వయసును గెలిచిన రేసువీరుడు

Nagababu Tallent In eteran Athletics East Godavari - Sakshi

వెటరన్‌ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతున్న నాగబాబు

జాతీయస్థాయిలో    పలు పతకాలు కైవసం

వయసు అయిదుపదులు దాటినా.. రేసులో ఆయన చిరుతే. ఆయన పరుగు పెడితే పతకం రావలసిందే. ఆయనే వెటరన్‌ అ«థ్లెటిక్స్‌ పోటీల్లో అరుదైన సత్తా చూపుతూ, అవార్డులు సాధిస్తూ జిల్లాకు పేరు తెస్తున్న యాతం నాగబాబు. ఆరోగ్యశాఖలో చిరుద్యోగి అయిన ఆయన జాతీయస్థాయిలో పలు పతకాలు సాధించారు. అంతర్జాతీయ పోటీల్లో పతక సాధనే లక్ష్యమంటున్న నాగబాబుకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లభించడం లేదు.

సామర్లకోట (పెద్దాపురం):
పేద కుటుంబంలో పుట్టిన నాగబాబుకు ప్రాథమిక విద్య చదివే నాటి నుంచి పరుగంటే మక్కువ. 1967లో యాతం సూర్యారావు, అచ్చుతామణిలకు పిఠాపురంలో జన్మించారు. సుమారు 25 ఏళ్ల క్రితం సామర్లకోటలో స్థిరపడ్డ  ఆయన ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం మలేరియా విభాగంలో సబ్‌ యూనిట్‌ ఆఫీసరుగా పని చేస్తున్నారు. ప్రాథమిక విద్యను పిఠాపురం మండలంలో పూర్తి చేసిన నాగబాబు  ఇంటర్, బీఎస్సీ డిగ్రీలను పెద్దాపురం మహారాణి కళాశాలలో పూర్తి చేశారు. 1979–80లో కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి గ్రిగ్‌ పోటీల్లో కబడ్డీ, ఖోఖోల్లో పాల్గొని జట్లు ప్రథమ బహుమతి సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 1985లో  అమలాపురంలో జరిగిన  ఇంటర్‌ కాలేజీయేట్‌ పోటీల్లో 100, 200, 400 మీటర్ల, లాంగ్‌ జంప్, త్రిబుల్‌ జంప్‌ పోటీల్లో పాల్గొని, పతకాలు సాధించి ఆల్‌  రౌండర్‌గా గుర్తింపు పొందారు. 1988లో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌ మీట్‌లో అనేక పతకాలు సాధించి అధికారుల దృష్టిలో పడ్డారు.  దాంతో 1991లో జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిరు ఉద్యోగిగా ఉద్యోగం వచ్చింది. తనకు గుర్తింపు తెచ్చిన పరుగును రోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తూ అనేక అవార్డులు సాధిస్తున్నారు.
ఇవీ దౌడుకు దక్కిన పతకాలు..
ప్రభుత్వోద్యోగులకు నిర్వహించే పోటీల్లో నాగబాబు ప్రతిసారీ ఏదో ఒక పతకాన్ని సొంతం చేసుకోవడం రివాజైంది. 2013లో కేరళలోని త్రివేండ్రంలో జరిగిన 100, 200, 400 మీటర్ల పరుగు పందెంలో రజత పతకాలు సాధించారు. 2014లో కర్నాటకలో జరిగిన 100, 200 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలు సాధించారు. 2015లో హర్యానాలోని రోహతక్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారు. అదే ఏడాది అంతర్జాతీయ స్థాయిలో ఆస్ట్రేలియాలో జరిగే వెటరన్‌ పోటీలకు భారతదేశం తరఫున  ఎంపికైనా.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్లలేక పోయారు. 2016లో ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో రజతం, 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. 2017లో మహారాష్ట్రలో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించారు. 2017 సెప్టెంబరులో న్యూజీలాండ్‌లో జరిగే అథ్లెటిక్‌ మీట్‌కు ఎంపికయ్యారు. అప్పడు కూడా ఆర్థిక ఇబ్బందులే ఆయనను పోటీలకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. 2017 నవంబరులో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన పోటీల్లో  400, 800 మీటర్ల పరుగులో కాంస్య పతకాలు సాధించారు. 2018 మార్చిలో థాయిలాండ్‌లో జరిగే ప్రపంచ మీట్‌కు  ఎంపికయినా.. తిరిగి ఆర్థికంగా వనరులు లేకే ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.  అయినా పరుగు సాధన మాత్రం మానలేదు. ఎప్పటికైనా అంతర్జాతీయ పతకాన్ని సాధించాలనుకుంటున్న నాగబాబు ఆశ నెరవేరాలని
ఆకాంక్షిద్దాం.

అంతర్జాతీయ స్థాయిలో పతకమే లక్ష్యం......
అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించాలని ఉంది. ఈ మేరకు నా ఆరోగ్యాన్ని కాపాడుకొంటూ ప్రతి రోజూ ప్రాక్టీసు చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, థాయిలాండ్‌ పోటీలకు వెళ్లలేక పోయాను. పేద  క్రీడాకారులకు దాతల ప్రోత్సాహం ఉండాలి.  భార్య ఆదిలక్ష్మీదేవి, కుమారులు సూర్యకిరణ్, నాగచక్ర మణికంఠ నన్నెంతగానో ప్రోత్సహిస్తున్నారు.                                            – యాతం నాగబాబు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top