కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ....
చంద్రబాబు మా దేవుడు మంత్రి పరిటాల సునీత
అనంతపురం టౌన్ : కాపు నేత ముద్రగడ పద్మనాభం దీక్ష ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం అనంతపురంలోని మునిసిపల్ గెస్ట్ హౌస్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా దీక్ష చేసి రైలు తగులబెట్టారని, దాని కారణంగా ఎంతో మంది అమాయకులు జైలుకు పోయే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఆయన వెనుక ఎవరున్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. ఎవరో చెప్పిన మాటలు విని ధర్నాలు చేయడం మంచిది కాదన్నారు.
కాపులకు ఇచ్చిన హామీల అమలు కోసం చంద్రబాబు కృషి చేస్తుంటే.. ముద్రగడ ఇలాంటి చర్యలకు దిగడం సబబు కాదన్నారు. రోడ్లెక్కి జనాలను ఇబ్బందులకు గురిచేయొద్దని హితవు పలికారు. పరిటాల రవి హత్య విషయం చంద్రబాబుకు ముందే తెలుసన్న ముద్రగడ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ‘మీ రాజకీయాలు ఉంటే చేసుకోండి. కానీ నా భర్త పేరును రోడ్డుమీదకు లాగొద్దు. చంద్రబాబు దేవుడు. మేమీ స్థాయిలో ఉన్నామంటే దానికి ఆయనే కారణం’ అని అన్నారు.