రక్షణ కల్పిస్తారా.. ఊరు ఖాళీ చేయమంటారా ?


టీడీపీ వర్గీయుల దాడులపై రూరల్ ఎస్పీతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి

సాక్షి, గుంటూరు: జిల్లాలోని అనేక గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు వారికే సహకరిస్తూ తమపై ఎదురు కేసులు పెడుతున్నారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురువారం రూరల్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు.

ముఖ్యంగా నరసరావుపేట మండలం యల్లమంద గ్రామంలో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని, రెండు నెలల వ్యవధిలో ఆ గ్రామంలో ఏడుసార్లు దాడులకు తెగబడ్డారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలని ఎస్పీని కోరారు.

ఎస్పీగా మీరు రక్షణ కల్పిస్తే గ్రామంలో ఉంటారని లేదంటే గ్రామం విడిచి వెళ్లిపోతారని తెలిపారు.

గ్రామంలో శిలాఫలకాలు ధ్వంసం చేయడం, వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెలు పగలగొట్టడం, ఇళ్లపై దాడులు చేసి ధ్వంసం చేయడం ఇలా ఎన్ని అరాచకాలకు పాల్పడుతున్నా వారిపై కఠినమైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఎస్పీ దృష్టికి తెచ్చారు.

దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఇతర గ్రామాల నాయకులను ఆసుపత్రిలోనే కొట్టినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మేం చేసేదేమీ లేదు..సారీ అంటూ నరసరావుపేట పోలీసు అధికారులంతా చేతు లెత్తేస్తున్నారని వారి వల్ల తమకు న్యాయం జరిగే పరిస్థితి లేదని ఎస్పీకి తెలిపారు.

ఒకటికి మించి ఎక్కువ కేసుల్లో ఉన్న నిందితులను గుర్తించి వారిపై రౌడీషీట్‌లు ఓపెన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకు రక్షణ కల్పించడం ఈ ప్రభుత్వానికి చేతకాదంటే చెప్పండి మేమే ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతామంటూ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఎస్పీతో చెప్పారు.

దీనికి స్పందించిన రూరల్ ఎస్పీ రామకృష్ణ యల్లమంద గ్రామంపై ప్రత్యే దృష్టి సారించి దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాడులపై అసెంబ్లీలో చర్చకు అనుమతించకపోవడం దారుణం...

వైఎస్సార్ సీపీ నాయకులను హతమార్చినా, దాడులకు పాల్పడిన సంఘటనలపై అసెంబ్లీలో చర్చకు కూడా స్పీకర్ అనుమతించకపోవడం దారుణమని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

రూరల్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ మనుషుల ప్రాణాల కంటే ముఖ్యమైన చర్చ ఏముంటుందో చెప్పాలని టీడీపీ నాయకులను కోరారు.

జిల్లాలో టీడీపీ నాయకులు పలు గ్రామాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి మరీ దాడులు చేస్తున్నారని, ఇప్పటికైనా వీటిని ఆపకపోతే వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top