి ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ చేపట్టారు. వై.ఎస్‌.జగన్‌ చేస్తున్న ఈ యాత్ర సహజంగానే అధికార తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో అలజడి రేపుతోంది. 2012లో కాంగ్రెస్‌ పార్టీని వీడి.. కేంద్ర మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా అంగీకరించకుండా, నమ్మిన సిద్ధాంతం కోసం, రాజ కీయ విలువలకు కట్టుబడి ఉండాలన్న ఏకైక సంకల్పంతో బయటకు వచ్చి వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేశారు. దరి  మిలా ఆయనపై అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. ‘‘క్విడ్‌ప్రోకో’’కు పాల్పడ్డారంటూ కేసులు వేశారు. కొన్ని కేసులలో తెలుగుదేశం పార్టీ ఇంప్లీడ్‌ అయింది. దేశ న్యాయవ్యవస్థ చరి త్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 20 నెలల పాటు ముద్దాయికి జైలు శిక్ష విధించి బెయిల్‌ కూడా నిరాకరించింది. ఒక్క తన విషయంలోనే ఇంత కక్షపూరితంగా వ్యవస్థలు ప్రవర్తిం చినా జగన్‌ కుంగిపోలేదు, రాజీ బాట పట్టలేదు. ప్రజల్ని నమ్ముకొని పట్టుదలగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.

2014 ఎన్నికల్లో ఓటమితో వై.ఎస్‌.జగన్‌ కృంగిపోలేదు.  తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరిగిందన్న చేదు వాస్తవం ప్రజానీకం గుర్తించకపోలేదు. అయితే, మోదీ ప్రభావం, కాంగ్రెస్‌ పట్ల వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ చేసిన అలవికాని హామీలు, పవన్‌కల్యాణ్‌ జనసేన మద్దతు, టీడీపీ, బీజేపీ జతకట్టి కూటమి ఏర్పాటు వంటి అంశాలు వారికి అనుకూలంగా దోహదం చేశాయి. 

అయినా సరే టీడీపీ ఎన్నికల ముందు చేసిన హామీలపై నిలదీయడం ప్రారంభించారు వైఎస్‌ జగన్‌. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ యువతకు భృతి, దశలవారీ మద్యపాన నిషేధం, ఫీజుల రీయింబర్స్‌మెంట్, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య మొదలైన అనేకానేక హామీలపై పిల్లిమొగ్గలు వేసిన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు. ప్రధానంగా.. విభజిత రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ‘సంజీవని’లా పనికొచ్చే ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా’, ‘పోలవరంకు జాతీయ హోదా’ కల్పించి కేంద్రమే మొత్తం ఖర్చు భరించి 2018 నాటికల్లా పూర్తి చేసే హామీలపై దశలవారీగా ఉద్యమాలు చేశారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిన 3 లక్షల కోట్ల అవినీతికి ఆధారాలు చూపుతూ పుస్తకం ప్రచురించి జాతీయ పార్టీ నేతలముందు, కేంద్ర ప్రభుత్వ పెద్దల ముందు ఉంచారు. రైతులు, మహిళలు, యువత తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఎప్పటికప్పుడు అనేక ‘దీక్షలు’ నిర్వహించి ప్రజలలో ధైర్యాన్ని నింపారు.

ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీని బలహీన పరచడానికి చంద్రబాబు చేయని యత్నం లేదు. వాటిలో ప్రధానమైంది వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలతో ఫిరాయిం పుల్ని ప్రోత్సహించారు. నలుగురు ఫిరాయింపు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో... క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయిం   చారు. రాజ్యాంగ విలువల్ని పరిరక్షించాల్సిన గవర్నరే అధికార టీడీపీ సాగించిన వికృత రాజకీయ క్రీడలో భాగస్వామికావడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, రాజ్యాంగస్ఫూర్తికి అవమానం. అసెంబ్లీ బులెటిన్‌లో ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇప్పటికి వైఎస్సార్‌సీపీ జాబితాలోనే ఉన్నట్లు ప్రింటు చేస్తున్నారు.

