మెరుగైన వసతులు కల్పిస్తాం

మెరుగైన వసతులు కల్పిస్తాం


అది కడపలోని ఆర్టీసీ బస్టాండు... ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతం ... ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ( సీటీఎం) ఎంవీ ప్రభాకర్‌రెడ్డి బస్టాండుకు చేరుకున్నారు. ఆదివారం సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారిన ఆయన పలు సమస్యలు తెలుసుకున్నారు. ప్రయాణీకులను పలకరించారు. ఆర్టీసీ మహిళా కండక్టర్లతో మాట్లాడారు. నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. ఏం చేస్తే బాగుంటుందని అడిగారు.   స్టాల్స్ వద్దకు వెళ్లి వాటర్ బాటిళ్లు, శీతల పానీయాలు ఎమ్మార్పీ ధరలకు అమ్ముతున్నారా? లేదా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్, విచారణ కేంద్రం, కంట్రోల్ పాయింట్.. ఇలా అన్ని ప్రాంతాల్లో  సమస్యలను తెలుసుకున్నారు. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దామని..  అందరూ సహకరించాలని కోరారు.  మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.  

 

 కడప ఆర్టీసీ బస్టాండులో నేరుగా ప్రొద్దుటూరు డిపోకు చెందిన బస్సు వద్దకు వచ్చారు.

 (అంతలోనే బస్సు వద్ద ఉరవకొండ....అనంతపురం అంటూ కేక పెడుతున్న మహిళా కండక్టర్‌తో)

 సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమ్మా నీ పేరేంటి? ఎంతమంది పిల్లలు. ఏం చేస్తున్నారు? ఆర్టీసీలో ఏమైనా ఇబ్బందులున్నాయా? మీకు సమస్యలు ఎప్పుడు ఎదురవుతున్నాయి? డ్రైవర్లు మీతో సక్రమంగా నడుచుకుంటున్నారా?)

 రామతులశమ్మ (ఉరవకొండ ఆర్టీసీ డిపో కండక్టర్) : నా పేరు రామతులశమ్మ. నాకిద్దరు పిల్లలు. ఇద్దరిలో ఒకరు ఎంటెక్ చేసి జెన్‌కో పనిచేస్తుండగా, మరొకరు స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆర్టీసీలో ప్రయాణీకులకు చిల్లరకు సంబంధించిన అంశంపైనే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. డ్రైవర్లంటే వారితో మేమే సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నాం. కొంతమంది తాగి వస్తుంటారు. సర్దుకుపోతున్నాం. అయినా మాట వినరు. వారి చేష్టలతో మాకే విసుగొస్తోంది. రద్దీ సమయంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటున్నాం.

 (సమీపంలో ఉన్న బస్సు కోసం వేచివున్న ప్రయాణీకురాలితో)

 సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమ్మా ఇక్కడున్నావ్! ఎక్కడికి వెళ్లాలి? ఎంత సేపటి నుంచి ఇక్కడ కూర్చొన్నావు. బస్సులు సమయానికి వస్తున్నాయా, రాలేదా? ఆకతాయిల సమస్యలేమైనా ఉన్నాయా?

 శాంతి : మాది హిందూపురం. బస్సు కోసం ఇక్కడ కూర్చొన్నాను. నిన్నా చూశా....ఈరోజు చూశా... విచారణ కేంద్రంలో బస్సు గురించి అడిగాను. వారు చెప్పిన సమయానికి బస్సులు వచ్చాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్టీసీ బస్టాండులో కూడా ఆకతాయిల సమస్య, ఇతర ఎలాంటి సమస్యలు లేవు.

 (బస్టాండులో ఎదురుగా నడిచి వస్తున్న వికలాంగుడితో)

 సీటీఎం ప్రభాకర్‌రెడ్డి : ఏమయ్యా...ఎక్కడికెళ్లాలి? ఏం చేస్తావు. ఎంతసేపటి నుంచి ఇక్కడున్నావు. బస్సులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా?

 వేణుగోపాల్ : సార్ మాది అనంతపురం జిల్లా. నేను హిందూపురం ఏడీజే కోర్టులో పనిచేస్తున్నాను. పనిమీద ఇక్కడికి వచ్చి బస్సుకోసం ఎదురు చూస్తున్నాను. బస్సులో నాకెప్పుడూ కూడా సీటు గురించి ఇబ్బంది ఎదురు కాలేదు.

 (ఇంతలోనే బస్టాండులో నడుస్తూ విచారణ కేంద్రంలో ఉన్న మహిళా అనౌన్సర్ దగ్గరికి వెళ్లి)

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : నీ పేరేంటి? ఎంతకాలం నుంచి ఉన్నావు? ఉద్యోగం ఎలా ఉంది. బస్సుల వివరాలు మైకు ద్వారా చెప్పేటపుడు ప్రయాణీకులనుంచి వస్తున్న ఇబ్బందులేంటి? డ్రైవర్లు, కండక్టర్లు సమాచారం ఇస్తున్నారా?

 ప్రియాంక : నేను ఈ మధ్య కాలంలోనే జాయిన్ అయ్యాను. కొంతమంది ప్రయాణీకులు ఆవేశంతో ఉన్నారు. ఒకటి, రెండుసార్లు చెప్పినా పదేపదే వచ్చి అడుగుతుంటారు. కొంతమంది డ్రింకర్స్ అడిగిందే అడుగుతుంటారు. కొంత ఇబ్బందిగా ఉంటుంది. డ్రైవర్లు, కండక్టర్లు వచ్చిబస్సుకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు.

