నంద్యాల మున్సిపల్ సమావేశానికి శనివారం వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు.
కర్నూలు: నంద్యాల మున్సిపల్ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు శనివారం నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై వేధింపులను ఖండిస్తూ నిరసన తెలిపారు. మరోవైపు కౌన్సిల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గుర్తింపు కార్డులు లేనివారిని పోలీసులు సమావేశానికి అనుమతించలేదు. కౌన్సిల్ ఛైర్మన్ దేశం సులోచన హాజరయ్యారు. కాగా ఈ నెల 18న చైర్మన్పై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చైర్మన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా...లేదా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు సులోచన, శిల్పా మోహనరెడ్డి సహా పలువురిపై కేసులు నమోదు చేసినా, వారిపై పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యాయత్నం కేసులు ఉన్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయరని వారు ప్రశ్నిస్తున్నారు.