రాజ్యాంగాన్ని రక్షించాల్సిన పెద్దలు అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు. ఒక రాజకీయ పార్టీ వ్యక్తిగత స్వార్థంకోసం, అధికారం కోసం రాజ్యాంగ విలువలను  పాతర వేశారు. ఫిరాయింపుల కంపుతో నిండిన సభలో కూర్చొని.. ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన పెద్దలు, వారి పార్టీ నేతలు ప్రవచించే ధర్మపన్నాలను, వల్లించే నీతి వాక్యాలను కళ్ళప్పగించి వింటూ కూర్చోవాలా? అందుకే నవంబర్‌ 10 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, కౌన్సిల్‌ శీతాకాల సమావేశాలలో పాల్గొనకూడదని వైఎస్సార్‌సీపీ నిర్ణయం తీసుకొంది. 

గత మూడున్నరేళ్ళుగా సభలో ప్రధాన ప్రతిపక్ష నేతకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా సాక్షాత్తు మంత్రులు, సీని యర్‌ సభ్యులు దుర్భాషలాడారు. రాయడానికి వీలులేని భాష ఉపయోగించారు. గౌరవ సభాధ్యక్షులు సభలో నిమిత్తమాత్రులుగా మిగిలిపోవడంతో, అధికారపక్ష సభ్యులు శాసన సభను ఓ క్రీడా మైదానంగా మలచుకున్నారు. ఇన్ని అవమానాలను ప్రధాన ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఓపిగ్గా భరిం చారు. తమ బొమ్మ పెట్టుకొని, తమ పార్టీ గుర్తుపై గెలిచిన సభ్యుల్లో కొందరు.. ప్రలోభాలకు లోనై ట్రెజరీ బెంచీల్లో కూర్చొని అనకూడని మాటలతో రెచ్చిపోయినా సంయమనం పాటించారు.
రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడిపోయి.. ‘ప్రత్యేక హోదా’ హక్కును వదులుకొన్న ‘తెలుగుదేశం’పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నమ్మి మోసపోయామన్న ఆవేదన ప్రతి వర్గంలో కనిపిస్తుంది. మాటలకు చేతలకు పొంతన లేదని.. అవినీతి విషయంలో హద్దులే లేవని ప్రజలు క్రమంగా అర్థం చేసుకుంటున్నారు. 

ఆర్థిక బలంతో, అధికార దుర్వినియోగంతో, పోల్‌ మేనేజ్‌మెంట్‌తో, ఓటర్ల మేనేజ్‌మెంట్‌తో మరోసారి ఎన్నికల్లో గెలవడానికి సర్వ హంగులు సమకూర్చుకొంటున్నారు. ఈ నేపథ్యంలోనే వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రద్వారా ప్రజల వద్దకే... ప్రజల మధ్యకే... వెళుతున్నారు. అన్ని విషయాలు వారితోనే నివేదిస్తారు, వారినే తీర్పు ఇవ్వమని అభ్యర్థిస్తారు. మాట తప్పిన వారిని, మోసం చేసిన వారిని, విలువలను పాతర వేసిన వారిని, ప్రజాకోర్టులోనే నిలదీస్తామని నివేదిస్తారు. ఆయన తలపెట్టిన ‘‘ప్రజా సంకల్ప యాత్ర’’ ప్రజలలో చైతన్యాన్ని పెంచుతుంది. డా‘‘ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికలకు ముందు సాగించిన ‘‘ప్రజా ప్రస్థానం’’ పాదయాత్ర ఏవిధంగానైతే చరిత్ర సృష్టించిందో.. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఈ సుదీర్ఘ పాదయాత్ర సరి కొత్త చరిత్ర సృష్టికి శ్రీకారం చుట్టడం తథ్యం!

డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు 
వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు
మొబైల్‌ : 99890 24579

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top