
నాపై బురద జల్లుతున్నారు: నారా లోకేశ్
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరణ ఇచ్చారు.
విజయవాడ : ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేషన్‌లో పేర్కొన్న ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వివరణ ఇచ్చారు. గత ఆరేళ్లుగా తమ కుటుంబం అంతా స‍్వచ్ఛందంగా ఆస్తుల వివరాలు వెల్లడిస్తున్నామన్నారు. ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ఏ రాజకీయ పార్టీ కానీ, నాయకుడు కానీ తమలా ఆస్తులు ప్రకటించలేదన్నారు. ఎవరూ అడగకుండానే తాము ఆస్తులు ప్రకటిస్తున్నామన్నారు. ఆస్తుల విషయంలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తనపై కావాలనే బురద జల్లుతున్నారని ఆయన అన్నారు.
తనకు 23 లక్షల హెరిటేజ్ షేర్లు ఉన్నాయని, మార్కెట్‌లో ఆ షేర్ల విలువలు పెరగటం వల్లే ఆస్తులు విలువలు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. టీడీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఈ షేర్ల విలువ పెరిగిందని నారా లోకేష్ పేర్కొన్నారు. పది రూపాయల షేర్ విలువ 20 ఏళ్లలో రూ.2500కు చేరిందన్నారు. తాము తమ షేర్ల మార్కెట్ ధరను ఎప్పుడూ చెప్పలేదన్నారు.
కేవలం కొన్న ధరను మాత్రమే చెప్పామని లోకేశ్ తెలిపారు. తమ షేర్ ధర ఇప్పుడు వేయి రూపాయలకు చేరడంతో తన ఆస్తి రూ.330 కోట్లకు చేరిందని ఆయన అన్నారు. ఎటువంటి ఆరోపణలు లేని తనపై విమర్శలు చేస్తున్నారని నారా లోకేశ్ పేర్కొన్నారు. అందుకే ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. తమది వ్యవసాయ కుటుంబం అని, పాలు, కూరగాయలు అమ్ముకుని బతుకుతున్నామని లోకేశ్ అన్నారు.
సంబంధిత కథనం...