‘సీఎం జగన్‌ ప్రతిష్ట పెరుగుతూనే ఉంది’

Mopidevi Venkataramana Conmments In Cm Jagan Meeting In Mummidivaram - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రపంచ మత్య్సకార దినోత్సవం జరుపుకోవడం ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అరుదైన ఘటన అని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సభకు హాజరైన మంత్రి మాట్లాడుతూ.. గత పాలకుల తీరుతో పాలన గాడి తప్పడంతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమైందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మాట తప్పకుండా అమలు సీఎం జగన్‌ చేస్తున్నారన్నారు. మత్స్యకారులకు అనేక వరాలు ప్రకటించారని, వారు ఆర్థికంగా నిలబడేందుకు ఈ వరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ఆక్వా, మెరైన్‌కు సంబంధించి మెరైన్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఇక అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే మత్స్యకారుల సమస్యలను సీఎం జగన్‌ పరిష్కరిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మనసున్న వ్యక్తిగా ప్రతి వర్గంలోనూ సీఎం జగన్‌ ప్రతిష్ట పెరుగుతూనే ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం, ఇసుక కొరతపై తీసుకున్న నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. గతంలో గోగుల్లంక వంతెనకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హామీ ఇచ్చారని, దానిని పూర్తి చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సహకరించాలని సాంఘిక, సంక్షేమశాఖ మంత్రి విశ్వరూప్‌ కోరారు. ఐ పోలవరం మండలం మూలపాలెం వారధి కోసం పది కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, అయితే గత పదేళ్లలో ఆరో పిల్లర్‌ కూడా పడలేదని.. దానికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top