
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి పెదపాటి బుచ్చిరాజు భార్య కమల(65) రాజమహేంద్రవరంలో తన కుమార్తెను చూసేందుకు గురువారం వెళ్లి మేడ మెట్లపై నుంచి కాలుజారి పడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. గురువారం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ సాయంతో చికిత్స చేయాలని, అయినా ప్రాణం నిలబడుతుందన్న నమ్మకం లేదని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు అందుకు సిద్ధమయ్యారు.
ఇంతలో బంధువుల్లో ఒకరు ఆమె చనిపోయిందని.. వైద్యులు ఇంటికి తీసుకెళ్లిపొమ్మన్నారని చెప్పడంతో రాజమహేంద్రవరంలోని ఆమె కుమార్తె ఇంటికి తీసుకొచ్చారు. రాజానగరంలోని బట్టల వర్తకులు సంతాపాన్ని పాటిస్తూ దుకాణాలు మూసివేశారు. విదేశాల్లో ఉన్న మనవడి కోసం ఆమెను గురువారం రాత్రంతా ఉంచారు. శుక్రవారం అంతిమయాత్రకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆమె కదులుతుందని గమనించిన అక్కడున్నవారు బతికే ఉందని తెలిపారు. దీంతో బంధువులు స్పూన్‌తో పాలు కమల నోట్లో పోయడం, వాటిని ఆమె మింగడంతో బతికుందని నిర్ధారించుకున్న బంధువులు హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.