 (విచారణ కేంద్రం వద్దకు బస్సుకు సంబంధించిన సమాచారం కోసం వచ్చిన వికలాంగుడితో)

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏం బాబూ ఏ ఊరు మీది? బస్సులో ఎక్కువ తిరుగుతుంటావా? వికలాంగులకు సీట్లు కేటాయించాం. ఎవరైనా ప్రయాణీకులు కూర్చొన్నా నీకు ఇస్తున్నారా?

 జాషువా (ఎర్రగుంట్ల) : సార్  వికలాంగుల పట్ల కొంతమంది కండక్టర్లు, సిబ్బంది నీచంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా చిల్లర లేకుండా ఎలా ఎక్కుతావంటూ కోపంతో ఊగి పోతున్నారు. సపరేట్ సీట్లు వికలాంగులకు ఉన్నా ఎవరూ ఇవ్వడం లేదు సార్.

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : బస్సులు సక్రమంగా నడుపుతున్నారా? పరిశుభ్రత, మురుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్నారా? బస్టాండ్లలో ఎమ్మార్పీ ధరలకే అమ్ముతున్నారా?

 విజయమ్మ (ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్) : బస్సులను సక్రమంగా సమయపాలన పాటించేలా పంపిస్తున్నాం. పరిశుభ్రత విషయంలో ప్రత్యేకంగా ఎప్పటిప్పుడు   చర్యలు చేపడుతున్నాం. మరుగుదొడ్లను వినియోగించే వారి నుంచి అధిక మొత్తం వసూలు చేస్తే కాంట్రాక్టర్‌కు ఫైన్ వేస్తాం. ఎమ్మార్పీ ధరల కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తీసుకుంటున్నాం.  

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : బస్టాండులో ఏవైనా సమస్యలున్నాయా? బస్సులు సమయానికి రాక ఇబ్బందులు ఉన్నాయా? పండుగ వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందిగదా మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

 కన్యాకుమారి (డిపో మేనేజర్) : కడప డిపో పరిధిలో బస్సులు సమయపాలన పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. పండుగ వేళల్లో రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు వేస్తున్నాం. ఇందులో సాధారణ ఛార్జీలు కాకుండా 50 శాతం అదనంగా వసూలు చేస్తున్నాం. ఆర్టీసీ బస్టాండును పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం.

 (కంట్రోల్ పాయింట్ వద్దనున్న డ్రైవర్లతో)

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏమయ్యా? డ్రైవర్లకు ఏమైనా జాగ్రత్తలు చెబుతున్నారా? బ్రీత్ ఎనలేజర్‌తో పరీక్షిస్తున్నారా?

 ఎస్‌జీ పీర్ (బద్వేలు) : సార్, కంట్రోల్ పాయింట్ వద్ద చార్టులో ప్రమాద సూచికలను చూపిస్తున్నారు. తదనుగుణంగా ఆయా రూట్లలో వెళ్లేటపుడు జాగ్రత్తగా వెళ్లేలా ఇక్కడ చెబుతున్నారు. అంతేకాకుండా డ్యూటీకి వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఇక్కడ బ్రీత్ ఎనలైజర్‌తో చెక్ చేసి మమ్మలను పంపిస్తున్నారు.  

 (అంతలోనే వచ్చిన బస్సులోకి ఎక్కి మహిళా ప్రయాణీకురాలితో)

 సీటీఓ ప్రభాకర్‌రెడ్డి : ఏమమ్మా? ఏ పేరేంటి ఎక్కడికి వెళుతున్నావు? మహిళా సీట్లలో వారినే కూర్చొబెట్టాలని ఉంది? అందుకు అనుగుణంగా ఎవరైనా కూర్చొన్నా సీట్లు ఇస్తున్నారా?

 ప్రయాణీకురాలు : నా పేరు పద్మ. నేను ప్రొద్దుటూరుకు వెళుతున్నా. అప్పుడప్పుడూ బంధువుల ఇంటికి, ఇతరత్రా పనులపై ప్రయాణిస్తుంటాను. లేడీస్ సీట్లు అనగానే లేచి ఇస్తున్నారు. ఇప్పటివరకైతే ఎలాంటి ఇబ్బంది రాలేదు.

 

 ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం..

 జిల్లాలోని ఎనిమిది డిపోల్లో సుమారు 950 బస్సులు తిరుగుతున్నాయి. సుమారు 250 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తుండగా, మరో 100 మందికి పైగా మహిళా ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారు. మహిళలకు  ఎదురవుతున్న సమస్యలను వీఐపీ రిపోర్టర్ ద్వారా తెలుసుకున్నాం. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని సీటీఓ, వీఐపీ రిపోర్టర్ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు.   

 

 - బస్టాండ్లలో మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు అధిక మొత్తాలు వసూలు చేస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు.   ప్రయాణీకులకు  మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు కేటాయించిన సీట్లలోవారినే కూర్చోబెట్టేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చిల్లర  సమస్యపై కూడా ఆలోచిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top