
సాక్షిపై అక్కసు వెళ్లగక్కిన నారా లోకేశ్
తెలుగువారి మనస్సాక్షిగా నిలిచిన 'సాక్షి'మీడియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ తన అక్కసు వెళ్లగక్కారు.
విజయవాడ: తెలుగువారి మనస్సాక్షిగా నిలిచిన 'సాక్షి'మీడియాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ తన అక్కసు వెళ్లగక్కారు. స్మోకింగ్ కంటే ఘోరమైంది...సాక్షి పేపర్ చదవడం, సాక్షి చానల్ చూడటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు దయచేసి సాక్షి పేపర్ చదవొద్దని, చానల్ చూడదంటూ లోకేశ్ సూచనలు చేశారు. ఆ పేపర్‌లో లేనిది రాస్తారు, చెప్పింది రాయరంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సాక్షి మీడియాను ఫాలో అయితే మెంటల్ బ్యాలన్స్ తప్పుతుందంటూ కొత్త భాష్యం చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన తన ఆస్తుల వ్యవహారంపై వచ్చిన ఆరోపణలపై లోకేష్ స్పందించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము ఒక పద్ధతి ప్రకారం వ్యాపారం చేసుకుంటున్నామని అన్నారు. తమది వ్యవసాయ కుటుంబమని, పాలు, కూరగాయలు అమ్ముకుంటూ నీతి నిజాయితీగా బతుకుతున్న తమపై ఆరోపణలు చేయడం తగదన్నారు.
శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ‍్యానని, అందువల్ల తనపై వచ్చిన ఆరోపణలపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. గతంలో కూడా తాము ఆస్తులు ప్రకటించామని, అయితే తాను చట్టసభకు వస్తున‍్నందువల్లే అయిదు నెలల్లో లోకేశ్ ఆస్తులు 23 రెట్లు పెరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అవకాశం దొరికినప్పుడల్లా ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే.