‘నసనకోట’కు వీడిన గ్రహణం

Muthyalamma Temple Located Endowments Department Anantapur - Sakshi

దేవదాయశాఖ పరిధిలోకి ముత్యాలమ్మ ఆలయం

ఆలయ ఈఓగా బీవీ నర్సయ్య బాధ్యతల స్వీకరణ

27ఏళ్లుగా ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో దేవస్థానం

ఆలయ కమిటీ పేరుతో రూ.కోట్లు దండుకున్న మాజీ మంత్రి, బంధువులు

ఆలయ రికార్డులను వెంటనే అప్పగించాలని నోటీసు

సాక్షి, రాప్తాడు (అనంతపురం జిల్లా): నసనకోట ముత్యాలమ్మ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. నసనకోట ముత్యాలమ్మ.. ఈ పేరు జిల్లా నలుమూలలకే గాక కర్ణాటక రాష్ట్రంలోనూ వినిపిస్తుంది. కొన్నేళ్లుగా ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. ఆలయ ఈఓగా బీవీ నర్సయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 

25 ఏళ్లుగా రూ.కోట్లు కొల్లగొట్టారు
గతంలో రామగిరి ప్రాంతంపై నక్సల్స్‌ ప్రభావం ఉండేది. ఈప్రాంతంలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు, ఒకే కు టుంబానికి చెందిన వారే 25 ఏళ్లుగా మంత్రులు, ఎంఎల్‌ఏలుగా కొనసా గుతుండడంతో ఈప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగుతోంది. 1992 నుంచి ఈఆలయం ఇప్పటి వరకు 27 ఏళ్ల కాలం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ చైర్మన్‌లుగా కొనసాగుతూ వస్తున్నారు.  ఏటా ఆలయంలో వేలం పాట, హుండీ, టెంకాయలు, వాహనాల పార్కింగ్, గదుల బాడుగలు, మద్యంవిక్రయం ఏడాదికి రూ.2కోట్ల వరకు ఆదాయం వచ్చేది. భక్తులు అమ్మవారికి చీర, సారెలతోపాటు బంగారు, వెండి ఆభరణాలేకాక అధిక మొత్తం డబ్బులను, చెక్కులను ఆలయ కమిటీ చైర్మన్‌కు స్వయంగా అందజేశారని వైఎస్సార్‌సీపీ నాయకులు జేష్ట్యరామయ్య, నారాయణరెడ్డి, సూర్యం, హెచ్‌ఎస్‌.ముత్యాలు, నాగభూషణం, రామలింగారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రామాంజనేయులు తెలిపారు. 

19మంది సభ్యులతో ఆలయ కమిటీ
ముత్యాలమ్మ ఆలయ కమిటీ సభ్యులుగా తన అనుయానులనే 19 మందిని నియమించుకొని, కమిటీ చైర్మన్‌గా  మాజీ మంత్రి పరిటాల సునీత తండ్రి ధర్మవరపు కొండన్న కొనసాగే వారు. అధికారికంగా రూ.కోటి, రూ.2కోట్లు ఆదాయం చూపిస్తున్నా ఆలయ విరాళాలను కమిటీ సభ్యులకుగానీ, గ్రామస్తులకు తెలియనిచ్చేవారు కాదన్న విమర్శలు ఉన్నాయి. బంగారు,వెండి ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయించేవారని ఆ యా గ్రామాల ప్రజలు చెప్తున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’లో ‘ముత్యాలమ్మకే శఠగోపం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయి నా ఈ ప్రాంతంలో వారి ఆధిపత్యం కొనసాగింది.  

బందోబస్తుతో హాజరైన ఆలయ ఈఓ. గత ఆలయ కమిటీ సభ్యుల వివరాలను వెంటనే తెలియజేయాలని గదికి అంటించిన నోటీస్‌

కమిటీని రద్దు చేయాలని పోరాటం
ముత్యాలమ్మ ఆలయ కమిటీ పేరుతో కొన్నేళ్లుగా మాజీ మంత్రి కుటుంబ సభ్యులు రూ.కోట్లు దండుకుంటున్నారని ప్రస్తుత ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గత ఎన్నికల సమయంలో విమర్శించినా అప్పట్లో ఫలితం లేకపోయింది. ఈ విషయంపై ఉన్నతాధికారులు, దేవదాయశాఖ అధికారుల కు తెలిపినా పట్టించుకునేవారు కారు. ఆలయ దోపిడీపై పోరాటం చేస్తే ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందించింది. రెండు నెలల క్రితం ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి కొచ్చి, ఈఓ గా ఆనంద్‌ను నియమించారు. బాధ్యతలు స్వీక రించకుండా బెదిరించినట్లు విమర్శలు ఉన్నాయి. 

ఆలయ అభివృద్ధికి కృషి
ముత్యాలమ్మ ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని ఆలయ ఏఈఓగా బాధ్యతలు స్వీకరించిన బీవీ నర్సయ్య పేర్కొన్నారు. గతంలో కమిటీ సభ్యులు ఒక్కడ కొనసాగుతుండేవారని, ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి రావడంతో గత పాలకులు రికార్డులను బంగారు, నగల వివరాలను తెలియజేయాలని కమిటీ నిర్వహించే గదికి నోటీసులు అతికించినట్లు ఆయన తెలియజేశారు.  రామగిరి ఎస్‌ఐ నాగస్వామి ఆధ్వర్యంలో బందోబస్తు నడుమ ఈఓ బాధ్యతలు స్వీకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top