నవరత్నాల అజెండా.. ప్రారంభమైన కలెక్టర్ల సదస్సు

Navratnas Agenda Collectors Conference Started In Praja Vedika - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాలుగా సోమవారం కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో తొలిసారి ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. ఈ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌ భవిష్యత్‌ ప్రాణాలికను కలెక్టర్లకు వివరించనున్నారు. రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది.

సీఎం వైఎస్‌ జగన్‌ నిబద్ధతతో పనిచేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టో అమలులో చాలా నిబద్ధతతో పని చేస్తున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంక్షేమ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతి పథకాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రతి సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి వారం తాను కూడా కలెక్టర్లతో సమీక్షిస్తానని చెప్పారు. డైనమిక్ సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో అధికారులు, కలెక్టర్లు సమర్థవంతంగా పని చేయాలన్నారు. అధికారులంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. గంటల తరబడి సమీక్షలు పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టకూడదని సీఎం భావించినట్లు తెలిపారు. సృజనాత్మక ఆలోచనలు చేయటానికి అధికారులకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించారని చెప్పారు. అందుకే షెడ్యూల్‌ని అవసరమయిన సమయం మేరకు మాత్రమే నిర్థేశించారని తెలిపారు.

అందుకే ఇంత గొప్ప తీర్పు ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇంత గొప్ప తీర్పును ఇచ్చారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చెందిన ప్రతి ఒక్క రూపాయిని సద్వినియోగం చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. నవరత్నాలు ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం, అధికారులు పని చేయాలని సూచించారు. ప్రజల గ్రీవెన్స్‌ పరిష్కారం వేగంగా జరగడం లేదన్నారు. కలెక్టర్లు అంతా దీనిపై దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చెయ్యాలని ఆదేశించారు. కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని సూచించారు. నవరత్నాలతో రాష్ట్రంలో గొప్ప మార్పురాబోతోందని అన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతి లేని, పారదర్శకమయిన పాలన అందించేందుకు కృషి చేయాలన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రజలకు పారదర్శకంగా పథకాలను అందించాలని చెప్పారు. భూముల రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్పష్టం చేశారు. సోమవారం ఉండవల్లిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ రైతులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ శాఖలో ఖాళీలన్ని భర్తీ చేసి సమర్థంగా పనిచేస్తామని చెప్పారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రైతుల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top